పోయిన ఉంగరం 63 ఏళ్ల తర్వాత మళ్లీ..!

పాతకాలం నాటి ఓ అరుదైన వస్తువు దొరికితే మనం ఏం చేస్తాం..? దాన్ని భద్రంగా దాచుకుంటాం. కానీ అమెరికాకు చెందిన ఓ యువతి మాత్రం అలా ఆలోచించలేదు. తనకు దొరికిన ఓ బంగారు ఉంగరాన్ని....

Updated : 16 Jun 2021 10:01 IST

వాషింగ్టన్‌: పాతకాలం నాటి ఓ అరుదైన వస్తువు దొరికితే మనం ఏం చేస్తాం? దాన్ని భద్రంగా దాచుకుంటాం. కానీ అమెరికాకు చెందిన ఓ యువతి మాత్రం అలా ఆలోచించలేదు. తనకు దొరికిన ఓ బంగారు ఉంగరాన్ని.. అది ఎవరిదో వారి వద్దకు చేర్చాలనుకుంది. అందుకు ఏకంగా డిటెక్టివ్‌ అవతారమెత్తి చివరకు అనుకున్నది సాధించింది. ఆరు దశాబ్దాల క్రితం పోగొట్టుకున్న ఉంగరం వెతుక్కుంటూ తన వద్దకు రావడంతో ఆ వృద్ధుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అసలేం జరిగిందంటే..

అమెరికాలోని బ్రోక్‌పోర్ట్‌కు చెందిన మేరీ జో ఓర్జెక్‌కు లాక్కవన్నా నగరంలో తన పూర్వీకులకు చెందిన ఓ ఇల్లు ఉంది. గతేడాది ఆ ఇంటిని సర్దుతుండగా ఓర్జెక్‌కు ఓ అరుదైన ఉంగరం దొరికింది. నీలి వర్ణం రాయి పొదిగిన బంగారు ఉంగరం అది. అయితే అది మృతిచెందిన తన తల్లిదండ్రులది కాదని ఆమెకు తెలుసు. దీంతో అది ఎవరిదో వారి వద్దకు చేర్చాలనుకుంది ఓర్జెక్‌. 

ఉంగరం గురించి ఆరా తీస్తూ లాక్కవన్నాలో తన తండ్రి చదివిన పాఠశాలకు వెళ్లింది. అక్కడ ఉన్న లైబ్రేరియన్‌ను సంప్రదించగా.. ఉంగరంపై ఉన్న ‘ఈఎల్‌డీ’ అనే అక్షరాలతో అది ఆ పాఠశాలలో చదివిన 1955 బ్యాచ్‌కు చెందిన విద్యార్థికి చెందినదిగా గుర్తించారు. అయితే ఆరు దశాబ్దాల క్రితంనాటి ఆ రిజిస్టర్‌ వారికి అక్కడ లభించలేదు. దీంతో ఆమె ఆ పాఠశాల మాజీ లైబ్రేరియన్‌ సుసాన్‌ పలుంబోని సంప్రదించింది. తన వద్ద ఉన్న వివరాలను ఆయనకు వివరించింది. దీంతో ఆ మాజీ లైబ్రేరియన్‌ 1955 నాటి రిజిస్టర్‌ను వెలికితీసి అది యూజీన్ డార్మ్‌స్టెడ్టర్ అనే వ్యక్తిదిగా తెలిపారు.

దీంతో యూజీన్‌ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది ఓర్జెక్‌. అయితే ఆయన లాక్కవన్నాలోనే ఉంటున్నారని.. అగ్నిమాపక శాఖలో విధులు నిర్వహించి రిటైర్‌ అయినట్లు తెలుసుకుంది. యూజీన్‌ వద్దకు వెళ్లిన ఓర్జెక్‌ ఆ ఉంగరాన్ని ఆయనకు చూపించింది. దాన్ని చూసిన 80 ఏళ్ల యూజీన్ డార్మ్‌స్టెడ్టర్ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ ఉంగరాన్ని తాను 1958లో పోగొట్టుకున్నానని, ఎంత వెతికినా అది మళ్లీ దొరకలేదని చెప్పారు. ఆరు దశాబ్దాల క్రితం పోగొట్టుకున్న ఆ ఉంగరాన్ని తిరిగి తీసుకొచ్చి తనకు ఇచ్చిన ఓర్జెక్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. కాగా, ఇందుకు సంబంధించిన కథనం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఓర్జెక్‌ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని