Selfie video: ఒక్క సెల్ఫీ వీడియో.. పదేళ్ల భూ వివాదానికి పరిష్కారం 

దాదాపు పదేళ్లుగా పరిష్కారం కాని భూ వివాదం.. మాట వినకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానని సీఐ బెదిరింపులు.. విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు ..

Published : 13 Sep 2021 01:21 IST

కడప: దాదాపు పదేళ్లుగా పరిష్కారం కాని భూ వివాదం.. మాట వినకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానని సీఐ బెదిరింపులు.. విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యే శరణ్యం అనుకున్నారు ఆ దంపతులు. కానీ, వాటన్నింటికీ ఒక్క సెల్ఫీ వీడియోతో పరిష్కారం లభించింది. ఎదుటి వ్యక్తి ఎంత బలవంతుడైనా న్యాయంగా పోరాడితే ధర్మం మనకు అండగా నిలుస్తుందనడానికి ఈ సెల్ఫీ వీడియో గొప్ప ఉదాహరణ.

కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్‌ బాషా కుటుంబం కన్నీరు పెడుతూ శుక్రవారం రాత్రి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన సెల్ఫీ వీడియో విస్తృత ప్రచారమైంది. సీఎం కార్యాలయం, కడప ఎస్పీ స్పందించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అక్బర్‌ కుటుంబానికి అండగా నిలిచాయి. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని అన్ని పార్టీలు డిమాండ్‌ చేశాయి. అన్ని వైపుల నుంచి వత్తిడి  రావడంతో తిరుపేల రెడ్డి దెబ్బకు దిగొచ్చి అక్బర్‌ బాషాతో రాజీ కుదుర్చుకున్నారు. ‘‘ దువ్వూరు వైకాపా నేత తిరుపేల రెడ్డితో రాజీకుదుర్చుకున్నాం. తమకు సంబంధించిన భూమిని తనకే రాసిస్తానని తిరుపేల  రెడ్డి కుటుంబం అంగీకరించింది. రెండు.. మూడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది’’ అని అక్బర్‌ బాషా కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఏం జరిగిందంటే?

‘నంద్యాలలో మైనారిటీ కుటుంబం మాదిరి సెల్ఫీ వీడియో తీస్తున్నా. కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలో నాకున్న ఎకరన్నర భూమిని వైకాపా నేత తిరుపేలరెడ్డి కుటుంబం ఆక్రమించి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంది. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. శుక్రవారం సాయంత్రం మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డి మమ్మల్ని పోలీసుస్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. తిరుపేలరెడ్డి చెప్పినట్లు వినకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తానని హెచ్చరించారు. సీఎం జగన్‌ సర్‌.. ఇదెక్కడి అన్యాయం సర్‌. మీ పాలనలో పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చూడండి. నేను కూడా వైకాపా కార్యకర్తనే. ఈ వీడియో మీకు చేరుతుందనే ఆశిస్తున్నా. సోమవారం సాయంత్రంలోగా న్యాయం జరగకపోతే మా నలుగురు కుటుంబీకులం ఆత్మహత్య చేసుకుంటాం. మా శవాలను చూసైనా మనసు కరుగుతుందని ఆశిస్తున్నా సర్‌..’ ఇది కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్‌బాషా కన్నీరుపెడుతూ శుక్రవారం రాత్రి 11.30కు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన సెల్ఫీ వీడియో. విస్తృత ప్రచారమైన ఈ సంఘటన వివరాలివి.

భూమిపై కోర్టులో కేసుంది...!

అక్బర్‌బాషా కుటుంబం దువ్వూరు మండల సమీపంలోని కర్నూలు జిల్లా చాగలమర్రిలో నివసిస్తోంది. సర్వేనంబరు 325లో ఎకరన్నర భూమిని తన భార్య అప్సానాను పెంచిన తల్లి కాశీంబీ 2009లో దానవిక్రయం కింద రిజిస్ట్రేషన్‌ చేయించి ఇచ్చారని అక్బర్‌బాషా చెబుతున్నారు. భూమి కాశీంబీ పేరుతో అనువంశికంగానే ఉందని భావించి 2012లో వైకాపా నేత తిరుపేలరెడ్డి ఇందులో ఎకరం భూమి ఆక్రమించుకున్నారని తెలిపారు. ఈ భూమిని తిరుపేలరెడ్డి తన కుమారుడు విశ్వేశ్వర్‌రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నారంటూ మైదుకూరు సివిల్‌ కోర్టులో తాము వేసిన వ్యాజ్యం కొనసాగుతోందని అక్బర్‌బాషా వివరించారు. ఇదే క్రమంలో తమ కుటుంబాన్ని శుక్రవారం సాయంత్రం మైదుకూరు గ్రామీణ పోలీసుస్టేషన్‌కు పిలిపించారని తెలిపారు. తాజాగా తిరుపేలరెడ్డి కుటుంబం ఈ పొలంలో నాట్లు వేయించిందని అక్బర్‌ ఆరోపించారు. దీన్ని తట్టుకోలేక ఇంటికి వెళ్తూ కుందూ నదిలో దూకాలని నిర్ణయించుకున్నామని, ఇద్దరు పిల్లలుండడంతో ఇంటికి వెళ్లి ఆలోచించామని అక్బర్‌బాషా దంపతులు తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని కడప ఎస్పీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో అభిప్రాయపడ్డారు.

ఒప్పందం రద్దు..

2009లో చేసిన దాన విక్రయ ఒప్పందాన్ని కాశీంబీ రద్దు చేసుకుని తిరుపేలరెడ్డి కుమారుడికి ఎకరం భూమి విక్రయించారు. అనంతరం 2012లో న్యాయస్థానంలో కేసు దాఖలైనప్పటినుంచి ఈ భూమి సేద్యం కావడం లేదు. సుమారు ఏడాది కిందట తీర్పు వచ్చాక తిరుపేలరెడ్డి తన బంధువుకు ఈ భూమిని కూడా విక్రయించారు. తాజాగా వారు సేద్యానికి సిద్ధమవడంతో మళ్లీ వివాదమేర్పడింది.

బలవంతంగా సంతకాలు: కాశీంబీ

‘అప్సానా నా పెంపుడు కుమార్తె కాదు. ఆమె నా సోదరుడి కుమార్తె. ఎకరన్నర భూమికి, అక్బర్‌బాషా కుటుంబానికి సంబంధం లేదు. నాకు మత్తుమందిచ్చి బలవంతంగా పత్రాలపై లోగడ సంతకాలు పెట్టించుకున్నారు. అక్బర్‌బాషా చెప్పేవన్నీ అవాస్తవాలు. భూమికి సంబంధించి అసలు పత్రాలు నా వద్దే ఉన్నాయి’ అని కాశీంబీ కడప ప్రెస్‌క్లబ్‌లో విలేకరులకు తెలిపారు.

స్పందించిన సీఎం కార్యాలయం

అక్బర్‌బాషా సెల్ఫీవీడియో వ్యవహారంపై సీఎం కార్యాలయం స్పందించింది. కడప ఎస్పీ అన్బురాజన్‌నుంచి వివరాలను సేకరించింది. అనంతరం బాధిత కుటుంబాన్ని ఎస్పీ పిలిపించగా.. వారు కడప మేయర్‌ సురేష్‌బాబు, మైనారిటీ నేతలతో కలిసి వచ్చి కలిశారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అక్కడికక్కడే ఎస్పీ సీఎం కార్యాలయం అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

సీఐ కొండారెడ్డిపై వేటు

మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణాధికారిగా అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించామని, రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. అప్పటివరకు సీఐని విధుల నుంచి తప్పిస్తున్నామని, నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని అన్నారు. సెల్ఫీవీడియో పోస్టు చేయగానే చాగలమర్రి, మైదుకూరు పోలీసులను అప్రమత్తం చేసి బాధిత కుటుంబం అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడామని, పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 9న ‘స్పందన’లో అక్బర్‌బాషా పిటిషన్‌ ఇచ్చారని, దానిపై విచారిస్తుండగానే ఈ వీడియో వైరల్‌ అయ్యిందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు