Published : 21 Aug 2020 14:21 IST

బంధాన్ని విడగొట్టే వ్యాపారం!!

డబ్బులిస్తే మీరు చేయాల్సిన హోంవర్క్‌ను మరొకరు చేసిస్తారు. ఎవరికైనా క్షమాపణ చెప్పాలంటే డబ్బులిచ్చి మీ బదులు మరొకరితో క్షమాపణ చెప్పించొచ్చు. అంతేందుకు మీకు తినాలనిపించినా.. తినకూడదు అనుకుంటే డబ్బులిస్తే మీ బదులు మరొకరు తిని పెడతారు. ఇలాంటి విచిత్ర సేవలన్నీ జపాన్‌లో కోకొల్లలు. వాటిల్లో ఒకటి ‘రిలేషన్‌షిప్‌ బ్రేకర్స్‌’. భార్యభర్తలు లేదా ప్రేమికులు వీరిలో ఎవరికైనా విడిపోవాలని ఉంటే రిలేషన్‌షిప్‌ బ్రేకర్స్‌ వారి బంధాన్ని విడగొడతారు. విడాకులు ఇప్పించడానికి కావాల్సిన సాక్ష్యాలను తెచ్చిస్తారు. ఇలాంటి వ్యాపారాన్ని ‘వకరెససెయా’ అని పిలుస్తారు. ఈ ఏజెన్సీలు జపాన్‌ వ్యాప్తంగా విస్తరించాయి. సమాజం దీనిని వ్యతిరేకిస్తున్నా.. చాలా కాలంగా ఈ సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

ఒక్కసారి కేసు ఒప్పుకున్న తర్వాత భార్యభర్తలు లేదా ప్రేమికులను విడగొట్టేందుకు ‘వకరెససెయా’ సిబ్బంది ఎంతకైనా తెగిస్తారు. ఎవరినైతే విడగొట్టాలో వారిని మొదట కొన్నిరోజులు గమనిస్తారు. రోజూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలని సేకరిస్తారు. ఎవరికైనా వివాహేతర సంబంధాలు ఉంటే వారు కలుసున్న వీడియోలను తీస్తారు. అలాంటివి లేకపోతే వీరే సృష్టించే ప్రయత్నం చేస్తారు. పురుషులను మహిళా ఉద్యోగులు, మహిళలను పురుష ఉద్యోగులు పరిచయం చేసుకుంటారు. వారితో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తారు. ఎవరైనా నిగ్రహం కోల్పోయి అతిగా ప్రవర్తిస్తే దాన్ని వీడియో తీస్తారు. అలా వారి క్యారెక్టర్‌ను చెడ్డగా చూపించి విడాకులు వచ్చేలా లేదా విడిపోయేలా చేస్తారు.

ఎవరైనా అమ్మాయి/అబ్బాయికి పడకపోతే వారి చర్యలు మరింత తీవ్రమవుతాయి. అబద్దాలు చెప్పి, నమ్మించి నకిలీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిస్తారు. ఆర్థికంగా బాగా నష్టపరుస్తారు. రౌడీలను పంపించి బెదిరిస్తారు. మొత్తానికి బంధాన్ని తెంచే వరకు నిద్రపోరు. అయితే ఇలాంటి ఏజెన్సీలపై ప్రజలు మండిపడుతున్నారు. వీటి వల్ల కాపురాలు కూలిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ వర్గాలు మాత్రం ప్రజల వాదనను తోసిపుచ్చుతున్నాయి. తాము కేసు తీసుకునే ముందే కస్టమర్‌తో పలుమార్లు చర్చలు జరుపుతామని చెబుతున్నారు. వారు తమ భాగస్వామితో విడిపోవాలనుకోవడానికి బలమైన కారణాలుంటేనే కేసును ఒప్పుకుంటామని అంటున్నారు. కేసు స్థాయిని బట్టి వందల డాలర్ల నుంచి లక్షల డాలర్ల వరకు ఫీజు తీసుకుంటారట. 2000 సంవత్సరంలో మొదలైన ఈ సేవలు ఏటా విస్తరిస్తూ వస్తున్నాయి. ఈ మధ్య అనేక ప్రాంతాల్లో స్థానిక డిటెక్టివ్‌లతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీంతో వీటిని ఆశ్రయించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందట. దీన్నే అంటారు యాపారం అని!!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని