ఈ ఏడాది ట్విటర్‌లో సందడి వీరిదే

ఈ ఏడాది ట్విటర్‌లో సందడి చేసి ట్రెండింగ్‌లో నిలిచిన ట్వీట్లను ట్విటర్‌ ఇండియా సంస్థ మంగళవారం ప్రకటించింది. భారత్‌లో జనవరి 1 నుంచి నవంబరు 15 మధ్య విశేషాదరణ పొందిన ట్వీట్లకు ఈ జాబితాలో స్థానం కల్పించింది........

Published : 09 Dec 2020 13:48 IST

రీ ట్వీట్లలో విజయ్, లైకుల్లో కోహ్లి ట్వీట్లకు అగ్రస్థానం

దిల్లీ: ఈ ఏడాది ట్విటర్‌లో సందడి చేసి ట్రెండింగ్‌లో నిలిచిన ట్వీట్లను ట్విటర్‌ ఇండియా సంస్థ మంగళవారం ప్రకటించింది. భారత్‌లో జనవరి 1 నుంచి నవంబరు 15 మధ్య విశేషాదరణ పొందిన ట్వీట్లకు ఈ జాబితాలో స్థానం కల్పించింది. తమిళ సినీ కథానాయకుడు విజయ్‌ అభిమానులతో కలసి తీసుకున్న సెల్ఫీకి అత్యధికంగా 1.61 లక్షలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి తన సతీమణి అనుష్కశర్మ గర్భం దాల్చిన సంతోషకర విషయాన్ని పంచుకుంటూ చేసిన ట్వీట్‌ 6.44 లక్షలకు పైగా లైకులు సాధించి తొలి స్థానంలో నిలిచింది.

రాజకీయ నేతల్లో మోదీ.. క్రీడాకారుల్లో ధోనీ.. వ్యాపారవేత్తల్లో రతన్‌ టాటా

కొవిడ్‌ సంక్షోభ సమయంలో భారతీయుల ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రజలందరూ పరస్పరం సంఘీభావాన్ని ప్రకటించుకుంటూ ఇళ్లలో దీపాలు వెలిగించాలని ఏప్రిల్‌ 3న మోదీ చేసిన ట్వీట్‌కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఇది రాజకీయ రంగానికి సంబంధించి ఈ ఏడాది అత్యధిక రీట్వీట్‌లు పొందిన ట్వీట్‌గా ఇది నిలిచింది. ఆ ట్వీట్‌ను 1.18 లక్షల మందికి పైగా రీట్వీట్‌ చేయగా, 5.13 లక్షల మంది లైక్‌ చేశారు. భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ చేసిన ఓ ట్వీట్‌ క్రీడారంగంలో అత్యధిక రీట్వీట్లు పొందిన ట్వీట్‌గా నిలిచింది. తను క్రికెట్‌ నుంచి రిటెర్మెంట్‌ ప్రకటించినప్పుడు ప్రధాని మోదీ తనకు ప్రత్యేకంగా రాసిన లేఖను పంచుకుంటూ ధోనీ ఆ ట్వీట్‌ చేశారు. కొవిడ్‌తో కుదేలైన వర్గాల ప్రజలను ఆదుకుంటానంటూ రతన్‌ టాటా చేసిన ట్వీట్‌ వ్యాపార రంగంలో అత్యధిక రీట్వీట్లు సాధించింది. బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ తనకు కరోనా సోకిన విషయాన్ని పంచుకుంటూ చేసిన ట్వీట్‌ను ట్విటర్‌ ఇండియా గోల్డెన్‌ ట్వీట్లలో ఒకటిగా ఎంపిక చేసింది. ఈ ఏడాది ట్విటర్‌లో ఎక్కువ చర్చనీయాంశమైన విషయాల జాబితాలో కరోనా, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్, హాథ్రస్‌ అత్యాచారం, స్టూడెంట్‌ లైవ్స్‌ మ్యాటర్, షాహీన్‌బాగ్‌ నిరసనలు, రైతుల నిరసన తదితర అంశాలున్నాయి. రామాయణ్, మహాభారత్‌ కార్యక్రమాలను తిరిగి టీవీలో ప్రసారం చేయడంపైనా ఎక్కువ మంది ట్విటర్‌లో చర్చించుకున్నారు.

ఇదీ చదవండి..

ట్విటర్‌లో మోత మోగించిన ఐదు సినిమాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని