Published : 13 Aug 2020 02:22 IST

ఈ అలవాట్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయ్

కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరిపై పంజా విసురుతుందో తెలియట్లేదు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ కరోనా కోట్లాది మందిని ఆస్పత్రులపాలు చేస్తోంది. ఈ వైరస్‌కు ఇంకా మందు అందుబాటులోకి రాకపోవడంతో రోగనిరోధకశక్తితోనే నయం చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఆస్పత్రుల్లో క్వారంటైన్‌లో ఉన్న కరోనా రోగులకు పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ఇస్తున్నారు. అంటే.. ప్రస్తుతం పరిస్థితుల్లో మనల్ని కరోనా నుంచి కాపాడేది కేవలం మనలోని రోగనిరోధకశక్తి మాత్రమే. అందుకే కేంద్ర ప్రభుత్వం సైతం రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు కొన్ని చిట్కాలు, సలహాలు ఇస్తోంది. వాటితోపాటు మనం రోజు చేసే నాలుగు పనుల్లో కాస్త మార్పులు చేసి అలవాటుగా మార్చుకుంటే.. రోగనిరోధకశక్తి పెరిగి.. ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా నాలుగు పనులు..?

నిద్రకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి

రోజంతా ఏవేవో పనులు చేస్తాం. శారీరకంగా.. మానసికంగా ఆలసిపోతాం. ఆ రెండింటికి తగినంత నిద్ర ఎంతో అవసరం. ఈ బిజీ బిజీ జీవితంలో చాలా మంది కనీసం 4 గంటలు కూడా నిద్ర పోవడట్లేదనడంలో అతిశయోక్తి లేదు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మనిషికి 8గంటల నిద్ర అవసరం. నిద్రపోతున్నప్పుడే మనలో రోగనిరోధక శక్తి పనితీరు మెరుగ్గా ఉంటుంది. శరీరంలోకి చేరిన సూక్ష్మక్రిములను మనలోని తెల్లరక్త కణాలు చంపుతాయి. దెబ్బతిన్న కణాలు తిరిగి కోలుకుంటాయి. ముఖ్యంగా ఒత్తిళ్లకు గురయ్యే మెదడుకు ప్రశాంతత లభిస్తుంది. నిద్ర పోతున్నప్పుడే తిన్న భోజనంలోని పోషకాల శోషణ జరుగుతుంది. పోషకాలు శరీరంలో చేరినప్పుడే రోగనిరరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండగలం. ఇవన్నీ జరగాలంటే చక్కగా నిద్రపోవాలి. కాబట్టి ఈ కరోనా సంక్షోభ సమయంలో నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

ఒత్తిళ్లకు దూరంగా ఓ పది నిమిషాలు

అధిక పని, మానసిక ఒత్తిడి మనలోని రోగనిరోధకశక్తికి తగ్గించేస్తాయి. ఒత్తిడికి గురికావడం వల్ల రోగనిరోధక కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాగే శరీరంలోకి వచ్చి చేరే కొవ్వు కూడా రోగనిరోధకశక్తిని తగ్గించేస్తుంది. దీంతో సులువుగా మనం రోగాలబారిన పడిపోతాం. అందుకే ఒత్తడిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్రతి రోజు ఒక పది నిమిషాలైనా మెదడు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం మెడిటేషన్‌, యోగా, ప్రాణాయామంలాంటివి చేయడం అలవాటు చేసుకోండి.

అల్పాహారంలో పోషకాలు ఉండేలా..

నిత్యం ఇడ్లి, ఉప్మా, దోశ అంటూ ఇలాంటి అల్పాహారమే తీసుకుంటుంటాం. వాటికి బదులు ఇకపై పండ్లు, కూరగాయాలతో చేసిన అల్పహారాన్ని తినడం అలావాటు చేసుకోండి. విటమిన్స్‌ సీ,డీ,ఈ,ఏ జింక్‌ సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో దెబ్బతిన్న కణాలు, డీఎన్‌ఏను నయం చేస్తాయి. మనం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. శరీరంలో పోషకాలు మరీ తక్కువ ఉంటే మందుల రూపంలోనూ విటమిన్స్‌ను తీసుకోవచ్చు. ఆహారం తినేటప్పుడు కూడా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చేసుకోవాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. రక్తంలో కొవ్వు, గ్లూకోజ్‌ నిల్వల్ని తగ్గిస్తుంది. 

ఒంటికి పని చెప్పండి

చాలా మంది అనారోగ్యానికి గురైనప్పుడే ఇకపై వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటామని అనుకుంటారు. అదేదో ముందు నుంచి వ్యాయామం చేస్తే సరిపోతుంది కదా! వ్యాయామం అనేది రోగనిరోధకశక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వ్యాయామం మనల్ని మొదట స్వల్ప ఒత్తిడికి గురిచేసినా.. అదే మనకు బలాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ సమయం చేసే వ్యాయాయాలు అప్పటి వరకే రోగనిరోధక శక్తిని ఇస్తాయి. అదే ఎక్కువ సమయం చేసే వ్యాయామాలు వయసు పెరుగుతున్న కొద్ది రోగనిరోధక శక్తి పెంపునకు దోహదపడతాయట. అలా అని.. వ్యాయామం కోసం జిమ్‌లో చేరాల్సిన పనిలేదండీ.. ఇంట్లోనే నడవడం, తోటపని చేయడం, డ్యాన్స్‌ వంటివి చేసినా ఆరోగ్యం బాగుంటుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని