
Dating App: డేటింగ్ యాప్‌లపై విసుగొచ్చి.. కొత్త యాప్ సృష్టించాడు!
ఇంటర్నెట్ డెస్క్: అవసరాలే వినూత్న ఆవిష్కరణకు మూలం అంటుంటారు. లండన్‌కు చెందిన 30ఏళ్ల జోష్ వుడ్ విషయంలోనూ అదే జరిగింది. డేటింగ్ యాప్‌ల్లో జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు ఎంత ప్రయత్నించినా అతడికి సరైన జోడీ దొరకలేదు. దీంతో విసిగెత్తి తనే ఒక వినూత్న డేటింగ్ యాప్‌ను సృష్టించాడు. తనలా డేటింగ్‌యాప్‌లో జోడీ దొరకని వారికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు.
జోష్ రెండు పదుల వయసులో ఉన్నప్పుడు ‘టిండర్’ డేటింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో తన జీవితభాగస్వామిని ఆ యాప్‌లో ఆన్వేషించాలనుకున్నాడు. అలా యాప్‌లో నచ్చిన అమ్మాయిల్ని పలకరించినా ఎవరూ సమాధానం ఇచ్చేవాళ్లు కాదు. కొన్నాళ్లకు ‘టిండర్’కు పోటీగా అనేక డేటింగ్ యాప్‌లు పుట్టుకొచ్చాయి. వాటిల్లోనూ జోష్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దాదాపు 500 మంది అమ్మాయిలు తన అభిరుచికి తగ్గట్టు కనిపించారట. వాళ్లకు మెసెజ్ చేసినా ఏ ఒక్కరూ రిప్లై ఇవ్వలేదట. దీంతో డేటింగ్ యాప్‌లపై విసుగుచెంది వాటిని పక్కన పెట్టేశాడు. అయితే, ఓ రోజు తను ఓ బార్‌కి వెళ్లగా అక్కడ చెల్సా అనే అమ్మాయి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారడంతో ఇరువురు ఒక్కటయ్యారు.
అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది. డేటింగ్ యాప్‌లో ఫొటోలు చూసి మెసేజ్ చేయడం కంటే.. నేరుగా కలిస్తేనే ఫలితముంటుందని భావించి కొత్త కాన్సెప్ట్‌తో ‘బ్లాక్ (Bloc)’ అనే వినూత్న డేటింగ్ యాప్‌ను రూపొందించాడు. ఈ యాప్‌లో యూజర్లుండే ప్రాంతాల్లో ఏయే రోజు ఏయే కార్యక్రమాలు జరుగుతాయనే వివరాలు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్ల వివరాలుంటాయి. యూజర్ అక్కడికి వెళ్లి యాప్‌లో చెక్‌ఇన్ అయితే, వారిలాగే చెక్‌ఇన్ అయి ఉన్న మరికొందరు యూజర్లు ఆ యాప్‌లో కనిపిస్తారు. వారిని యాప్‌లోనే ఎంపిక చేసుకొని నేరుగా కలవచ్చన్నమాట. అంతేకాదు, చెక్‌ఇన్ అయినప్పుడల్లా పాయింట్లు లభిస్తాయి. వాటితో యాప్‌లోనే షాపింగ్ చేయొచ్చు.