అమ్మానాన్న లేనివారికి అన్నీ తానై!

కరోనా మహమ్మారి ఎన్నో జీవితాలను చీకటిమయం చేసింది. సకాలంలో వైద్యం అందించే స్తోమత లేక కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కొందరైతే.. తల్లిదండ్రులు కరోనా కాటుకు బలవ్వడంతో అనాథలుగా మారిన చిన్నారులు మరెందరో. భారమవుతారని బంధువులు వదిలేస్తే.. బిక్కు బిక్కుమంటున్న చిన్నారులకు తానున్నానంటూ భరోసా ఇస్తోంది.

Updated : 08 Jul 2021 09:41 IST

అనాథలకు అండగా నిలుస్తున్న ఎస్‌ఓఎస్ చిల్డ్రన్‌ విలేజెస్‌

ఇంటర్నెట్‌డెస్క్: కరోనా మహమ్మారి ఎన్నో జీవితాలను చీకటిమయం చేసింది. సకాలంలో వైద్యం అందించే స్తోమత లేక కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కొందరైతే.. తల్లిదండ్రులు కరోనా కాటుకు బలవ్వడంతో అనాథలుగా మారిన చిన్నారులు మరెందరో. భారమవుతారని బంధువులు వదిలేస్తే.. బిక్కు బిక్కుమంటున్న చిన్నారులకు తానున్నానంటూ భరోసా ఇస్తోంది.. దిల్లీ కేంద్రంగా పని చేసే ‘ఎస్‌ఓఎస్‌ చిల్డ్రన్‌ విలేజెస్‌’ ఎన్జీవో సంస్థ.

దేశవ్యాప్తంగా అనాథ పిల్లలకు ఎస్‌ఓఎస్‌ చిల్డ్రన్‌ విలేజెస్‌ వసతి సౌకర్యం కల్పిస్తోంది. వారు ప్రయోజకులయ్యే వరకు అన్ని బాధ్యతలనూ తానే చూసుకుంటోంది. 1964లో దిల్లీలో ప్రారంభమై.. క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది. వివిధ కారణాలవల్ల తల్లిదండ్రులు అకాలమరణం చెందితే.. వారిని ఆదరిస్తోంది. ఎన్జీవో నిర్వాహకులు ప్రతి బ్రాంచ్‌ని ఓ చిల్డ్రన్‌ విలేజ్‌గా పేర్కొంటూ, అందులో కొన్ని  ‘ఫ్యామిలీ హోం’లు ఏర్పాటు చేస్తున్నారు. అనాథ పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ.. సొంతింటిని మరిపించే అనుభూతిని కలిగిస్తున్నారు.

ఈ ఎన్జీవో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 32 చిల్డ్రన్‌ విలేజెస్‌ను నిర్వహిస్తోంది. దాదాపు 400 ఫ్యామిలీ హోంలలో 6,500 మందికి పైగా చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. కేవలం ఆశ్రయం ఇవ్వడమే కాకుండా.. 2 కోట్ల మంది చిన్నారుల హక్కుల కోసం పోరాడుతూ.. వారి బంగారు భవిష్యత్తు కోసం పునాదులు వేస్తోంది ఈ సంస్థ. ఎస్‌వోఎస్‌ ప్రధానంగా రెండు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. 1. చిన్నారులను కుటుంబ సభ్యుల్లా సాకడం. 2. చిన్నారుల బంధువులు ఎవరైనా ముందుకొస్తే వాళ్లకు సహాయం చేయడం.

తాజాగా 95 మంది.. 

ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన చిన్నారులకు సాయం చేసేందుకు ఎస్‌వోఎస్‌ ముందుకొచ్చింది. లాంగ్‌ టర్మ్‌, షార్ట్‌ టర్మ్‌ కేరింగ్‌ విధానంలో వారిని ఆదుకుంటోంది. తాజాగా వైరస్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 95 మందికి, చిల్డ్రన్‌ విలేజెస్‌లో ఆశ్రయం కల్పించి, ఆదుకుంది. అనాథపిల్లల గురించి ఏదైనా సమాచారమొస్తే.. ఎన్జీవో సంస్థ దానిని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి చేరవేస్తుంది. కమిటీ మార్గదర్శకాల మేరకు చిన్నారులను చిల్డ్రన్‌ విలేజ్‌లో చేర్చుకుంటుంది.

భద్రతకే ప్రాధాన్యం!

నేటి కరోనా పరిస్థితుల్లో చైల్డ్‌ విలేజెస్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లలు, వారిని సాకుతున్నవారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా సందర్శకుల రాకపోకలను పూర్తిగా నిషేధించినట్లు  ఎస్‌ఓఎస్‌ సెక్రటరీ జనరల్‌ సుమంతా కార్‌ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో చిన్నారులకు కావాల్సిన వైద్యసామగ్రిని ఇప్పటికే సిద్ధం చేసుకున్నామని, పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు, కొన్ని మందులు నిత్యం అందుబాటులో ఉంచామని ఆయన అంటున్నారు. అన్ని చిల్డ్రన్‌ విలేజెస్‌లోనూ ఆక్సిజన్‌ సిలిండర్లను సిద్ధం చేశామన్నారు. సహాయం అవసరమైనవారు 18002083232 నెంబర్‌లో సంప్రదించాలని అన్నారు.

ఎన్నో సవాళ్లు

అమ్మానాన్నల్ని పోగొట్టుకున్న చిన్నారులు ఓ షాక్‌లో ఉంటారు. వారిని సాధారణ మనుషుల్లా చేయడం చాలాకష్టం. వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఎస్‌ఓఎస్‌ ఎన్జీవోలో పని చేసే సిబ్బంది, ఎస్‌ఓఎస్‌ మదర్స్‌ ఆ పిల్లలకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటారు. ఇంటి వాతావరణాన్ని కల్పించి, ఆ షాక్‌ నుంచి తేరుకునేలా చేస్తారు. కేవలం బయట ఉన్న అనాథ పిల్లల్నే కాకుండా వివిధ శిశుసంరక్షణ కేంద్రాల్లోని పిల్లలనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఎస్‌ఓఎస్‌లో చేర్చుకుంటారు. ఈ సంస్థకు పలువురు విరివిగా విరాళాలిస్తుంటారు. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా సామాజిక బాధ్యత కింద నిధులు ఇస్తుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని