వస్తువులు తీసుకుని.. డబ్బు ఇస్తుంది!

ఓ కొత్త వెండింగ్‌ మెషీన్‌ను గురించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తాజా సంచలనం

Published : 04 Jan 2021 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా వెండింగ్‌ మెషీన్‌ అంటే.. నగదు లేదా ఆన్‌లైన్‌ చెల్లింపుల అనంతరం మనకు కావాల్సిన వస్తువులను అందిస్తుందని మనకు తెలిసిందే. ఖాళీ ప్లాస్టిక్‌ బాటిళ్లు తదితర నిరుపయోగ వస్తువులను తీసుకుని దానికి బదులుగా డబ్బు లేదా కూపన్లను అందించేవి రివర్స్‌ వెండింగ్‌ యంత్రాలు. వీటిని భారతీయ రైల్వే కూడా పలు స్టేషన్లలో ఏర్పాటు చేసింది. ఐతే వీటికి భిన్నంగా.. రానున్న భవిష్యత్తులో నిజం కాగల ఓ కొత్త వెండింగ్‌ మెషీన్‌ను గురించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తాజా సంచలనంగా నిలుస్తోంది.

మనం కొనుగోలు చేసిన వస్తువులు లేదా ఆహార పదార్థాలన్నింటినీ వాడేయటం ఒకోసారి కుదరదు. పోనీ వాటిని కొన్న చోటే తిరిగివ్వాలంటే అన్ని సందర్భాల్లోనూ వీలు కాకపోవచ్చు. అలా మనం వాడకుండా ఉంచేసిన వస్తువులను తిరిగి కొనే సదుపాయం ఉంటే.. ఈ ఆలోచనే అద్భుతంగా ఉంది కదూ. దీనికి నిజరూపం అనతగ్గ ఓ రివర్స్‌ వెండింగ్‌కు సంబంధించిన వీడియోను క్రియేషన్స్‌ రాస్‌ అనే పేరుతో ఓ నెటిజన్‌ షేర్‌ చేశారు. ఇంతకీ ఈ ఆసక్తికరమైన వీడియోలో ఏముందంటే..
నిండా నోట్లతో నిండి ఉన్న ఓ వెండింగ్‌ మెషీన్‌ ఎదురుగా నిలబడ్డ ఓ వ్యక్తిని మనం ఈ వీడియోలో చూడవచ్చు. యంత్రంలో ఉన్న నిర్దేశిత స్లాట్‌లో అతను కూల్‌ డ్రింక్‌ క్యాన్‌ను పెట్టాడు. దానిలో తనకు కావాల్సిన సంఖ్యను నమోదు చేశాడు. అనంతరం ఆ క్యాన్‌కు సమానమైన విలువగల నోట్లు దానిలో నుంచి బయటకు వచ్చాయి. ఆ వ్యక్తి ఎంచక్కా వాటిని తీసుకుని కూల్‌గా వెళ్లిపోవడాన్ని మనం చూడవచ్చు.
కాగా షేర్‌ చేసిన ఒక్క రోజులోనే ఈ వీడియో నాలుగున్నర లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ కాన్సెప్ట్‌ తనకు చాలా నచ్చిందని.. దీని వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కానీ మనకు రావాల్సిన డబ్బు ఇరుక్కుపోతేనో అంటూ కొందరు డౌటింగ్‌ థామస్‌లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వీడియో చూసి మీకేమనిపిస్తోందో చెప్పేయండి!

ఇవీ చూడండి..

కరోనా టీకా.. అసలు నొప్పే లేదు!

 స్తంభం కూలి మీదపడింది..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని