అలర్జీయా? ఐనా ఈ టీకాలు ఓకే..!

అలర్జీ లక్షణాలు కలిగిన వారు ఫైజర్‌, మోడెర్నా టీకాలను తీసుకోవచ్చంటూ శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు.

Published : 02 Jan 2021 00:29 IST

న్యూయార్క్‌: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా టీకా పంపిణీ మొదలైంది. ఇక మరి కొన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ రెండు మోతాదులనూ తీసుకున్న వారు కూడా ఉన్నారు. కాగా, వారిలో కొందరికి జ్వరం, తలనొప్పి, టీకా ఇచ్చిన ప్రాంతంలో నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఇప్పటి వరకూ సుమారు పది మందిలో తీవ్ర స్థాయి అలర్జీ లక్షణాలు (ఎనాఫిలాక్సిస్‌) కనిపించాయి. ఈ టీకాల వల్ల అలర్జీ కలుగుతుందా? అనే సందేహం ప్రజల్లో తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో మసాచూసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌కు చెందిన అలర్జీ నిపుణుల బృందం వెల్లడించిన పరిశోధనా ఫలితాలు ఊరటనిస్తున్నాయి. సదరు పరిశోధనకు సంబంధించిన అంశాలు జర్నల్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ క్లినికల్‌ ఇమ్యునోలజీలో ప్రచురించారు.

ఆహారం లేదా ఔషధాల పట్ల అలర్జీ లక్షణాలు కలిగిన వారు ఫైజర్‌, మోడెర్నా టీకాలను తీసుకోవచ్చంటూ ఈ శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు. కాగా ఈ రెండు సంస్థల టీకాలకూ అమెరికా సాధికార సంస్థ యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. అలర్జీ రియాక్షన్‌ తలెత్తిన కేసులకు సంబంధించిన గణాంకాలను ఎఫ్‌డీఏ క్షుణ్నంగా పరీశీలించింది. అనంతరం ఆ వ్యాక్సిన్‌లో వాడిన సమ్మేళనాలలో దేని వల్ల అయినా తీవ్ర అలర్జీ చోటుచేసుకున్న చరిత్ర ఉన్న వారు మాత్రమే సదరు టీకాకు దూరంగా ఉండాలని వారు తేల్చారు.  అంతేకాకుండా  తొలి డోసు తీసుకోవటం వల్ల అలర్జీ సంభవిస్తే.. రెండో డోసు తీసుకునేందుకు మార్గదర్శకాలను కూడా సూచించారు. టీకా తీసుకునే పదిలక్షల మందిలో కేవలం 1.3 మందికి మాత్రమే అలర్జీ సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు అంటున్నారు. అంతేకానీ ఆహారం, ఔషధాల అలర్జీ ఉన్నవారు వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనంలో పాలు పంచుకున్న అమెరికా వైద్య సంస్థల కథనం.

ఇవీ చదవండి..

చైనా నుంచే నేర్చుకుంటాం: పాకిస్థాన్‌

నిత్యం 10లక్షల మందికి వ్యాక్సిన్‌: ఈటల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు