ఒక్కసారిగా నల్లబారిన నది.. వేలాది చేపల మృత్యువాత

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడి తూర్పు కమెంగ్ జిల్లాలోని కమెంగ్ నది శుక్రవారం ఒక్కసారిగా నల్లబారింది......

Published : 31 Oct 2021 01:39 IST

ఇటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడి తూర్పు కమెంగ్ జిల్లాలోని కమెంగ్ నది శుక్రవారం ఒక్కసారిగా నల్లబారింది. జిల్లా కేంద్రమైన సెప్పా వద్ద నదిలో చూస్తుండగానే వేలాది చేపలు మృత్యువాతపడ్డాయి. ఈ ఆకస్మిక పరిస్థితులు స్థానికంగా భయాందోళనలకు దారితీశాయి. అయితే.. నదిలో అన్ని రకాల లవణాల (టీడీఎస్‌) శాతం భారీ స్థాయికి చేరడంతోనే నీళ్లు నల్లగా మారిందని ప్రాథమికంగా వెల్లడైనట్లు జిల్లా మత్స్య అభివృద్ధి విభాగం అధికారి హలీ తాజో తెలిపారు. ఈ రకమైన నీళ్లలో జలచరాలకు ఏమీ కనిపించదని, పైగా ఆక్సిజన్‌ పీల్చుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. చేపల మృతికి ఇదే కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

చైనానే కారణమంటూ ఆరోపణలు

నదిలో టీడీఎస్‌ మోతాదు పెరుగుదలకు చైనానే కారణమని సెప్పావాసులు ఆరోపిస్తున్నారు. అక్కడ నిర్మాణ రంగ కార్యకలాపాలవల్లే నీటి రంగు నల్లగా మారిందని చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలికితీసేందుకు వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తూర్పు సెప్పా ఎమ్మెల్యే తపుక్ టాకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మునుపెన్నడూ ఇలా జరగలేదని, ఇది ఇలాగే కొనసాగితే.. అందులోని జలచరాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ తూర్పు సియాంగ్ జిల్లాలోని పాసిఘాట్ వద్ద ఉన్న సియాంగ్ నది 2017 నవంబరులో ఇలాగే నల్లగా మారింది. చైనాలో సొరంగం నిర్మాణం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అరుణాచల్ ఈస్ట్‌కు చెందిన అప్పటి కాంగ్రెస్ ఎంపీ నినాంగ్ ఎరింగ్.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అయితే, చైనా ఈ వాదనలను ఖండించింది.

ఈ చేపలు తినొద్దు..

‘వాస్తవానికి నది నీళ్లలో టీడీఎస్ లీటరుకు 300-1200 మిల్లీగ్రాముల మధ్య ఉండాలి. కానీ.. ప్రస్తుతం ఏకంగా 6,800 మిల్లీగ్రాములు ఉన్నట్లు తేలింది’ అని తాజో చెప్పారు. ఆ చనిపోయిన చేపలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వాటిని తినొద్దని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తమై.. ఈ మేరకు సూచనలు చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు నదిలో చేపలు పట్టేందుకు వెళ్లొద్దని, చనిపోయిన చేపలను తినొద్దని, విక్రయించొద్దని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని