Ts News: గుజరాత్‌లో పంచాయతీ సర్వీస్‌ పరీక్ష పేపర్‌ లీక్‌.. హైదరాబాద్‌లో ముగ్గురి అరెస్టు

పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లో గుజరాత్‌ ఏటీసీ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లో పంచాయతీ సర్వీస్‌ సెలెక్షన్‌ బోర్డు ఆదివారం పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పేపర్‌ లీక్‌ కావడంతో పరీక్ష రద్దు చేశారు.

Updated : 24 Mar 2023 15:28 IST

హైదరాబాద్‌: గుజరాత్‌లో పంచాయతీ సర్వీస్‌ సెలెక్షన్‌ బోర్డు పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని కేఎల్‌ హైటెక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి పేపర్‌ లీక్‌ అయినట్టు పోలీసులు గుర్తించారు. గుజరాత్‌ పంచాయతీరాజ్‌ శాఖలో క్లర్క్‌ నియామకాల కోసం ఇవాళ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. సామాజిక మాధ్యమాల్లో పేపర్‌ లీక్‌ అయింది. దీంతో బోర్డు పరీక్షను రద్దు చేసింది. బొల్లారంలోని ప్రింటింగ్ ప్రెస్‌, జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలో గుజరాత్‌ ఏటీసీ పోలీసులు సోదాలు చేశారు. అనంతరం సంగారెడ్డికి చెందిన జితు నాయక్‌, ఒడిశాకు చెందిన సర్దకర్‌ రోహత్‌తో పాటు మరొకరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సర్దకర్‌ రోహ ప్రిటింగ్‌ ప్రెస్‌లో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ కేసులో 16 మందిని అరెస్టు చేసినట్టు గుజరాత్‌ ఏటీఎస్‌ పోలీసులు తెలిపారు.

పంచాయతీరాజ్‌శాఖలో 1,181 పోస్టుల భర్తీకి  సెలెక్షన్‌ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయగా..9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,995 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రం లీక్‌పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశ్నపత్రాల లీక్‌ ప్రధాన అంశంగా తెరమీదకు వచ్చింది. దీన్ని అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ హామీ కూడా ఇచ్చారు. తాజాగా ఆయన స్పందిస్తూ.. గుజరాత్‌లోనే ఇలా ఎందుకు జరుగుతుందో? అని ట్విటర్‌ వేదికగా సందేహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని