Kurnool: ఆ హోటల్లో ఏది తిన్నా.. పది రూపాయలే!

హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేయాలంటే కనీసంలో కనీసం 50 రూపాయలు చెల్లించాల్సిందే. ఇంకాస్త మంచి హోటల్‌కు వెళ్తే 100 రూపాయల నోటు వదలాల్సిందే.

Updated : 08 Nov 2021 13:15 IST

కర్నూలు: హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేయాలంటే కనీసంలో కనీసం 50 రూపాయలు చెల్లించాల్సిందే. ఇంకాస్త మంచి హోటల్‌కు వెళ్తే 100 రూపాయల నోటు వదలాల్సిందే. వారాంతంలో కుటుంబసభ్యులతో కలిసి వెళ్లామా.. బిల్లు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. ఇందుకు భిన్నంగా కేవలం పది రూపాయలకే రుచికరమైన టిఫిన్ అందిస్తోంది కర్నూలులోని ఓ కాకా హోటల్. 

రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, చుక్కలు చూపిస్తోన్న గ్యాస్ ధరలతో ఇంట్లోనే అల్పాహారం చేసుకున్నా ఒక్కొక్కరికీ కనీసం రూ.20-30 ఖర్చవుతుంది. నూనెతో చేసే పదార్థాలకయ్యే ఖర్చు మరింత ఎక్కువ. బయట ఎక్కడ హోటల్లో తిన్నా.. ఒక ప్లేటు టిఫిన్‌ ధర రూ.30కి తక్కువ ఉండదు. కానీ.. కర్నూలులో రోజా వీధిలోని రేణుకాదేవి టిఫిన్‌ సెంటర్లో మాత్రం మసాలా దోశ, పూరి, ఇడ్లీ, మైసూర్‌ బజ్జీ, వడ, ఉగ్గాణి.. ఇలా ఏది తిన్నా.. ప్లేటుకు రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. ఉగ్గాణిలోకి బజ్జీ కావాలంటే మాత్రం అదనంగా మరో రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. ఈ టిఫిన్‌ సెంటర్‌ను నాగేశ్వరరెడ్డి నడుపుతున్నారు. ఆ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి ప్రజల కోసం పదేళ్ల క్రితం రూ.10కే టిఫిన్‌ అందించాలని నిర్ణయించుకున్నారు. అప్పటినుంచి ధరలు పెరిగినా.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఆ హోటల్‌లో ప్లేట్‌ టిఫిన్‌ ధర మాత్రం పెరగలేదు. సాయంత్రం వేళలో పునుగులు, మిర్చి బజ్జీ, మసాలా దోశలను సైతం ఇదే ధరకు విక్రయిస్తున్నారు. రుచి, శుచిలో రాజీ పడకపోవడంతో పెద్ద ఎత్తున వినియోగదారులు ఈ హోటల్‌కు వస్తున్నారు. ఈ హోటల్ ద్వారా 8 మంది ఉపాధి పొందుతున్నారు. రూ.10 టిఫిన్‌కు విశేష ఆదరణ లభించడంతో ఈ హోటల్‌ను కొనసాగిస్తునట్టు నిర్వాహకులు చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని