మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టి.. కాల్వలో ఈతకొట్టి.. చుక్కలు చూపించిన టిప్పర్‌ డ్రైవర్‌

ఓ టిప్పర్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో పోలీసులు, స్థానికులకు చుక్కలు చూపించాడు. వాహనాలను ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడిని గజ ఈతగాళ్ల సాయంతో పట్టుకున్నారు.

Updated : 19 Mar 2023 21:10 IST

పొదలకూరు: నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద లారీ డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో టిప్పర్‌ లారీ నడిపి వాహనాలను ఢీకొట్టాడు. స్థానికులు, వాహనదారులు లారీని వెంబడించడంతో సంగం కనిగిరి రిజర్వాయర్‌ వద్ద లారీ ఆపి కాలువలో దూకి పరారయ్యాడు. సుమారు కిలోమీటరు దూరం వరకు ఈత కొడుతూ వెళ్లిన డ్రైవర్‌ను గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామానికి చెందిన చల్లా కృష్ణ టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పొదలకూరు మీదుగా వింజమూరుకు టిప్పర్‌తో బయల్దేరాడు. పొదలకూరు మండలం అయ్యగారిపాలెం సమీపంలో ద్విచక్రవాహనదారుడిని ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా తాటిపర్తి కలుజు సమీపంలో ఒక గేదెను, తాటిపర్తి బస్టాండులో ఒక ఆటోను ఢీకొట్టి వేగంగా దూసుకెళ్లాడు. దీంతో స్థానికులు టిప్పర్‌ను వెంబడించడంతో సంగం కనిగిరి రిజర్వాయర్‌ వద్ద లారీ ఆపి కాల్వలోకి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కరీముల్లా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని