కొనసాగుతున్న తిరుపతి, సాగర్‌ పోలింగ్‌

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది.

Updated : 17 Apr 2021 12:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.

తిరుపతి లోక్‌సభ
ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలోని నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 17,10,699 మంది ఓటర్లున్నారు. 2,470 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రధాన పార్టీలతోపాటు మొత్తం 28 మంది పోటీలో ఉన్నారు. 10,850 మంది పోలింగ్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 23 కంపెనీల కేంద్ర బలగాలతోపాటు మూడు కంపెనీల ప్రత్యేక దళాలు మోహరించాయి. పార్లమెంటు పరిధిలో 877 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ భద్రత కోసం కేంద్ర బలగాలు మొహరించాయి. కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా 80 ఏళ్లు పైబడిన వారితోపాటు దివ్యాంగులకు పోస్టల్‌బ్యాలెట్‌ సౌకర్యం కల్పించింది. 80 ఏళ్లు దాటిన 508 మందితోపాటు 284 మంది దివ్యాంగులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 11 గుర్తింపు కార్డుల్లో ఒకదాన్ని పోలింగ్‌ సమయంలో చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఉదయం ఏడింటినుంచి రాత్రి ఏడింటి వరకు పోలింగ్‌ జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.  

సాగర్‌లో కొనసాగుతున్న పోలింగ్‌

 తెలంగాణలోని నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనున్న పోలింగ్‌లో నియోజకవర్గవ్యాప్తంగా 2,20,300 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెరాస, కాంగ్రెస్‌, భాజపా, తెదేపా పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 41 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని