Published : 04 Jul 2022 01:55 IST

Anand Mahindra: హర్ష గొయెంకా ‘గ్రేట్‌ మెసేజ్‌’కు.. ఆనంద్‌ మహీంద్రా రియాక్ట్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యాపారంలో ఉన్నత స్థాయిలకు ఎదిగి ఎల్లప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఆనంద్‌ మహీంద్రా, హర్ష గొయెంకా ముందు వరుసలో ఉంటారు. ఆకట్టుకునే చిత్రాలు, వీడియోలు షేర్‌ చేస్తూ నెటిజన్లతో ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో హర్ష గొయెంకా తాజాగా ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియో ఎందరినో కదిలించింది. దీనికి ఆనంద్‌ మహీంద్రా కూడా రియాక్ట్‌ అయ్యి ఆ వీడియోను షేర్‌ చేశారు. 

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? 

తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సంబంధాన్ని గురించి పెన్సిల్‌, రబ్బర్‌తో పోల్చుతూ ఉన్న ఈ వీడియో సందేశాత్మకంగా ఉంటుంది. దీన్ని హర్ష గొయెంకా ‘గ్రేట్ మెసేజ్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చి తన ట్విటర్‌ ఖాతాలో తొలుత షేర్‌ చేశారు. పెన్సిల్‌ వచ్చి ముందు సారీ చెబుతుండడంతో వీడియో మొదలవుతుంది. దానికి రబ్బర్‌ వచ్చి ‘ఎందుకోసం సారీ’ అని ప్రశ్నిస్తుంది. ‘ఎందుకంటే నేను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నా. నేను తప్పు చేసిన ప్రతిసారీ దాన్ని నువ్వు చెరిపేస్తున్నావు. దాంతో ఆ తప్పు కనుమరుగైపోతుంది. ఇలా చేయడం వల్ల మీలో మీరు కొంత భాగాన్ని కోల్పోతున్నారు’’ అని పెన్సిల్‌ సమాధానమిస్తుంది. అప్పుడు రబ్బర్‌ స్పందిస్తూ..‘అది నిజమే. కానీ, దాన్ని మేం పట్టించుకోం. నీకు తెలుసా? తప్పు చేసిన ప్రతిసారీ మీకు సహాయం చేయడానికే మమ్మల్ని తయారు చేశారు. ఏదో ఒక రోజు మేం పూర్తిగా కరిగిపోతామని మాకూ తెలుసు. కానీ, ఇలా చేస్తున్నందుకు మేం సంతోషంగా ఉన్నాను. మాకోసం చింతించడం మానేయండి. నువ్వు బాధపడుతుంటే చూడలేం’ అని చెబుతుంది. 

రబ్బర్‌, పెన్సిల్‌ మధ్య సంభాషణను తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధంతో పోల్చుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. రబ్బర్‌ లాగానే తల్లిదండ్రులు కూడా ఎల్లప్పుడు పిల్లలు చేసిన తప్పులను సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంటారని గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ‘మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి. వారితో ఎల్లప్పుడూ దయతో ఉండండి. ముఖ్యంగా వారిని ప్రేమించండి’ అనే నీతిని బోధిస్తూ వీడియో ముగుస్తుంది.

అయితే, ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేస్తూ.. ‘‘తల్లిదండ్రుల సహజ లక్షణాన్ని ప్రతిబింబించే గొప్ప సందేశమిది. ఇది మనలాంటి వయసు మళ్లిన తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. ఇది నాకు తరచూ జరుగుతుంటుంది. అలాగే పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు చేసిన తప్పులు మర్చిపోయేలా వారితో ఎక్కువ సమయం గడపాలి’’ అని పేర్కొన్నారు. కాగా.. ఈ వీడియోకు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ‘హృదయాలను హత్తుకునే సందేశం’ అని కామెంట్లు, రిప్లయ్‌లు ఇచ్చారు.Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని