Updated : 19 May 2021 19:51 IST

Corona Pandemic: నేటి ‘పాజిటివ్‌’ న్యూస్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆక్సిజన్‌ కొరత.. ఔషధాలు కొరత.. ఆ రాష్ట్రంలో పెరిగిన కేసులు.. ఈ రాష్ట్రంలో ఇన్ని మరణాలు.. అంటూ వస్తున్న వార్తలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కొవిడ్‌ బాధితుల్లో భయాల్ని పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలోనూ కొన్ని వార్తలు ఊరటనిస్తున్నాయి. కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు సైతం భవిష్యత్‌పై ఆశలు చిగురింపజేసేలా ఉంటున్నాయి. అలాంటి వార్తలు వార్తలు మీ కోసం...

👍 దేశంలో వరుసగా మూడో రోజు కొత్త కేసులు 3 లక్షల్లోపు నమోదయ్యాయి. తాజాగా 2,67,334 మందికి పాజిటివ్‌గా తేలింది. కొత్త కేసుల సంఖ్య అదుపులో ఉండటంతో కొవిడ్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 32,26,719కి చేరింది. క్రియాశీల రేటు 13.29 శాతంగా ఉంది. మంగళవారం ఒక్కరోజే 3,89,851 మంది కోలుకోగా.. రికవరీల సంఖ్య 2.19 కోట్లకు పైబడింది. రికవరీరేటు 85.60 శాతానికి చేరింది. ఇప్పటి వరకు 18,58,09,302 మంది టీకా వేయించుకున్నారని కేంద్రం తెలిపింది.

👍 పేద ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య సాయం అందించడంలో భాగంగా నాలుగు జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం సీటీ స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెల్లూరు, ఒంగోలు, క‌డ‌ప‌, శ్రీ‌కాకుళం ప్రభుత్వాసుపత్రుల్లో వీటి సేవలను ప్రారంభించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీటిని సీఎం జగన్‌ బుధవారం ప్రారంభించారు. మరో ఏడు చోట్ల ఏర్పాటు చేస్తామని చెప్పారు.

👍రాష్ట్ర ప్రజలకు కొవిడ్‌ టీకాలను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్ర వైద్య సదుపాయాల మౌలిక వసతుల సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ) ద్వారా కోటి వ్యాక్సిన్ల కోసం ఈ టెండర్లను పిలిచింది. నెలకు కనీసం 15లక్షల డోసులు సరఫరా చేయాలని.. 6 నెలల్లో కోటి డోసులు సరఫరా చేయాలని నిబంధనల్లో పేర్కొంది. టెండర్ల దాఖలకు ఈనెల 21 వరకు అవకాశం కల్పించింది. 

👍 దేశంలో జూన్‌ నుంచి కరోనా మరణాల్లో తగ్గుదల కనిపిస్తుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు అమలు చేయడంతో పాటు, టీకా కొరతను అధిగమిస్తామని వారు చెబుతున్నారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందేలా చూడటం వల్ల కరోనా మరణాల్లో గణనీయమైన తగ్గుదల ఉంటుందని తెలిపారు. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా రోజువారీ వ్యాక్సిన్లను ఎక్కువమందికి వేయడం ద్వారా మరణాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 

👍 కొవిషీల్డ్‌ టీకాకు సంబంధించి రెండు డోసుల మధ్య విరామ సమయాన్ని 12-16 వారాలకు కేంద్రం పెంచిన సంగతి తెలిసిందే. అయితే విరామం పెరిగినంత మాత్రన వచ్చే ఇబ్బంది ఏదీ లేదని అంటున్నారు దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ శాస్త్రవేత్త సత్యజిత్‌ రథ్‌. ‘‘మొదటి డోసు పొందిన నాలుగు వారాల తర్వాత నుంచి ఎప్పుడైనా రెండో డోసు ఇవ్వొచ్చు. 6 నెలలలోపు ఇస్తే సరిపోతుంది. అయినా దాని బూస్టర్‌ సామర్థ్యంలో తేడా ఉండదు. అద్భుతంగా రోగ నిరోధక స్పందనను పెంచుతుంది’’ అని తెలిపారు.

👍 లాక్‌డౌన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారి కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1250 కోట్లతో రిలీఫ్‌ ప్యాకేజీ ప్రకటించింది. పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేసే రైతులకు హెక్టార్‌కు గరిష్ఠంగా ₹10వేల చొప్పున సాయం అందించనుంది. ఆటో, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లకు, భవన నిర్మాణ కార్మికులకు ₹3వేలు, క్షురకులు, రజకులు, దర్జీ పని వాళ్లు, స్వర్ణకారులు, మెకానిక్‌లు తదితర అసంఘటిత రంగ కార్మికులు, వీధి వ్యాపారులకు ₹2వేలు చొప్పున సాయం ప్రకటించింది.

👍 ఇంట్లో చిన్నారులకు కూడా కొవిడ్‌ సోకితే ఏమౌతుందోనన్న భయాందోళన చెందుతున్న వారికి ఊరట. చిన్న పిల్లలకు కరోనా సోకినా వారిలో తీవ్ర లక్షణాలు ఉండవని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పేర్కొన్నారు. పిల్లల్లో పెద్ద లక్షణాలు ఉండవు కాబట్టి వారికి సాధారణ చికిత్స సరిపోతుందన్నారు. అయితే వైరస్‌ తన స్వభావాన్ని మార్చుకుంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని, అందువల్ల దానిపై కన్నేసి ఉంచాలన్నారు.

👍 కరోనా నుంచి కోలుకున్న అనంతరం కొందరిలో బయటపడుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులకు చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్‌ బుధవారం ఆదేశాలు జారీచేశారు. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్‌ ఫంగస్‌కు చికిత్సచేయాలన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు సింఘాల్‌ ఆదేశాలు జారీచేశారు.

👍గడచిన వారం రోజుల్లో భారత్‌లో కరోనా కేసులు 13 శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక ప్రకటనలో తెలిపింది. అంతకు ముందు వారంతో పోలిస్తే (మే 16 వరకు) వారం రోజులుగా తాజా కేసుల్లో 13శాతం, మరణాల్లో 5శాతం తగ్గుదల ఉన్నట్లు వీక్లీ రిపోర్టులో వెల్లడించింది. ప్రపంచంలోని అన్ని రీజియన్లలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆ నివేదికలో వెల్లడించింది.

👍 లాక్‌డౌన్‌ నుంచి పెట్రోల్‌ బంకులకు తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకులు సాధారణ సమయాల్లో తెరిచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధాన్యం సేకరణ, మిల్లులకు రవాణా చేయడం తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జాతీయ రహదారుల వెంబడి ఉన్న పెట్రోలు బంకులకు ఇప్పటికే పూర్తి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని