Tomato prices: టమాట ధరల మోత.. మరో రెండు నెలలు ఇలాగేనా?

ఏ కూరగాయ లేకుంటే.. కనీసం టమాటా అయినా వండొచ్చుగా..! సాధారణంగా ప్రతి మధ్యతరగతి ఇళ్లల్లో వినిపించే మాట ఇది. కానీ ఇప్పుడు అది కూడా సామాన్యులకు భారంగా

Updated : 26 Nov 2021 19:19 IST

ముంబయి: ఏ కూరగాయ లేకుంటే.. కనీసం టమాట అయినా వండొచ్చుగా..! సాధారణంగా ప్రతి మధ్యతరగతి ఇళ్లల్లో వినిపించే మాట ఇది. కానీ, ఇప్పుడు అది కూడా సామాన్యులకు భారంగా మారింది. టమాట ధరలు ఆకాశాన్ని అంటడంతో కూర వండుకోవడం కాదు కదా.. వాటిని కొనాలంటేనే భయమేస్తోంది. అవును మరి.. ఒక్కోసారి రూపాయికి కిలో అన్నా కొనేవారు లేక.. రోడ్లపై పారబోసే టమాట ధర.. ఇప్పుడు చుక్కలను తాకుతోంది. ఒక్కో చోట కిలో రూ.100 కంటే ఎక్కువే పలుకుతోంది. అయితే టమాట ధరల మోత ఇప్పట్లో తగ్గేలా కన్పించట్లేదు. మరో రెండు నెలలు ధరలు ఇలాగే ఉంటాయని క్రిసిల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. అధిక వర్షాలతో పంట దెబ్బతినడంతో ధరల మోత మోగుతోందని తెలిపింది.

సాధారణంగా అక్టోబరు - డిసెంబరు కాలంలో టమాట పంట అధికంగా వచ్చే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలో భారీ వర్షాలు దెబ్బకొట్టాయి. కుంభవృష్టి కారణంగా ఈ రాష్ట్రాల్లో పంట భారీగా ధ్వంసమైంది. దీంతో ఇటీవల టమాట ధరలు రికార్డు స్థాయిలో 140శాతానికి పైగా పెరిగాయని క్రిసిల్‌ రీసర్చ్‌ తెలిపింది. అయితే మరో రెండు నెలలు కూడా ఈ ధరలు ఇలాగే ఉంటాయని అంచనా వేసింది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో పంట చేతికొచ్చి.. జనవరి నుంచి మార్కెట్లోకి వచ్చేదాకా ధరల్లో మార్పు ఉండబోదని తెలిపింది. ఒకసారి కొత్త పంట మార్కెట్లోకి రావడం మొదలైతే ధరలు 30శాతం వరకు తగ్గుతాయని పేర్కొంది. 

ఇక ఉల్లిగడ్డ విషయానికొస్తే.. మహారాష్ట్రలో ఆగస్టులో లోటు వర్షపాతం నమోదవడంతో పంట వేయడం ఆలస్యమైందని, దీంతో అక్టోబరు నాటికి ఉల్లి పంట అందుబాటులోకి రావడం కూడా మరింత ఆలస్యమైందని తెలిపింది. దీంతో సెప్టెంబరుతో పోలిస్తే గత నెలలో ఉల్లి ధరలు కూడా 65శాతం పెరిగాయని వెల్లడించింది. అయితే 10-15 రోజుల్లో హరియాణా నుంచి ఉల్లి మార్కెట్లోకి వస్తుందని, దీంతో ధరలు తగ్గుతాయని తెలిపింది. ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, గుజరాత్‌లలో వర్షాల కారణంగా బంగాళదుంప, ఇతర రబీ పంటలు ధ్వంసమయ్యాయని, అందువల్ల వాటి ధరలు కూడా పెరుగుతున్నాయని క్రిసిల్‌ తెలిపింది. రాబోయే మూడు వారాల్లో బెండకాయ ధరలు తగ్గే అవకాశమున్నట్లు వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని