
Covid 19: ఆ దేశంలో ఇన్నాళ్లకు తొలి కరోనా కేసు!
ఇంటర్నెట్ డెస్క్: గత 20 నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఒక ద్వీపమైన టోంగాలో ఇప్పుడు తొలి కరోనా కేసు నమోదైంది. దేశంలో శుక్రవారం తొలి కరోనా కేసు నమోదైందని ఆ దేశ ప్రధానమంత్రి పోహివా టు ఒనెటోవా వెల్లడించారు. న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వ్యాక్సిన్ వేసుకున్నా.. కరోనా సోకిందని పేర్కొన్నారు. క్రిస్ట్‌చర్చ్‌లో విమానం ఎక్కే సమయంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆ వ్యక్తికి నెగెటివ్ వచ్చిందని.. టోంగాకు వచ్చిన తర్వాత చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందన్నారు. వెంటనే ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ఎయిర్పోర్ట్ సిబ్బందిని క్వారంటైన్‌కు పంపించామని తెలిపారు. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లాక్‌డౌన్‌కు సిద్ధమవ్వాలని ప్రధాని సూచించారు.
లక్షమంది జనాభా ఉన్న టోంగా దేశం న్యూజిలాండ్‌కు 2,380కి.మీ దూరంలో, ఫిజికి 800 కి.మీ దూరంలో ఉంది. ఇప్పటి వరకు ఈ దేశంలో కరోనా కేసులు నమోదు కాకపోవడానికి కారణం.. ముందు జాగ్రత్త చర్యలే. ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసురుతోందని తెలిసిన వెంటనే.. తమ దేశంలోకి విదేశీయులు రాకుండా టోంగా ప్రభుత్వం నిలువరించింది. గతేడాది మార్చి నుంచే దేశంలో ఎమెర్జెన్సీని ప్రకటించింది. కరోనా కేసులు లేకున్నా.. వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే 86శాతం తొలిడోసు.. 62శాతం రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసింది. మరోవైపు విదేశాల్లో కరోనా కేసులు నియంత్రణలోకి రావడం.. కరోనా ఆంక్షలు ఎత్తివేయడంతో టోంగాలోనూ విదేశీ ప్రయాణికులకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ఆ దేశానికీ పాకింది. తొలి కేసు నమోదైన నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారని, వీలైంత త్వరగా.. వందశాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి అమెలియా తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.