Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లో పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 19 Jun 2022 21:06 IST

1. అమిత్‌ షాతో ఈటల భేటీ... తెలంగాణలో భాజపా కొత్త వ్యూహమేంటి?

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న భాజపా నాయకత్వం ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకెళ్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ప్రత్యేకంగా దిల్లీకి పిలిపించుకొని భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈటలను హుటాహుటిన దిల్లీకి ఎందుకు పిలిచారు? కొత్తగా ఏమైనా బాధ్యతలు అప్పగించబోతున్నారా? కొత్తగా ప్రణాళిక ఏమైనా ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి

2. దసరా తర్వాత మీ సంగతి చూస్తాం: పవన్‌ కల్యాణ్‌

క్రిమినల్‌ కేసులున్న నాయకులు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు.కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా బాపట్ల జిల్లాలోని పర్చూరులో పవన్‌ పర్యటించారు. ‘పొత్తులపై మాట్లాడే సమయం కాదిది. ప్రజలతోనే నాకు పొత్తు.  దసరా నుంచి మేం రోడ్లపై ఉంటాం. ప్రజాసమస్యలపై తీరుగుతాం. అప్పటివరకు మీరేం మాట్లాడినా భరిస్తాం. దసరా తర్వాత వైకాపా నాయకుల సంగతి చూస్తాం’ అని హెచ్చరించారు.

3. అగ్నివీరులను సెక్యూరిటీ గార్డులుగా పెట్టుకుంటాం..!

అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ భాజపాకు (BJP) చెందిన నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీరులను తమ పార్టీ ఆఫీసుకు సెక్యూరిటీగా గార్డులుగా పెట్టుకుంటామంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో.. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేశారు.

4. సికింద్రాబాద్‌ ఘటనలో కాల్పులు జరిపింది రైల్వే పోలీసులే: ఎస్పీ అనురాధ

‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన వారిలో ఇప్పటివరకు 46 మందిని అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్సీ అనురాధ వెల్లడించారు. ఈ ఘటనలో మిగిలిన వారికోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఆర్మీ అభ్యర్థుల వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్‌ల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసి అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామన్నారు.

5. తెలంగాణ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మను బదిలీ చేసి ఆయన స్థానంలో జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌కు పదోన్నతి ఇవ్వాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

6. వర్షాలు, రేట్ల పెంపు.. ద్రవ్యోల్బణ కట్టడి ఈ రెండే కీలకం

సాధారణ వర్షాలు కురిసి పంట దిగుబడులు పెరగడం, వడ్డీరేట్లను ఆర్‌బీఐ మరింత పెంచడమే ద్రవ్యోల్బణ కట్టడికి మార్గమని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. తాజా ద్రవ్యోల్బణ పెరుగుదలకు ఆహార వస్తువులు, ఇంధన ధరలు ఎగబాకడమే ప్రధాన కారణమని వివరించారు. ధరల్ని నియంత్రించేందుకు ప్రభుత్వానికి ఇప్పటికీ పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు.

7. కొనసాగుతున్న ఎఫ్‌పీఐల అమ్మకాలు.. 

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది.  ఈ నెలలో ఇప్పటి వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (FPI) రూ.31,430 కోట్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 2022 ఆరంభం నుంచి మొత్తంగా రూ.1.98 లక్షల కోట్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి తరలిపోయాయి. 

8. ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో (Jammu and Kashmir) జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు (terrorists) హతమయ్యారు. కుప్వారా, కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్​కౌంటర్లలో భద్రతా బలగాలు వీరిని మట్టుబెట్టాయి. మృతిచెందినవారిలో ఒకరు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది అని, లష్కరే తొయిబా సంస్థ కోసం పనిచేస్తున్నాడని అధికారులు వెల్లడించారు.

9. ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే.. ఆర్మీలో ప్రవేశం లేనట్లే..!

‘అగ్నిపథ్‌’ (Agnipath)కు దరఖాస్తు చేసుకునేవారు గతంలో నిరసనలు, హింసాత్మక ఘటనల్లో ఎన్నడూ పాల్గొనలేదనే విషయాన్ని వెల్లడించాల్సి ఉంటుందని త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒకవేళ ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు పోలీస్‌ వెరిఫికేషన్‌లో తేలితే అటువంటి వారికి అగ్నివీరులుగా ప్రవేశం పొందేందుకు ఆస్కారం ఉండదని తేల్చి చెప్పారు. 

10. ‘ఇలాగైతే పీఎం, సీఎంల ఎంపికకు టెండర్లు పిలుస్తారు’

సైన్యంలో కొత్తగా ప్రతిపాదించిన ‘అగ్నిపథ్‌(Agnipath)’ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) తాజాగా కేంద్రంపై మండిపడ్డారు. ఒప్పంద పద్ధతిలో సైనిక నియామకాలు ప్రమాదకరం.. యువత ఆశయాలు, జీవితాలతో ఆడుకోవడం సరికాదని పేర్కొన్నారు. శివసేన(ShivSena) 56వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని