Top 10 news @ 1PM

ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన పది వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 12 Jun 2021 13:09 IST

1. Eatala: శాస‌నస‌భ‌ స‌భ్య‌త్వానికి ఈట‌ల రాజీనామా

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇప్ప‌టికే తెరాసకు గుడ్‌బై చెప్పిన ఆయ‌న తాజాగా శాస‌నస‌భ‌ స‌భ్య‌త్వానికీ రాజీనామా చేశారు. శామీర్‌పేట‌లోని త‌న ఇంటి నుంచి అనుచ‌రుల‌తో గ‌న్‌పార్క్ చేరుకొన్న ఆయ‌న‌ ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి, తుల ఉమ‌తో క‌లిసి.. అమ‌ర‌వీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అనంత‌రం శాస‌న‌స‌భాప‌తి కార్యాల‌యంలో ఈట‌ల రాజీనామా ప‌త్రాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా కొన‌సాగా అని ఇప్పుడు రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపారు.

2. Raghurma: నాపై అన‌ర్హ‌త సాధ్యం కాదు

తాను ఏ పార్టీతోనూ జట్టుక‌ట్ట‌లేద‌ని.. అధికార పార్టీ కార్య‌క‌లాపాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌లేదని న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు అన్నారు. వైకాపా ఎంపీగా ఎన్నికైన రఘురామ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు లోక్‌సభలో వైకాపా చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ శుక్రవారం ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఎంపీ స్పందించారు. ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌లితాల అమ‌లులో లోపాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించాన‌ని.. తనపై అన‌ర్హ‌త వేటు వేయ‌డం సాధ్యం కాద‌ని వివ‌రించారు.

3. Fauci: డోసుల మధ్య విరామం పెంపుతో.. ముప్పు 

కొవిడ్‌ టీకా డోసుల మధ్య విరామ సమయాన్ని పెంచడం వల్ల.. వ్యాప్తిలో ఉన్న కరోనా వేరియంట్ల బారినపడే ముప్పు ప్రజలకు పెరుగుతుందని అమెరికాలో అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. బ్రిటన్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైందని ఓ భారతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.కొవిషీల్డ్‌ టీకా డోసుల మధ్య విరామాన్ని గతనెలలో భారత ప్రభుత్వం పెంచడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు స్పందించారు.

4. Corona: 90వేల దిగువకు.. ఈ నెలలో రెండోసారి

ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్లు, ఆంక్షల ఫలితంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. శుక్రవారం 19,20,477 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 84,332 కొత్త కేసులు వెలుగుచూశాయి. వరుసగా ఐదోరోజూ లక్ష దిగువనే కేసులు నమోదయ్యాయి. 90 వేల దిగువకు కేసులు నమోదు కావడం ఈ నెలలో ఇది రెండోసారి. 24 గంటల వ్యవధిలో మరో 4,002 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2,93,59,155కి చేరగా.. 3,67,081 మంది బలయ్యారు.

 

*Corona: కొవిడ్‌తో నాడీవ్యవస్థ కుదేలు

5. జూన్‌ 26న రైతుల ‘రాజ్‌భవన్ల ముట్టడి’

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26న ‘రాజ్‌భవన్ల ముట్టడి’కి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ల నివాసాలైన రాజ్‌భవన్‌ల ముందు ధర్నాలు చేపడతామని వెల్లడించాయి. నల్లజెండాలతో ధర్నాలో పాల్గొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతి పత్రాలను పంపిస్తామని సంయుక్త కిసాన్‌మోర్చా నాయకుడు ఇంద్రజిత్‌ సింగ్‌ తెలిపారు.

6. Choksi: చోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ‌

పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు మెహుల్‌ ఛోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను అక్కడి హైకోర్టు తిరస్కరించింది. ఫ్లైట్‌ రిస్క్‌ కారణాలతో ఆయనకు బెయిల్‌ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే మెహుల్ ఛోక్సీకి డొమినికాతో ఎలాంటి సంబంధాలు లేవని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తాను తప్పించుకోబోనని ఛోక్సీ కోర్టుకు హామీ ఇచ్చేలా అతనిపై న్యాయస్థానం ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది.

7. Sachin Pilot: దిల్లీకి సచిన్‌ పైలట్.. కారణమేంటి?

కాంగ్రెస్‌ యువనేత జితిన్‌ ప్రసాద భాజపాలో చేరిక.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్లీ అసమ్మతికి సెగలకు ఆజ్యం పోస్తున్నట్లే కన్పిస్తోంది. జితిన్‌ పార్టీని వీడిన తర్వాత నుంచి రాజస్థాన్‌లో మరో యువనేత, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌కు మద్దతు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పైలట్ దిల్లీ పర్యటన అనేక ఊహాగానాలకు తావిస్తోంది. శుక్రవారం సాయంత్రం సచిన్‌ పైలట్‌ దిల్లీ చేరుకున్నారు. ఆదివారం వరకు ఆయన ఇక్కడే పర్యటించనున్నారు. అయితే పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిసే ప్రణాళికలేమీ లేవని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

 

*యువీ.. నా కొడుకు కెరీర్‌ ముగించినందుకు థాంక్యూ

8.TS News: భూముల అమ్మ‌కానికి నోటిఫికేష‌న్‌

 నిధుల సమీకరణలో భాగంగా అత్యవసర ప్రజాపయోగ అవసరాల్లేని, విలువైన ప్రాంతాల్లో ఆక్రమణలకు అవకాశమున్న ప్రభుత్వ భూములను అమ్మాలని సర్కారు నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భూముల అమ్మ‌కానికి సంబంధించి ఈ నెల 15 న నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్న‌ట్లు.. 25న ప్రీబిడ్ స‌మావేశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. జులై 13 రిజిస్ట్రేష‌న్ల‌కు చివ‌రి తేదీ అని 15వ తేదీ ఈ వేలం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించింది. భూముల విక్ర‌యాల్లో భాగంగా కోకాపేట‌లో 49.95 ఎక‌రాలు, ఖానామెట్‌లోని 15.1 ఎక‌రాల‌ను ప్లాట్లుగా విక్ర‌యించ‌నున్నారు.

9. SBI Kavach: కొవిడ్‌ చికిత్స కోసం వ్యక్తిగత రుణం

కొవిడ్‌-19 చికిత్స కోసం రుణం కావాలనుకునే వారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కవచ్‌ పేరుతో వ్యక్తిగత రుణ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. గరిష్ఠంగా రూ.5లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేని రుణాన్ని ఇస్తోంది. దీనికి 8.5శాతం వడ్డీగా నిర్ణయించింది. వ్యక్తిగతంగా, కుటుంబ సభ్యుల చికిత్స ఖర్చుకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చని ఎస్‌బీఐ తెలిపింది. ఈ రుణానికి 60 నెలల వ్యవధి ఉంటుందని, ఇందులోనే మూడు నెలల మారటోరియం  ఇస్తున్నట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా తెలిపారు.

10. GST: మొదలైన జీఎస్‌టీ మండలి సమావేశం

 వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) మండలి 44వ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ భేటీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. కరోనా మందులు, పరికరాలపై పన్నులు తగ్గించే విషయమై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని