Published : 01 May 2021 12:55 IST

Top 10 News @1PM

1. వైకాపా పాలనలో కార్మికులు రోడ్డునపడ్డారు: చంద్రబాబు

అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తెదేపా ఆవిర్భవించిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. శనివారం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఆయన కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మేం అధికారంలో ఉన్నప్పుడు చంద్రన్న బీమాతో 2.50 కోట్ల మంది కార్మికులకు భరోసా కల్పించాం. కార్మికులు ఆకలిలో ఉండకూడదని అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశాం. వందల పరిశ్రమలు నెలకొల్పి లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఆనాటి కార్మిక సంక్షేమ పథకాలు ఏవీ ఇప్పుడు లేవు’’ అని చంద్రబాబు అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. Corona: 4లక్షలు దాటిన కొత్త కేసులు 

కరోనా కాటుతో యావత్‌ దేశం అల్లాడిపోతోంది. దేశం నలుమూలలా వైరస్‌ విరుచుకుపడుతోంది. మునుపెన్నడూ లేనంత ఉద్ధృతితో వ్యాపిస్తుండటంతో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4లక్షలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఇంత అత్యధిక కేసులు నమోదవడం, అదీ భారత్‌లోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. అటు వరుసగా నాలుగో రోజు 3వేల మందికి పైనే కరోనాతో మృత్యువాతపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. Covid వాసన పొందడానికి శిక్షణే మేలు

 కొవిడ్‌-19 బారినపడివారికి వాసన చూసే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. అయితే ఇలాంటి వారికి స్టెరాయిడ్లను ఇవ్వరాదని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు సూచించారు. దానికి బదులు వారికి వాసన సామర్థ్యాన్ని పెంచే శిక్షణ ఇవ్వాలని కోరారు. రోజుకు రెండుసార్లు కనీసం నాలుగు భిన్నరకాల వాసనలను వారికి చూపాలని సూచించారు. ఇలా కొన్ని నెలల పాటు చేయాలన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. Ts Corona : 7,754 కొత్త కేసులు

 తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 77,930 పరీక్షలు నిర్వహించగా.. 7,754 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో చికిత్స పొందుతూ మరో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 2,312గా ఉంది. ఇక కరోనాను తాజాగా 6,542 మంది జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్నవారి సంఖ్య 3,62,160కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 క్రియాశీల కేసులు ఉన్నాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. NiravModi: భారత్‌కు అప్పగింతపై మళ్లీ కోర్టుకు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను వేల కోట్లకు మోసగించి లండన్‌ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ.. భారత్‌ రాకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అతడిని భారత్‌కు అప్పగించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూకే కోర్టు తీర్పు ఇవ్వగా.. ఇటీవల ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై నీరవ్‌ మరోసారి యూకే హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి
 
6. ‘అసైన్డ్‌ భూమి ఉన్నట్లు విచారణలో తేలింది’

తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటలపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి మెదక్‌ జిల్లా అచ్చంపేటలో అ.ని.శా, విజిలెన్స్‌ అధికారులు ఈ ఉదయం విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ విజిలెన్స్ విచారణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మూసాపేట తహసీల్దార్‌ కార్యాలయంలో భూముల రికార్డులనుపరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘‘అసైన్డ్‌ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత నివేదిక సమర్పిస్తాం’’ అని అన్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. కార్మికులకు తెలుగు రాష్ట్రాల సీఎం శుభాకాంక్షలు

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘శ్రమజీవులతోనే అభివృద్ధి, మానవజాతి పురోగతి సాధ్యం. దేశ, రాష్ట్రాభివృద్ధిలో కార్మికులది కీలక భాగస్వామ్యం. మే డే స్ఫూర్తితో సబ్బండ వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. తెలంగాణలో ఆదర్శవంతమైన కార్మిక, కర్షక విధానాలు అమలు చేస్తున్నాం. రాష్ట్ర పారిశ్రామిక విధానంతో సంపద సృష్టి, ఉపాధి కల్పన సాధ్యమవుతోంది’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. తమ శ్రమతో సమాజాన్ని నిర్మించి, ప్రపంచ పురోగతికి కార్మిక సోదరీ, సోదరీమణులు బాటలు వేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌ శ్లాఘించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. గురుద్వారాలో మోదీ పూజలు

17వ శతాబ్దానికి చెందిన దిల్లీలోని ప్రముఖ గురుద్వారాలో ప్రధాని మోదీ శనివారం ఉదయం పూజలు చేశారు. సిక్కు గురువు గురు తేగ్‌ బహదూర్‌ 400వ ప్రకాశ్‌ పర్వ్‌ (జయంతి) సందర్భంగా ప్రధాని పురాతన సిస్‌ గంజ్‌ సాహెబ్‌ గురుద్వారాలో పూజలు నిర్వహించారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు లేకుండానే ప్రధాని గురుద్వారాను సందర్శించినట్లు ప్రధానమంత్రి అధికార కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. Covid కేంద్రంలో ప్రమాదం..18 మంది మృతి

గుజరాత్‌ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా బాధితులు చికిత్స పొందుతున్న భరూచ్‌లోని పటేల్ వెల్ఫేర్‌ కొవిడ్‌ సంరక్షణ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 18 మంది కరోనా బాధితులు మృతి చెందారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. సీఐడీ విచారణకు మరోసారి దేవినేని ఉమ

ఏపీ మాజీ మంత్రి, తెదేపా నాయకుడు దేవినేని ఉమ ఈ ఉదయం మరోసారి మంగళగిరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్‌ అభియోగాలపై ఏప్రిల్‌ 29న 9 గంటలపాటు ఉమను సీఐడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. ‘‘సీఎం ఆనందం కోసం నన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాల మేరకు రెండోసారి సీఐడీ ముందుకెళ్తున్నా. రాత్రి 10 గంటల వరకు లోపల కూర్చొబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని అన్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని