Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Mar 2023 14:15 IST

1. పాన్‌- ఆధార్‌ అనుసంధానానికి గడువు పొడిగింపు

పాన్‌- ఆధార్‌ (PAN - AAdhaar) అనుసంధానానికి గడువును కేంద్రం పొడిగించింది. మార్చి 31తో గడువు ముగియాల్సి ఉండగా.. మరో మూడు నెలలు పెంచుతూ జూన్‌ 30 వరకు అనుసంధానానికి అవకాశం ఇచ్చింది. పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం ఇచ్చే ఉద్దేశంతో గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తెలియజేసింది. నిర్దేశిత గడువులోగా పాన్‌- ఆధార్‌ అనుసంధానం పూర్తి చేయకుంటే జులై 1 నుంచి పాన్‌ నిరుపయోగంగా మారనుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా.. కారణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీఎస్సీ గ్రూప్‌ -1 మెయిన్స్‌ (APPSC Group-1 mains) పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 23 నుంచి 29వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉండగా జూన్‌ తొలి వారానికి వాయిదా వేశారు. ఏప్రిల్‌ 24 నుంచి మే 18వరకు సివిల్స్‌ ఇంటర్వ్యూలు ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలను జూన్‌ 3 నుంచి 9వరకు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు  వెల్లడించారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. హైదరాబాద్‌ రోజురోజుకీ విస్తరిస్తోంది: కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరం రోజురోజుకీ విస్తరిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలోని శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని 185 చెరువుల అభివృద్ధిలో క్రెడాయ్‌ను భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. నిర్మాణ రంగంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.నగరంలోని నీటి అవసరాలు, సుందరీకరణ లక్ష్యంలో భాగంగానే ఈ కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. నిర్మాణ రంగంతోపాటు ఫార్మా, పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్‌ అంతర్జాతీయ కేంద్రంగా మారుతుందని హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.  ‘అమ్మ’ పార్టీకి అధినాయకుడిగా.. పళని ఏకగ్రీవంగా ఎన్నిక

తమిళనాట (Tamilnadu) దశాబ్దాల చరిత కలిగిన అన్నాడీఎంకే (AIADMK) పార్టీ పగ్గాలను మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) పూర్తిస్థాయిలో అందుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా  ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ సీఎం ఒ. పన్నీర్‌ సెల్వం (O Panneerselvam) వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన కొద్దిసేపటికే.. పళని ఎన్నికపై అధికారిక ప్రకటన రావడం గమనార్హం.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5.వైతెపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట.. కిందపడిపోయిన వైఎస్‌ షర్మిల

 వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి పరిస్థితులను స్వయంగా చూడాలనుకున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైతెపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో షర్మిల కిందపడిపోయారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. తమ నేతలను ఎక్కడికి వెళ్లకుండా గృహనిర్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ నియంత అని మరోసారి నిరూపితం అయిందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6.పులివెందులలో కాల్పుల కలకలం

వైఎస్సార్‌ జిల్లా, సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. భరత్‌ కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి తన తుపాకీ తీసుకొని ఇద్దరు వ్యక్తులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన దిలీప్‌, మహబూబ్‌ బాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భరత్‌ కుమార్‌ యాదవ్‌, పులివెందుల పట్టణంలోని గొర్రెల వ్యాపారి దిలీప్‌ మధ్య ఆర్థికలావాదేవీలు ఉన్నాయి. గత వారం రోజులుగా ఇద్దరూ డబ్బుల విషయంలో గొడవపడుతున్నట్టు సమాచారం. దిలీప్‌.. భరత్‌కుమార్‌ యాదవ్‌కు అప్పు ఉండటంతో ఆ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఏప్రిల్ 1 నుంచి.. వీటి ధరలు మారుతాయ్‌..!

ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్‌(Union Budget 2023-24)లో చేసిన ప్రకటనల ఆధారంగా ఏప్రిల్ నుంచి కొన్ని వస్తువుల ధరల్లో మార్పులు రానున్నాయి.  బడ్జెట్‌లో సుంకాలు(import duty), పన్ను స్లాబు(tax slabs)ల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది.  దేశీయ తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం కొన్నివస్తువులు ధరలు పెరగనున్నాయి. మరికొన్ని తగ్గనున్నాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్‌కు.. ఇకపై ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోనే బుకింగ్స్‌

శివుని పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాలలో కేదార్‌నాథ్‌ (Kedarnath) ఒకటి. అలాగే చార్‌ ధామ్‌ యాత్రలో ఇది కూడా భాగం. ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకొని శివుణ్ని దర్శించుకొంటారు. అయితే, హిమాలయాల్లో 3,553 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం అంత సులువు కాదు. ఉత్తరాఖండ్‌లోని గౌరీ కుండ్‌ వరకు మాత్రమే వాహనాలపై వెళ్లేందుకు వీలుంటుంది. అక్కడి నుంచి మరో 18 కి.మీ యాత్ర అతికష్టంగా ఉంటుంది. ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం ఏప్రిల్‌ 25 నుంచి తెరుచుకుంటాయని సమాచారం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. పులివెందులలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

వైఎస్సార్‌ జిల్లా, సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. భరత్‌ కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి తన తుపాకీ తీసుకొని ఇద్దరు వ్యక్తులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన దిలీప్‌ను కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.  మహబూబ్‌ బాషా పులివెందులలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. భరత్‌ కుమార్‌ యాదవ్‌, పులివెందుల పట్టణంలోని గొర్రెల వ్యాపారి దిలీప్‌ మధ్య ఆర్థికలావాదేవీలు ఉన్నాయి. గత వారం రోజులుగా ఇద్దరూ డబ్బుల విషయంలో గొడవపడుతున్నట్టు సమాచారం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ఉక్రెయిన్‌కు చేరిన లెపర్డ్‌ ట్యాంకులు..!

 జర్మనీ(Germany) నుంచి అత్యాధునిక లెపర్డ్‌-2 (Leopard-2)ట్యాంకులు ఉక్రెయిన్‌ (Ukraine)అందడం మొదలైంది. ఈ ట్యాంకులను ఉక్రెయిన్‌కు సరఫరా చేయడానికి ముందే ఆ దేశ సైనికులకు వీటి వినియోగంపై శిక్షణ ఇచ్చారు. దీనిపై జర్మనీ రక్షణ మంత్రి బోరిస్‌ పిస్టోరియస్‌ మాట్లాడుతూ ఈ ట్యాంకులు యుద్ధంలో నిర్ణయాత్మక పాత్రను పోషించనున్నాయని పేర్కొన్నారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ఉక్రెయిన్‌ మిత్రులకు ట్యాంకులు అందించామని చెప్పారు. మరోవైపు యూకే నుంచి ఛాలెంజర్‌-2 ట్యాంకులు కూడా ఇప్పటికే ఉక్రెయిన్‌కు చేరాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు