Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jun 2023 17:02 IST

1. ఐటీ ఉత్పత్తుల నుంచి ఆహార ఉత్పత్తుల వరకు అద్భుత పురోగతి: కేటీఆర్‌

ఐటీ ఉత్పత్తుల నుంచి ఆహార ఉత్పత్తుల దాకా అద్భుత పురోగతితో తెలంగాణలో (Telangana) అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులో జరిగిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైపుణ్య అభివృద్ధి కేంద్రం, కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌, వ్యర్థాల శుద్ధి కేంద్రం, పారిశ్రామిక వేత్తల సమాఖ్య కార్యాలయాలను మంత్రి జగదీశ్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.ఫోన్‌ హ్యాకింగ్‌ కేసు.. తొలిసారి కోర్టు మెట్లెక్కిన ప్రిన్స్‌ హ్యారీ

బ్రిటన్‌ (Briatin) రాజకుటుంబం (Royal Family) చరిత్రలోనే ఓ కొత్త పరిణామం. 130 ఏళ్లలో తొలిసారి ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కోర్టుకు హాజరయ్యారు. ఫోన్‌ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో ఓ వార్తా సంస్థకు వ్యతిరేకంగా కింగ్‌ ఛార్లెస్‌ 3 రెండో తనయుడు ప్రిన్స్‌ హ్యారీ (Prince Harry) కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3.‘డార్క్‌ వెబ్‌’లో డ్రగ్స్‌.. రూ.కోట్ల విలువైన 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ పట్టివేత!

డార్క్‌ వెబ్‌ (Dark Web) ఆధారంగా దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతోన్న ఓ భారీ నెట్‌వర్క్‌ (Drugs Trafficking Network)ను ఛేదించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) తెలిపింది. ఈ క్రమంలోనే రూ.కోట్ల విలువైన 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ (LSD Blots)ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఒకే ఆపరేషన్‌లో ఈ స్థాయిలో ఎల్‌ఎస్‌డీని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని వెల్లడించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన రెండు కేసుల్లో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆపరేషన్‌ బ్లూ స్టార్‌కు 39ఏళ్లు.. ఆ రోజున ఏం జరిగింది..?

పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంలో 1984లో జరిపిన సైనిక చర్య (Operation Blue Star)కు నేటితో 39ఏళ్లు పూర్తయ్యాయి. ఆలయంలో దాక్కున్న మిలిటెంట్లను పట్టుకునేందుకు భారత సైన్యం (Indian Army) చేపట్టిన చర్య అది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు చేపట్టిన ఆ సైనిక చర్యలో 83మంది భారత సైనికులు అమరులయ్యారు. అందులో వేర్పాటువాద నేతలూ హతమయ్యారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు.. దేశ చరిత్రలో ఓ మారణహోమానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’కు దారితీసిన పరిస్థితులు, సైనిక చర్యలో ఏం జరిగిందనే విషయాలను ఓసారి గుర్తుచేసుకుంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5.₹లక్ష ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకోండిలా..

తెలంగాణలోని బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులకు ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. ఆర్థిక సాయం కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫొటో, ఆధార్, కులధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మంచిర్యాల జిల్లాలో ఈనెల 9న ₹లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్.. షెడ్యూల్‌, ప్రైజ్‌మనీ...?

టెస్టు క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక టోర్నీ ఏదైనా ఉందంటే అది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (WTC). ఒకరకంగా చెప్పాలంటే ఇది టెస్టుల్లో ప్రపంచకప్‌. మరుగునపడిపోతున్న టెస్టు క్రికెట్‌కు తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు ఐసీసీ ప్రయోగాత్మకంగా 2019లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌నకు శ్రీకారం చుట్టింది.  పోటీపడిన జట్లలో పాయింట్ల పట్టికలో నిలిచిన టాప్‌-2 జట్లతో రెండేళ్లకొసారి ఫైనల్‌ (WTC Final)నిర్వహిస్తోంది. భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్టు ఛాంపియన్ షిప్‌  ఫైనల్‌ (2021)లో కివీస్‌ విజేతగా నిలిచి మొట్టమొదటి డబ్ల్యూటీసీ గదను దక్కించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కేంద్ర ప్రభుత్వం చేసిన ‘పెద్ద తప్పిదం’ అదే.. వీరప్ప మొయిలీ

ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) పెను విషాదం నింపిన నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ(Veerappa Moily) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రైల్వేలకు ప్రత్యేకంగా ఉన్న బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేయడమే ఎన్డీయే ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమన్నారు. దాని ద్వారానే రైల్వేలపై ప్రత్యేక దృష్టి లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు.గతంలో మాదిరిగా మళ్లీ వేర్వేరుగా బడ్జెట్లు ప్రవేశపెట్టడం అమలు చేయాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ఒడిశాలో ఘటన

ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొని 278 మంది దుర్మరణం చెందిన ఘోర ప్రమాదాన్ని (Odisha Train Tragedy) మరవకముందే మరో రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది. సికింద్రాబాద్‌-అగర్తల ఎక్స్‌ప్రెస్‌ (Secunderabad-Agartala Express)లోని ఓ బోగీలో పొగలు కమ్మేశాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సికింద్రాబాద్‌ - అగర్తల ఎక్స్‌ప్రెస్‌ రైలు ఒడిశాలోని బరంపూర్ రైల్వే స్టేషన్‌లో ఆగినప్పుడు బి-5 ఏసీ కోచ్‌ నుంచి పొగలు (Smoke) రావడం ప్రయాణికులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9.ఖలిస్థాన్‌ ‘టైగర్‌ ఫోర్స్‌’పై ఎన్‌ఐఏ దృష్టి.. 10 చోట్ల ఏకకాలంలో దాడులు

ఉగ్ర గ్రూప్‌ ఖలీస్థాన్‌ టైగర్‌ఫోర్స్‌(కేటీఎఫ్‌)కు చెందిన 10 స్థావరాలపై మంగళవారం ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు చేస్తోంది. పంజాబ్‌లోని తొమ్మిది చోట్ల, హరియాణాలో ఒక చోట ఈ దాడులు జరుగుతున్నాయి. ఉగ్ర సంస్థలకు నిధుల సేకరణ, పాక్‌ నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను రప్పించడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ తనిఖీలు జరుగుతున్నాయి. గతేడాది ఆగస్టు 20వ తేదీన పలువురిపై సుమోటోగా కేసులు నమోదు చేసింది. మే 19న కెనడాకు చెందిన ఉగ్రవాది అర్ష్‌ దల్లా సన్నిహితులు అమృత్‌పాల్‌ సింగ్‌, అమ్రిత్క్‌ సింగ్‌లను అరెస్టు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఒడిశా రైలు దుర్ఘటన.. విద్యుత్‌ షాక్‌తోనే 40 మంది మృతి..!

ఒడిశాలో గతవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదం(Odisha Train Tragedy)లో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 278 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కనీసం 40 మంది విద్యుత్‌ షాక్‌ (electrocution) వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని