Top 10 News @ 9AM

ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన 10 వార్తల కోసం క్లిక్‌ చేయండి

Published : 01 May 2021 08:58 IST

1. కొవిడ్‌ కేంద్రంలో ప్రమాదం..18 మంది మృతి

కొవిడ్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి 18 మంది మృతిచెందిన ఘటన గుజరాత్‌ రాష్ట్రం భరూచ్‌లోని కొవిడ్‌ సంరక్షణ కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ అర్ధరాత్రి తర్వాత కొవిడ్‌ కేంద్రంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం జరిగిన కేంద్రంలో ఉన్న కొవిడ్ రోగులను అధికారులు ఇతర ఆస్పత్రులకు తరలించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. మంత్రి ఈటలపై విచారణ

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తమ అసైన్డ్‌ భూములు కబ్జా చేశారంటూ కొంతమంది రైతులు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన వెంటనే స్పందించి దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో తమకు చెందిన అసైన్డ్‌ భూములను మంత్రి కబ్జా చేశారని, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని పేర్కొంటూ రైతులు శుక్రవారం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఆయన విచారణకు ఆదేశించారని సీఎం కార్యాలయం తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. పడకలకు ప్రయాస

ఏపీ వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు నానాటికీ ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కరోనా బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. వీరి తాకిడికి తగ్గట్లుగా పడకలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో పడకల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన బాధితులు ప్రభుత్వాసుపత్రుల్లో పడకల కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఒకవైపు ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతున్నా...పడకలు లభించక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వారు ఆసుపత్రుల గేట్ల దగ్గర  పడిగాపులు కాస్తున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఈటల భవిష్యత్తు ఏమిటి?

భూకబ్జా ఆరోపణలపై ముఖ్యమంత్రి సమగ్ర విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్‌ రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆయనకు సత్సంబంధాలు లేవని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు సంచలనంగా మారాయి. తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకమైన నేతగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మంత్రిగా ఉన్న ఈటలపై విచారణకు ఆదేశించడంతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరినట్లయింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. మీ మూడుముక్కల ఆటతో రాష్ట్రాన్ని నాశనం చేస్తారా?

‘‘అమరావతిని రాజధానిగా నిర్ణయించడాన్ని నాడు శాసనసభలో వైకాపా నాయకులు సమర్థించినప్పుడు, కనీసం 30 వేల ఎకరాలు ఉండాలని చెప్పినప్పుడూ లేని కులం ఇప్పుడొచ్చిందా? అమరావతిపై ఆ రోజు లేని అయిష్టత ఇప్పుడెందుకు ఏర్పడింది? ఆ రోజు అధికారం కోసం ఏమైనా మాట్లాడి, ఇప్పుడు మూడు ముక్కలాటతో అమరావతిని, ఆంధ్రప్రదేశ్‌ని నాశనం చేస్తారా?’’ అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. త్వరగా అందుబాటులోకి రెమ్‌డెసివిర్‌!

కొవిడ్‌-19 రెండోదశ విజృంభణతో ఆసుపత్రుల పాలవుతూ, ‘రెమ్‌డెసివిర్‌’ మందు కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ మందుకు ఎన్నడూ లేనంత కొరత ఏర్పడినందున, తయారీ పెంచి, సత్వరం బాధితులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఔషధ కంపెనీలు,  ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాయి. ఈ చర్యల వల్ల వచ్చే కొద్ది వారాల్లో ‘రెమ్‌డెసివిర్‌’ లభ్యత బాగా పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. రెమ్‌డెసివిర్‌ మందును మనదేశంలో జైడస్‌ క్యాడిలా, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, జుబిలెంట్‌ ఫార్మా, హెటిరో డ్రగ్స్‌ తయారు చేస్తున్నాయి. ఉత్పత్తి పెంచాల్సిందిగా ఈ కంపెనీలకు ఇటీవల ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. జూన్‌ వరకు ప్రవేశ పరీక్షలు లేనట్లే!

 కరోనా విరుచుకుపడుతుండటంతో కనీసం జూన్‌ నెలాఖరు వరకు ఏ ప్రవేశ పరీక్షా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి పరీక్షలు వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ పరీక్షలను వాయిదా వేయగా.. తాజాగా జులై 3న జరగనున్న అడ్వాన్స్‌డ్‌ కూడా వాయిదా వేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌, మే నెల పరీక్షలు జరగడంతో పాటు ఫలితాలు విడుదల చేయాలి. మళ్లీ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఫలితంగా జులై 3వ తేదీన జరపడం కష్టమని కమిటీ ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. పబ్లిక్‌గా ప్రధాని ఫోన్‌ నంబర్‌

బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఫోన్‌ నంబర్‌ పబ్లిక్‌గా అందుబాటులో ఉందని పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. 15 ఏళ్లుగా ఆయన ఒకే నంబర్‌ వాడుతున్నట్లు పేర్కొన్నాయి. 2006లో ఓ మీడియా సమావేశంలో స్వయంగా జాన్సనే తన నంబరును బహిర్గతం చేశారని, నాటినుంచి అదే నంబర్‌ అందుబాటులో ఉందని తెలిపాయి. అయితే.. ఈ వార్తలపై స్పందించేందుకు డౌనింగ్‌ స్ట్రీట్‌లోని ప్రధాని కార్యాలయం నిరాకరించింది. కొన్ని మీడియా సంస్థలు ఆ నంబర్‌కు డయల్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ప్రధాని నంబర్‌ సులభంగా లభిస్తుండటం వల్ల భద్రత, బ్లాక్‌మెయిల్‌, లాబీయింగ్‌ సమస్యలు తలెత్తుతాయని ప్రతిపక్ష లేబర్‌ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. కొవిన్‌లో పోటెత్తిన యువతరం

 కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మూడో విడత కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌లో భాగంగా 18 ఏళ్లు పైబడినవారికి టీకాలు ఇచ్చే కార్యక్రమం శనివారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు లబ్ధిదారులు పోటెత్తారు. కొవిన్‌ డిజిటల్‌ వేదికపై ఇప్పటికే 2.45 కోట్ల మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే 18 ఏళ్లు దాటిన వారికి శనివారం నుంచి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పలు రాష్ట్రాలు నిరాకరించాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. భళారే బరార్‌

పంజాబ్‌ కింగ్స్‌ అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ శుక్రవారం 34 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసింది. కెప్టెన్‌ రాహుల్‌ (91 నాటౌట్‌; 57 బంతుల్లో 7×4, 5×6), క్రిస్‌ గేల్‌ (46; 24 బంతుల్లో 6×4, 2×6), హర్‌ప్రీత్‌ బరార్‌ (25 నాటౌట్‌; 17 బంతుల్లో 1×4, 2×6) చెలరేగడంతో మొదట పంజాబ్‌ 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఛేదనలో హర్‌ప్రీత్‌ (3/19) స్పిన్‌ వలలో చిక్కుకున్న బెంగళూరు 8 వికెట్లకు 145 పరుగులే చేయగలిగింది. రవి బిష్ణోయ్‌ (2/17) కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కోహ్లి (35; 34 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచినా.. దూకుడుగా ఆడలేకపోయాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని