Top 10 news @ 9 AM

ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన పది వార్తలు మీకోసం

Updated : 12 Jun 2021 09:04 IST

1. CM KCR: నేనొస్తా.. అన్నీ చూస్తా
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో ప్రగతి పనులపై ఈ నెల 19 నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. పనుల్లో తాత్సారం జరిగినా, సిబ్బంది పనితీరు బాగోలేకపోయినా క్షమించబోనని స్పష్టంచేశారు. పంచాయతీ, పురపాలక చట్టాల కింద నిర్దేశిత బాధ్యతలు నిర్వహించడంలో ఉద్యోగులు, అధికారులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదనపు కలెక్టర్లు అనుకున్న స్థాయిలో సామర్థ్యాన్ని నిరూపించుకోవడం లేదన్నారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడాలని చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల తీరును ఈ నెల 13న జిల్లా అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో సమీక్షిస్తానని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. కేంద్ర మంత్రివర్గంలో మార్పులు?

కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ఊహాగానాలు రాజధానిలో జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాలతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. 2019 మే నెలలో రెండోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంతవరకు మంత్రివర్గంలో మార్పులు జరగకపోవడం గమనార్హం. కేంద్రమంత్రి మండలిలో మొత్తం 79 మందిని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. ప్రస్తుతం రెండు డజన్లకుపైగా ఖాళీలు ఉన్నాయి. ఎన్నికలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గంలో తగిన మార్పులు చేసే సూచనలు ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. లైసెన్సు జారీ వేళ డ్రైవింగ్‌ పరీక్ష ఉండదు

అక్రిడేటెడ్‌ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలకు కొన్ని తప్పనిసరి నిబంధనలను విధిస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటి ప్రకారం అభ్యర్థులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడానికి ప్రతి డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రంలో సిమ్యులేటర్‌, ప్రత్యేక డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ ఉండాలి. మోటారు వాహనాల చట్టం 1988లోని నిబంధనలను అనుసరించి ఈ కేంద్రాల్లో రెమిడియల్‌, రిఫ్రెషర్‌ కోర్సులు అందుబాటులో ఉండాలి. ఈ కేంద్రాల్లో విజయవంతంగా డ్రైవింగ్‌ పరీక్ష పూర్తిచేసిన అభ్యర్థులకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో మళ్లీ డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించరు. దీనివల్ల గుర్తింపు (అక్రిడేటెడ్‌) పొందిన కేంద్రాల్లో డ్రైవింగ్‌ నేర్చుకున్నవారికి శిక్షణ పూర్తయిన వెంటనే లైసెన్సు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

 

రూ.3లక్షల ఉద్యోగం వదిలొచ్చా!

4. ‘కశ్మీర్‌’ భవితపై రాజకీయ కదలిక!

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగహోదా రద్దు చేసిన ఏడాదిన్నర తర్వాత.. కశ్మీర్‌ భవిష్యత్తు నిర్ణయించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. వీలైనంత త్వరగా లోయలో పూర్వస్థితిని పునరుద్ధరించాలని కోరుకొంటున్న ఆ ప్రాంత రాజకీయ పక్షాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో భేటీ కానున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్‌కార్‌ డిక్లరేషన్‌ (పీఏజీడీ)గా ఏర్పడిన కశ్మీర్‌ ప్రాంత ఏడు ప్రధాన రాజకీయపక్షాలతో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రధానమంత్రి కార్యాలయం పావులు కదుపుతున్నట్టు ఈ వర్గాల సమాచారం. కాంగ్రెస్‌, భాజపా రాష్ట్ర యూనిట్లు కూడా ఈ చర్చల్లో పాల్గొనే అవకాశముంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. విశాఖ ఉక్కుపై పునరాలోచించండి

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై పునరాలోచించాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో రెండో రోజైన శుక్రవారం కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, పీయూష్‌ గోయల్‌ను ముఖ్యమంత్రి కలిశారు. ఆయా శాఖల పరిధిలోని సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉక్కు శాఖ మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి కలిశారు. 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఈ కర్మాగారం కింద రూ.లక్ష కోట్ల విలువైన 19,700 ఎకరాల భూమి ఉందని తెలియజేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. అత్యున్నత స్థాయికి న్యాయవ్యవస్థ

శ్రీవారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం బ్రేక్‌ దర్శన సమయంలో ఆయన సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. ఆలయంలో ఎస్వీబీసీ ఛానల్‌తో మాట్లాడారు. స్వామివారి కృపతో తన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని జస్టిస్‌ రమణ వివరించారు. న్యాయవ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు పనిచేస్తానన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

అతడు ఆమై. . అందాల భరిణై

7. ఆన్‌లైన్‌ అప్పు... అజాగ్రత్తతో ముప్పు!

విద్యావంతులు, ఉద్యోగులు ముఖ్యంగా యువత- అప్పు కావాలంటే డిజిటల్‌ పద్ధతినే ఎంచుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో అప్పు అడగడం, కావాల్సిన పత్రాలను పంపించడం, రుణం మంజూరు కాగానే నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బు జమకావడం-. ఇదంతా గంటల్లో పూర్తయిపోతుంది. ఆన్‌లైన్‌లో రుణాలిచ్చే ఇలాంటి డిజిటల్‌ లెండింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌(డీఎల్‌పీ)లు గత మూడు, నాలుగేళ్లుగా దేశంలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. వేగంగా వృద్ధి చెందే వ్యాపారం కావడంతో అంకుర సంస్థలూ దీనిలోకి ప్రవేశించాయి. ఇలాంటి వాటిలో ప్రముఖమైన క్యాష్‌ఈ 2017 నుంచి రూ.1,700 కోట్లను రుణాలుగా ఇచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. TS Police: వానలో ప్రయాణమా..జాగ్రత్త సుమా

 ‘వానలో ప్రయాణిస్తున్నారా... రహదారులపై జాగ్రత్తగా వెళ్లండి’ అంటూ హైదరాబాద్‌ పోలీసులు వాహనదారులకు సూచనలిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రయాణించే అంబులెన్స్‌లు, వైద్యసేవల వాహనదారులు ముందుజాగ్రత్తలు పాటించాలని కూడళ్ల వద్ద ప్రచారం చేస్తున్నారు. మార్గం మధ్యలో వాహనాలు ఆగిపోతే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని, 94906 16555కు వాట్సాప్‌ చేయాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.లాలాజల నమూనాలతో కచ్చితమైన ఫలితం

 కొవిడ్‌-19 నిర్ధారణకు లాలాజల నమూనాలను ఉపయోగించే విషయంలో ఉన్న ప్రతిబంధకాలను తొలగించే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఫలితంగా ముక్కు, గొంతు నుంచి సేకరించే శ్వాబ్‌ ఆధారిత విధానం కన్నా ఇది మెరుగైన ప్రక్రియ అవుతుందని వారు చెప్పారు. లాలాజల నమూనాలను సేకరించడం చాలా సులువు. అయితే వాటిలో శ్లేష్మం లేదా రక్తం కూడా కలిసి ఉండొచ్చు. ఈ లాలాజల విశ్లేషణ వల్ల ఫలితాల్లో కచ్చితత్వం తక్కువగా ఉంటుందని ఇప్పటికే జరిగిన కొన్ని పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో లాలాజలం ద్వారా మరింత కచ్చితమైన ఫలితాన్ని రాబట్టే విధానాన్ని అమెరికాలోని ఆగస్టా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

ప్రపంచమే కదిలింది పసి ప్రాణం నిలిచింది!

10. గో‘దారి’ మళ్లింది

పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఇదో కీలకఘట్టం. గోదావరి సహజ ప్రవాహమార్గానికి ఎగువ కాఫర్‌ డ్యాంతో అడ్డుకట్ట వేసి నదీమార్గాన్ని మళ్లించారు. అప్రోచ్‌ ఛానల్‌ను కొంతమేర తవ్వి స్పిల్‌ వే మీదుగా నీటిని మళ్లించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే రివర్స్‌ స్లూయిస్‌ గేట్లు పదింటి ద్వారా తొలిసారిగా దిగువకు నీటిని వదిలిపెట్టారు. గోదావరి డెల్టా ఖరీఫ్‌ అవసరాలకు తొలిసారి ఇలా నీళ్లు వదిలారు. అంతకుముందు రెండేళ్లు స్పిల్‌ వే మీదుగా గోదావరి ప్రవాహాలు సాగినా కాఫర్‌ డ్యాంలో రెండుచోట్ల వదిలిన నది సహజమార్గాల మీదుగా కూడా ప్రవాహాలు మళ్లించారు. పూర్తిగా నదికి అడ్డుకట్ట నిర్మించి అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా పోలవరం రివర్స్‌ స్లూయిస్‌ గేట్ల ద్వారా నీరు ఇవ్వడం ఇదే తొలిసారి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని