Top 10 News @ 9AM

ఈనాడు.నెట్‌లో ముఖ్యమైన 10 వార్తలు మీ కోసం...

Updated : 11 Jul 2021 16:17 IST

1. భారత్‌కు సాయపడండి
మహమ్మారి వైరస్‌ విజృంభణతో భారత్‌లో వైద్య సేవల రంగం తీవ్ర ఒత్తిడికి గురవుతూ సంక్షోభంలో చిక్కుకుందని ప్రముఖ వైద్య పత్రిక లాన్సెట్‌ పేర్కొంది. అత్యధిక కేసుల భారంతో అల్లాడుతున్న దేశాన్ని ఆదుకోవడానికి అంతర్జాతీయ సమాజం కదలిరావాలని తాజా సంచిక(మే 14)లో ‘ఎ కాల్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ యాక్షన్‌’ పేరుతో రాసిన ప్రత్యేక వ్యాసంలో లాన్సెట్‌ నిపుణులబృందం పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలు ముందుకొచ్చి కరోనా సంక్రమణాన్ని అష్ట దిగ్బంధనం చేయాలని పేర్కొంది. భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్‌తో పొరుగు దేశాలకూ ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. 

2.ముంచుకొస్తున్న తౌక్టే 
లక్షద్వీప్‌ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. ‘తౌక్టే’గా పేరు పెట్టిన ఈ  తుపాను ఆదివారం అత్యంత తీవ్రంగా మారుతుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈనెల 18న గుజరాత్‌ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని తెలిపింది. ఈ క్రమంలో గంటకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అప్రమత్తం చేసింది. ‘తౌక్టే’ కారణంగా కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు.
3. పసిడి వ్యాపారంలో డీలా

 బంగారం విక్రయాలకు కొవిడ్‌ సెగ తగిలింది. శుభకార్యాలు సన్నగిల్లడం, లాక్‌డౌన్‌తో షాపింగుకు ఏర్పడిన ఆటంకాలు ఇందుకు కారణం. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని వివిధ వర్గాల ప్రజలు భావిస్తుంటారు. అందుకే ఈ పండుగకు ఒకటి, రెండు రోజుల ముందుగా బంగారం ఆర్డర్లు భారీగా ఉంటాయి. పండుగ రోజు డెలివరీ తీసుకుంటారు. గడిచిన ఏడాదీ, ఈ సంవత్సరం కూడా అక్షయ తృతీయ పర్వదినం లాక్‌డౌన్‌లో కలిసిపోయింది.

4. పిల్లలకూ టీకా రక్షణ అవసరం

చిన్నారులకు కొవిడ్‌-19 టీకా వేసే అంశం ఇటీవల విస్తృతంగా చర్చనీయాంశమైంది. 12-15 ఏళ్ల మధ్యవారికి వ్యాక్సిన్‌ వేసేందుకు ఈ నెల 5న కెనడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆ వెంటనే అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. ఇతర దేశాలూ ఈ మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది. అంతేకాదు.. 12 ఏళ్ల కన్నా తక్కువ వయసువారికీ టీకాలు వేసే అంశం ఆయా చోట్ల పరిశీలనలో ఉంది. నైతిక విలువల నిపుణులు ఆంటోనీ స్కెలిటన్‌ (వెస్ట్రన్‌ యూనివర్సిటీ, కెనడా), లీసా ఫోర్స్‌బర్గ్‌ (ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం, బ్రిటన్‌) దీన్ని స్వాగతిస్తున్నారు. కౌమారప్రాయులు, చిన్నారుల్లో ఎక్కువ మందికి టీకా వేయకుంటే కొవిడ్‌-19 నుంచి సమాజాన్ని రక్షించడం అసాధ్యమని వారు పేర్కొన్నారు.

5.మృతుల లెక్క... తప్పుల తడక!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మరణాలకు సంబంధించి తాజా అధ్యయనమొకటి విస్తుపోయే విషయాలను బయటపెట్టింది! మృతుల సంఖ్యను లెక్కించడంలో పలు దేశాలు పారదర్శకంగా వ్యవహరించలేదని అభిప్రాయపడింది. భారత్‌లో ఈ నెల 3 నాటికి వాస్తవ కరోనా మరణాలతో పోలిస్తే.. 4.3 లక్షల మరణాలు తక్కువగా నమోదయ్యాయని అంచనా వేసింది. అమెరికా, రష్యా లెక్కల్లోనూ గణనీయమైన తేడాలు ఉన్నాయని సూచించింది. ‘కొవిడ్‌తో మొత్తం మరణాల అంచనా’ పేరుతో ‘యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ)’ ఈ అధ్యయన నివేదికను వెలువరించింది.

6. ఉపాధ్యాయులపై కరోనా కాటు

కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ఉపాధ్యాయులు మృత్యువాతపడ్డారని, రోజుల తరబడి ఆసుపత్రుల్లో చికిత్స పొందినా రూ.లక్షలు ఖర్చవుతున్నాయి తప్ప.. ప్రాణాలు మాత్రం దక్కడంలేదని టీఎస్‌యూటీఎఫ్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నెలన్నర రోజుల్లోనే సర్వీసులో ఉన్న వారితోపాటు విశ్రాంత ఉపాధ్యాయులు మొత్తం 225 మంది కరోనా కాటుకు బలయ్యారని తెలిపింది. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ, వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల్లో 500 మందికిపైగా కరోనా బారిన పడ్డారని, వారిలో ఇప్పటికే 15 మంది వరకు చనిపోయారని వెల్లడించింది.

7. కర్ణాటక, మహారాష్ట్రల్లో భారత్‌ బయోటెక్‌ యూనిట్లు

కొవిడ్‌-19 టీకా ‘కొవాగ్జిన్‌’ ఉత్పత్తి నిమిత్తం భారత్‌ బయోటెక్‌ కర్ణాటక, మహారాష్ట్రల్లో కొత్త యూనిట్లు నెలకొల్పనుంది. బెంగళూరు సమీపంలోని కోలార్‌ వద్ద గల మాలూర్‌ పారిశ్రామిక వాడలో భారత్‌ బయోటెక్‌ టీకాల తయారీ యూనిట్‌ రాబోతోందని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీఎన్‌ అశ్వత్‌ నారాయణ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు వివరించారు. సాధ్యమైనంత త్వరగా ఇక్కడ టీకాల తయారీ మొదలు కావాలనేది తమ ఆలోచనగా తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందిస్తామన్నారు.
8. బడ్జెట్‌పైనా కరోనా కాటు!

రాష్ట్ర బడ్జెట్‌పైనా కరోనా కాటు పడుతుందా అంటే అవుననే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. 2021-22 బడ్జెట్‌ అంచనాలు పెద్దగా పెరిగే ఆశలేవీ కనపడటం లేదు. ఈసారి పద్దు రూ.2.28 లక్షల కోట్ల నుంచి 2.38 లక్షల కోట్ల మధ్యే ఉండొచ్చని ప్రస్తుత అంచనా. ఏడాది కాలానికి పైగా కరోనా అతలాకుతలం చేస్తుండటంతో రాష్ట్ర ఆదాయం అంతంత మాత్రంగా మిగిలింది. ప్రతి ఏటా బడ్జెట్‌ అంచనాలు ఎంతో కొంత పెరగడం సహజం. రెండేళ్లుగా ఈ పరిస్థితులు కనిపించడం లేదు. 2020-21 బడ్జెట్‌ అంచనాలు కూడా అంతకు ముందు ఏడాదితో సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు కూడా అంతకుమించి పెరిగే అవకాశాలు దాదాపు లేవని చెబుతున్నారు.

9. ధైర్యమే.. ఔషధం!!

భయపడని వాడిని క్యాన్సర్‌ కూడా ఏం చేయలేదు.. భయపడితే అల్సర్‌ కూడా చంపేస్తుంది’- ఎందుకీ ప్రస్తావన అనుకుంటున్నారా.. ప్రస్తుత కొవిడ్‌ నేపథ్యంలో చాలా మంది భయంతో అల్లాడిపోతున్నారు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. అసలు వైరస్‌ను ఎదుర్కోవాలంటే ముందుగా ధైర్యంగా ఉండాలి.. ఇదే అసలైన ఔషధమని, ఆ తర్వాతే తమ సలహాలు పాటిస్తూ.. మందులు, పోషకాహారం తీసుకోవాలని చెబుతున్నారు వైద్యులు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ధైర్యమే ఔషధం, సంతోషమే సగం బలం అని ముందుకు సాగాలి.

10. కొవిడ్‌ను జయించిన 25 రోజుల పసికందు

ఒడిశాలో 25 రోజుల పసికందు కొవిడ్‌ను జయించింది. కలహండి జిల్లా మదనపూర్‌ రాంపూర్‌ ప్రాంతానికి చెందిన మహిళ ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నాక.. శిశువు తండ్రి, తాతయ్యకు అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులందరూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ వైరస్‌ సోకినట్లు తేలింది. అయిదు రోజుల పసికందుకూ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అంతా కలిసి భవానిపట్నాలో ఉన్న ఐసొలేషన్‌ కేంద్రంలో చేరారు. అక్కడి నుంచి వీరిని భువనేశ్వర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డలు 20 రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో వీరు కరోనా నుంచి కోలుకున్నట్లు తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని