Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 21 Sep 2023 20:59 IST

1. తీవ్రవాదులకు స్వర్గధామంగా కెనడా: భారత విదేశాంగ శాఖ ధ్వజం

ఖలిస్థానీ అంశంపై కెనడా (Canada) వ్యవహరిస్తున్న తీరును భారత్‌ (India) మరోసారి తీవ్రంగా తప్పుబట్టింది. ఆ దేశం తీవ్రవాదులు, అతివాదులకు స్వర్గధామంగా మారిందని ధ్వజమెత్తింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రికత్తలు నెలకొన్న వేళ.. కేంద్ర విదేశాంగ శాఖ (MEA) అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి (Arindam Bagchi) ఈ వ్యవహారంపై గురువారం మీడియాతో మాట్లాడారు. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలు.. రాజకీయ ప్రేరేపితమేనని దుయ్యబట్టారు. ఇక, భద్రతాపరమైన పరిస్థితుల కారణంగానే కెనడియన్లకు వీసా సర్వీసులను నిలిపివేసినట్లు ధ్రువీకరించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ: శ్రీధర్‌బాబు

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ డి.శ్రీధర్‌బాబు తెలిపారు. గాంధీభవన్‌లో మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘13వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. ఇప్పుడు 5వేల పోస్టులకే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వటం దారుణం. అసెంబ్లీలో చెప్పినట్టు 13వేల పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఉపాధ్యాయ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. చంద్రబాబు అరెస్టుపై లోక్‌సభలో గళమెత్తిన రామ్మోహన్‌ నాయుడు

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టుపై ఆ పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు (Ram Mohan Naidu) లోక్‌సభ వేదికగా మరోసారి గళమెత్తారు. ఇంధన రాకెట్ల ప్రయోగాలు చేసిన ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను తప్పుడు కేసులతో ఎలా నిర్బంధించారో తమ నాయకుడ్ని కూడా అలాగే అరెస్టు చేశారన్నారు. ఎంతో మంది యువనాయకులకు స్ఫూర్తినిచ్చిన నాయకుడిపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. దిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ భేటీ.. పరిశీలనలో 300 పేర్లు!

తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై దిల్లీలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అయ్యింది. కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన ఈ భేటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ గౌడ్‌ హాజరయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి 300 మంది అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వారి పేర్లను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ స్క్రీనింగ్‌ కమిటీకి పంపింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. చంద్రబాబు సీఐడీ ‘కస్టడీ’ పిటిషన్‌పై తీర్పు వాయిదా

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30గంటలకు నిర్ణయం వెలువరించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టులో ఉన్న దృష్ట్యా తీర్పు వాయిదా వేసినట్టు సమాచారం. శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్‌ అయితే తీర్పు వాయిదా వేస్తామని, క్వాష్‌ పిటిషన్‌ లిస్ట్‌ కాకపోతే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. అమరావతి రింగ్‌రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై శుక్రవారం విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. మరోసారి బిగ్‌ బిలియన్ డేస్‌ సేల్‌.. వాటిపై భారీ డిస్కౌంట్!

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) మరోసారి పండుగ ఆఫర్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలో బిగ్‌ బిలియన్‌ డేస్‌ (Big Billion Days) సేల్‌ను నిర్వహించనుంది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో సేల్‌ ప్రకటనను ఉంచింది. అయితే, ఈ సేల్‌ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. వచ్చే నెలలో దసరా పండుగ ఉన్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ను నిర్వహించాలని చూస్తోంది. అక్టోబరు మొదటి వారంలో ఈ సేల్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌ విజ్ఞప్తులు బుట్టదాఖలు.. ‘మోస్ట్‌ వాంటెడ్‌’లకు స్థావరంగా కెనడా!

భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వేర్పాటువాదాన్ని (Khalistan separatist) ఉసిగొల్పుతోన్న కొన్ని సంస్థలు.. విదేశీ గడ్డను వేదికగా చేసుకొని వ్యూహాలు అమలు చేస్తున్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఉగ్రసంస్థలకు మద్దతిస్తోన్న కొన్ని వేర్పాటువాద సంస్థలు కెనడాను (Canada) స్థావరంగా చేసుకున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. అటువంటి వాటిని బహిష్కరించాలని చేసిన విన్నపాలను కెనడా పక్కనపెడుతున్నట్లు తెలిపాయి. తాజాగా ఇదే విషయాన్ని స్పష్టం చేసిన భారత విదేశాంగశాఖ.. ఉగ్రవాదులకు కెనడా స్థావరంగా మారిందని తీవ్ర స్వరంతో వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. జనవరిలో పాకిస్థాన్‌ ఎన్నికలు: ఈసీ ప్రకటన

 పాకిస్థాన్‌(Pakistan)లో సాధారణ ఎన్నికల నిర్వహణపై ఆ దేశ ఎన్నికల సంఘం(PEC) క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో ఎన్నికలు(General Elections) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. తమ దేశంలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన పనులను సమీక్షించామని.. డీ-లిమిటేషన్‌ చేసిన నియోజకవర్గాల తొలి జాబితాను సెప్టెంబర్‌ 27న ప్రచురించనున్నట్లు పీఈసీ తెలిపింది. అభ్యంతరాలు, సలహాలను స్వీకరించిన అనంతరం నవంబర్‌ 30న తుది జాబితాను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.  భారత మీడియా ప్రశ్నలకు.. నోరు విప్పని ట్రూడో!

ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య వెనక భారత్‌ హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. అయితే, అందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం ఇప్పటివరకు ఆయన బయటపెట్టలేదు. ఈ క్రమంలో నిజ్జర్‌ హత్యలో భారత్‌ పాత్ర, ఆ ఆరోపణలను భారత్‌ తోసిపుచ్చడం వంటి విషయాలపై ట్రూడోను భారత మీడియా పలుసార్లు ప్రశ్నించినప్పటికీ.. ఆయన మాత్రం నోరు విప్పకుండానే వెళ్లిపోయారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ‘ఫాక్స్‌’ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్‌ మర్దోక్‌

 ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించి.. మీడియా మొఘల్‌గా పేరుగాంచిన రూపర్ట్‌ మర్దోక్‌ (Rupert Murdoch) ఇక తన బాధ్యతలకు ముగింపు పలకనున్నారు. ఏడు దశాబ్దాలపాటు మీడియా రంగంలో కొనసాగిన ఆయన.. ఫాక్స్‌ కార్పొరేషన్‌ అండ్‌ న్యూస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఆ బాధ్యతలను ఆయన కుమారుడు లాక్లాన్‌ మర్దోక్‌ చేపట్టనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని