Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Mar 2023 21:13 IST

 1. క్షమాపణలు చెబుతారా?.. రూ.100 కోట్లు చెల్లిస్తారా?: మంత్రి కేటీఆర్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. టీఎస్‌ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఇప్పటి వరకు చేసిన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేయనున్నట్టు నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌చేయండి

2. ‘గృహలక్ష్మి’ విధివిధానాలు ఖరారు చేయండి: కేసీఆర్‌

రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని (Santhi kumari) ఆదేశించారు. ప్రధానంగా వర్షాల వల్ల జరిగిన పంటనష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం తదితర అంశాలపై సీఎం సమీక్ష చేశారు. ఎకరాకు రూ.10వేల చొప్పున పంట నష్ట పరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. దానిని తక్షణమే అమలు చేయాలని సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌చేయండి

3. రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు

రాజధాని అమరావతి(Amaravati)కి సంబంధించిన కేసుల అంశంలో ఏపీ ప్రభుత్వానికి (AP Govt) సుప్రీంకోర్టు(Supreme Court)లో మరోసారి చుక్కెదురైంది. కేసు విచారణ త్వరగా చేపట్టాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. జులై 11న తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు మరోసారి కోరగా.. స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌చేయండి

4. లోయలో పడిన బస్సు.. 62మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

కేరళ(Kerala)లోని పతనంథిట్ట జిల్లాలో యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు లోయలో పడిన ఘటనలో సుమారు 62మందికి  పైగా భక్తులు గాయపడ్డారు. వీరంతా తమిళనాడులోని మయిలాదుతురై జిల్లాకు చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులతో వస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలోకి జారిపడింది. మధ్యాహ్నం 1.30 గంట సమయంలో నిలక్కల్ సమీపంలోని ఎలావుంకల్‌ వద్ద ఈ ఘటన జరగ్గా.. ప్రమాదం సమయంలో బస్సులో తొమ్మిది మంది చిన్నారులతో పాటు 64 మంది ఉన్నట్టు సమాచారం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌చేయండి

5. మెట్రో విస్తరణపై కేంద్రానికి ఎందుకీ వివక్ష?: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాలని కోరితే.. ప్రయాణికుల రద్దీలేదు, సాధ్యం కాదంటూ కేంద్రం తప్పుడు నివేదికలు ఇస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆక్షేపించారు. హైదరాబాద్‌ విస్తీర్ణంతో ఏ మాత్రం సరిపోని నగరాలకు నిధులిస్తూ హైదరాబాద్‌కి ఇవ్వలేమనడం వివక్షకాదా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు చూసిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమేనని సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో 50 చెరువుల పునరుజ్జీవనం, సుందరీకరణకు మంత్రి కేటీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌చేయండి

6. ఎయిరిండియా , ఎయిర్‌ ఏషియా టికెట్లు ఇకపై ఒకే వెబ్‌సైట్‌లో

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express), ఎయిర్‌ ఏషియా (Air Aisa) విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై ఒకే వెబ్‌సైట్‌ నుంచి టికెట్‌ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సోమవారం నుంచి ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది అక్టోబరులో ఎయిర్‌ ఏషియాలో వాటాలను ఎయిరిండియా కొనుగోలు చేసింది. ఈ ఏడాది మొదట్లో రెండు కంపెనీల బాధ్యతలను ఒకే సీఈవో పరిధిలోకి తీసుకొచ్చింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌చేయండి

7. మ్యూచువల్‌ ఫండ్‌ నామినేషన్‌ డెడ్‌లైన్‌ పొడిగింపు

మ్యూచువల్‌ ఫండ్స్‌లో (Mutual Funds) మదుపు చేసే వారికి సెబీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ మదుపరులకు నామినీ వివరాల దాఖలుకు ఇచ్చిన గడువును పొడిగించింది. మార్చి 31తో గడువు ముగియాల్సి ఉండగా.. ఈ గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.  మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారు తప్పనిసరిగా నామినీని ఎంచుకోవాలని సెబీ నిబంధనను తెచ్చింది. లేదంటే నామినీ వద్దంటూ డిక్లరేషన్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీని ఎంపిక చేసుకోక పోతే ఆ ఖాతాలు స్తంభించిపోతాయని తెలిపింది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌చేయండి

8. ‘విద్వేష ప్రసంగాలపై.. ఏం చర్యలు తీసుకున్నారు?’

విద్వేష ప్రసంగాల (Hate Speech)పై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మత సామరస్యాన్ని (Communal Harmony) కాపాడుకునేందుకు విద్వేషపూరిత ప్రసంగాలను కట్టడి చేయడం అవసరమని పేర్కొంది. విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. విద్వేష ప్రసంగాలకు సంబంధించి 18 కేసులు నమోదు చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌చేయండి

9. మరి అదానీతో వాద్రా ఎందుకున్నారు..? రాహుల్‌కు స్మృతి ఇరానీ కౌంటర్‌

అదానీ(Adani Group) వ్యవహారంలో కేంద్రాన్ని విమర్శిస్తోన్న కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఎదుర్కొనేందుకు భాజపా(BJP) ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. తాజాగా 2009నాటి చిత్రాన్ని ఉద్దేశించి రాహుల్‌పై విమర్శలు గుప్పించింది. ఆ చిత్రంలో  అదానీ-రాబర్ట్ వాద్రా పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకొంటున్నట్లు ఉంది. ‘రాహుల్ గాంధీకి అదానీ విషయంలో  ఇబ్బంది ఉంటే.. మరి ఆయనతో రాబర్ట్ వాద్రా ఎందుకు ఉన్నారు..? ’ అంటూ ప్రతిదాడి చేసింది. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) ఈ మేరకు ప్రశ్నించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌చేయండి

10. మరో నియామక పరీక్ష వాయిదా

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కుదిపేస్తోన్న వేళ ఇప్పటికే పలు ఉద్యోగ నియామక పరీక్షలను రద్దు/వాయిదా వేసిన టీఎస్‌పీఎస్సీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 4న జరగాల్సిన  ఉద్యాన (హార్టికల్చర్‌) శాఖలో పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్షను రీషెడ్యూల్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఈ పరీక్షను తిరిగి జూన్‌ 17న నిర్వహించాలని నిర్ణయించింది.  తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పరీక్షను యథావిధిగా నిర్వహించాలా లేదంటే కొంత వ్యవధితో రీషెడ్యూలు చేయాలా అనే అంశంపై సమాలోచనలు జరిపిన అధికారులు తాజాగా ఆ పరీక్షను వాయిదా వేశారు.  తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఉద్యాన అధికారుల పోస్టులకు ఏప్రిల్‌ 4న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు పేపర్లకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌చేయండి

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని