Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Jun 2024 09:07 IST

1. భోగాపురం ఇక ‘భాగ్యరేఖ’.. రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక దృష్టి

భోగాపురం విమానాశ్రయం పనులు ఇక విమానం కన్నా వేగంగా పరుగులు తీయనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత విమానాశ్రయానికి అవసరమైన 2700 ఎకరాల సేకరణకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రగతికి మణిహారంగా ఉండేలా ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. 2019 ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేశారు. పూర్తి కథనం

2. కాపాడాల్సిన వారే.. కట్టుతప్పుతున్నారు

రక్షణ కల్పించాల్సిన కొందరు రక్షకభటులు అక్రమాలకు చిరునామాగా మారుతున్నారు. ఫిర్యాదు అందగానే సమాచారం బయటకు లీక్‌ చేసి నిందితులు తప్పించుకునేందుకు సహకరిస్తున్నారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మత్తుముఠాలకూ ముందస్తు లీకులిచ్చి పోలీసుశాఖకే మాయని మచ్చగా మారుతున్నారు. పూర్తి కథనం

3. నరకడమే తప్ప.. నాటింది లేదు

2019లో వైకాపా అధికారంలోకి వచ్చినా కరోనా నేపథ్యంలో సంవత్సరంపాటు ఎలాంటి కార్యక్రమాలు జరగలేదు. 2021 ఆగస్టులో అప్పటి సీఎం చేతుల మీదుగా జగనన్న పచ్చతోరణం-వనమహోత్సవం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి జిల్లాలో లక్ష మొక్కలు నాటాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటి, వాటిని వృక్షాలుగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖను ఆదేశించడం మినహా అడుగులు పడలేదు. పూర్తి కథనం

4. ఫోన్‌ పోయిందా.. ఖాతా ఖాళీనే

‘నగరానికి చెందిన చైతన్య ఫోన్‌ పోగొట్టుకున్నాడు. పాత ఫోన్‌ కదా అని పట్టించుకోలేదు. మరుసటిరోజు కొత్త ఫోన్‌ కొని పాత నంబరుతోనే సిమ్‌కార్డు వేశాడు. డిజిటల్‌ చెల్లింపుల యాప్‌లు యాక్టివేట్‌ చేసి బ్యాంకు ఖాతా తనిఖీ చేశాడు.పూర్తి కథనం

5. కల్కి సినిమాలో పెరుమాళ్లపాడు ఆలయం

కల్కి చిత్రంలో చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. 2020లో స్థానిక యువత.. ఇసుకలో కూరుకుపోయిన ఆలయాన్ని వెలికితీశారు. అనంతరం దీన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం, దేవదాయ, పురావస్తు శాఖలను స్థానికులు కోరారు.పూర్తి కథనం

6. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరుగురు నిందితులు.. 69 మంది సాక్షులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి న్యాయస్థానంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సోమవారం ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఛార్జిషీట్‌లో.. ఆరుగురిని నిందితులుగా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, ఆరో నిందితుడు అరువుల శ్రవణ్‌రావులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.పూర్తి కథనం

7. భూబకాసురుల నుంచి కాపాడండి

పేదల భూములపై కన్నెసి కాజేసేందుకు తెగబడిన వైకాపా భూబకాసురుల బారి నుంచి తమను రక్షించాలని బాధితులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. అక్రమార్కుల కబంధ హస్తాల నుంచి తమ భూమి ఇప్పించాలని కోరుతూ రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టబోతున్న ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. పూర్తి కథనం

8. ఎన్నికల ముందే రూ.998 కోట్ల ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు

సర్పంచులను జగన్‌ ప్రభుత్వం మోసం చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బీఆర్వో) ఇచ్చి మరీ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించింది. అప్పట్లో బీఆర్వో విడుదల కావడంతో నిధుల కోసం సర్పంచులు ఎదురు చూశారు. అయినా రాకపోవడంతో రెండు రోజుల క్రితం ఆరా తీస్తే ప్రభుత్వ అవసరాలకు వాటిని మళ్లించినట్లు తెలిసింది.పూర్తి కథనం

9. అది క్యాబినెట్‌ కాదు.. పరివార్‌ మండల్‌

కేంద్ర మంత్రిమండలి పూర్తిగా ‘పరివార్‌ మండల్‌’ (కుటుంబ మండలి)గా కనిపిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. మోదీ 3.0 సర్కారు క్యాబినెట్‌లో చాలామంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినవారేనని చెప్పారు. ‘తరతరాలుగా పోరాటాలు, సేవలు, త్యాగాలను చేసినవారిని వంశపారంపర్య రాజకీయాలు చేస్తున్నవారిగా విమర్శించినవారే ఇప్పుడు అధికారాన్ని తమ సర్కారీ పరివార్‌కు పంచుతున్నారు.పూర్తి కథనం

10. వీకెండ్స్‌ కోసం ఎదురుచూడటంమానుకోండి : కంగనా రనౌత్‌

‘‘మనది ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు. అధికంగా పనిచేసే సంస్కృతిని మనం సాధారణీకరించాలి. వారాంతాల కోసం ఎదురుచూడటం, ‘మండే మీమ్స్‌’ (సోమవారం నుంచి మొదలయ్యే పని గురించి పెట్టే పోస్టులు) మానుకోండి. అదంతా పాశ్చాత్య సంస్కృతి. సోమరితనం, విసుగు వంటివి మనం దరి చేర్చకూడదు’’ అని ప్రముఖ సినీనటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ అన్నారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని