Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Jun 2024 09:06 IST

1. తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్‌ ఉన్నారు. పూర్తి కథనం

2. ఫలితాలు అసంతృప్తిని మిగిల్చాయి

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నామని, వాటిపై అంతర్గతంగా సమీక్షించుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. సీట్ల విషయంలో అతి స్వల్పంగా మెరుగుపడినా తీవ్రంగా సమీక్షించుకోవాల్సిన అవసరముందని భావిస్తున్నామని చెప్పారు. లెఫ్ట్‌ తరఫున ఎన్నో ఆందోళనలను నిర్వహించినా ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించకపోవడం నిరాశకు గురి చేసిందని వివరించారు.పూర్తి కథనం

3. ధైర్యం వచ్చింది.. ఇక్కడే ఉంటా..

వైకాపా నేతలు, పోలీసుల వేధింపులు కారణంగా కూతురు సాయితో కలిసి వారణాసిలో తలదాచుకుంటున్నానని.. చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధైర్యం వచ్చిందని, కాకినాడలోనే ఉంటానని రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. వైకాపా ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ వారికి కూటమి ప్రభుత్వం నుంచి అందిన ఆహ్వానం మేరకు ఆమె బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. పూర్తి కథనం

4. అవినీతి పాలనను అంతమొందించారు: పురందేశ్వరి

గత ప్రభుత్వ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సంక్షేమాన్ని విస్మరించిన వారికి ప్రజలు ఓటుతో సమాధానం ఇచ్చారన్నారు.పూర్తి కథనం

5. కోటి ఆశలతో.. కొలువుదీరిన వేళ

జగనాసుర పాలనతో రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడింది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా నవ్యాంధ్ర పరుగులిడేందుకు రంగం సిద్ధమైంది. చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు.. అభివృద్ధిపై ఆశలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2019కి ముందు తెదేపా హయాంలో చంద్రబాబు చేపట్టి.. నిలిచిన ప్రాజెక్టుల్లో నేడు కదలిక రానుంది.పూర్తి కథనం

6. భాగవత్‌ జీ! మీ సంరక్షణలోనే లోపం

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ఇప్పుడు అసంబద్ధమైనదిగా మిగిలిందని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఆ సంస్థ గానీ, దాని అధిపతి మోహన్‌ భాగవత్‌ గానీ అవసరం లేదని పేర్కొంది. మణిపుర్‌ ఘటనలు, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై భాగవత్‌ వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్‌ఖేడా బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘భాగవత్‌ జీ! మీరు ఏ విత్తనం నాటారో ఆ ఫలాలే మీకు లభిస్తాయి.పూర్తి కథనం

7. అడుగడుగునా తెరలు.. ఊరూవాడా వేడుకలు

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో సాగింది. ప్రజలు, ఆయా పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులు వీక్షించేందుకు ఊరూవాడా ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. పలు చోట్ల థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లు, కల్యాణమండపాలు, ఆడిటోరియంలు కోలాహలంతో నిండిపోయాయి.పూర్తి కథనం

8. ఆ ప్రచారం నమ్మొద్దు.. సాధారణ బస్సు ఛార్జీలు పెంచలేదు: టీజీఎస్‌ ఆర్టీసీ

తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (TGS RTC) బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయని సంస్థ ప్రకటించింది. హైవేలపై టోల్‌ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.పూర్తి కథనం

9. మంత్రి పదవి కోసం మంత్రాంగం

సార్వత్రిక, శాసనసభ ఎన్నికలు ముగియడంతో రేవంత్‌ సర్కారు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ పరిస్థితిని ఆరా తీస్తోంది. తప్పకుండా విజయం సాధిస్తామనుకున్న ఎంపీ సీటు ఓడిపోవడానికి దారితీసిన కారణాలను అన్వేషిస్తోంది. పార్టీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది.పూర్తి కథనం

10.  టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక ‘కీ’ విడుదల

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక ‘కీ’ను టీజీపీఎస్సీ (TGPSC) విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. ‘కీ’పై ఈనెల 17 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ప్రాథమిక కీ, మాస్టర్‌ ప్రశ్నపత్రం అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో ఈనెల 13 నుంచి 17 వరకు అందుబాటులో ఉంటాయి.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు