Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 14 Jun 2024 09:13 IST

1. గత ప్రభుత్వంలోని బాధ్యులకూ పిలుపు!

కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌లో దాఖలైన అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక.. బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులకు, ఇతరులకు నోటీసులు జారీ చేయనున్నారు. కమిషన్‌ పరిశీలనలో గుర్తించే అంశాలను బట్టి అవసరమైతే వారిని విచారణకు పిలవనున్నట్లు తెలిసింది. జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ ప్రస్తుతం సాంకేతికాంశాలపై చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చింది. పూర్తి కథనం

2. గాలొచ్చినా.. వానొచ్చినా.. మెట్రో ఆగొద్దు

వానాకాలంలో మెట్రోరైలు కార్యకలాపాలకు అంతరాయాలు తలెత్తకుండా నిరంతరంగా సేవలు అందించడంపై ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌ కంపెనీ కియోలిస్, స్వతంత్ర ఇంజినీర్‌ ఏఈకామ్‌ సీనియర్‌ అధికారులతో మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి బేగంపేటలోని మెట్రోరైలు భవన్‌లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.  పూర్తి కథనం

3. ఈ బ్రాంచ్‌లకూ.. కొలువులున్నాయ్‌..

ఉమ్మడి జిల్లా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీకేటగిరీ సీట్లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. దీనికితోడు ఇటీవల ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ర్యాంకుల ఆధారంగా వివిధ కళాశాలల్లో ఏ సీటు వస్తుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తితో ఉన్నారు. ప్రస్తుతం ట్రెండ్‌ అంతా సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ మీదే నడుస్తోంది.పూర్తి కథనం

4. వేటకు వేళాయే!

ప్రాణాలే పెట్టుబడిగా.. కడలి      కెరటాలే కడుపు నింపే కాలచక్రాలుగా.. మర పడవలే నేస్తాలుగా.. నిత్యం పోరాటం చేసే మత్స్యకారులు బతుకు నావను నడపడానికి సమయం వచ్చింది. రెండు నెలలుగా దూరమైన చేపల వేటకు వేళైౖంది. కడలి కరుణతో.. మొండి ధైర్యాన్ని మూటకట్టుకుని ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.పూర్తి కథనం

5. అయ్యయ్యో... చేతిలో డబ్బులు పోయేనే...

ఎన్నికల ఫలితాలు పార్టీ నాయకులనే కాదు బెట్టింగ్‌ రాయుళ్ల జీవితాలను తారుమారు చేశాయి. ముఖ్యంగా వైకాపాను నమ్ముకున్న వాళ్లంతా నిండా మునిగారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో పంటలకు పెట్టుబడి ఎలా అని ఆలోచనలో పడ్డారు. మరోవైపు పందెం వేసిన వెంటనే రెండు పక్షాలకు చెందిన డబ్బులను మధ్యవర్తుల చేతిలో పెడితే వారు కూడా మోసానికి పాల్పడటంతో ఇటు పందెం గెలిచిన వాళ్లు లబోదిబోమంటున్నారు.పూర్తి కథనం

6. రూ. 100 కోట్లతో ఆడుకున్నారు!.. మాజీమంత్రి రోజాపై సీఐడీకి ఫిర్యాదు

‘ఆడుదాం ఆంధ్రా’, ‘సీఎం కప్‌’ల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్‌ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై సీఐడీకి ఫిర్యాదు చేశామని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ తెలిపారు.  గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.పూర్తి కథనం

7. బంతి పడకుండానే.. రూ.కోట్లు ఔట్‌

క్రికెట్‌ ఆటలో బంతి పడితేనే బ్యాట్స్‌మెట్‌ ఔట్‌ అవుతాడు.. కానీ జీహెచ్‌ఎంసీలో బంతి పడకుండానే రూ.కోట్లు ఔట్‌ అయిపోతున్నాయి. ఏటా ఇదే వ్యవహారం సాగుతున్నా చూడీచూడనట్టు వదిలేస్తున్నారు. వేసవిలో నిర్వహించే క్రీడా శిబిరాలకు కొనుగోలు చేసే ఆట వస్తువులను మాయం చేస్తున్నారు. అదేదో ఒక్కసారి, రెండుసార్లు అనుకుంటే పొరపాటే.. చాలా ఏళ్లుగా ఈ దోపిడీ కొనసాగుతోంది.పూర్తి కథనం

8. నగదు తరలింపు వెనుక ఓ ఐపీఎస్‌! 

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. తొలుత స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనపై నమోదైన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక నియమావళి అమల్లో ఉన్న సమయంలోనే నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలింపులో పోలీసు అధికారుల పాత్రపై దర్యాప్తు బృందానికి తాజాగా ఆధారాలు లభ్యమయ్యాయి. పూర్తి కథనం

9. దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వైకాపా తీరు: ఎమ్మెల్యే రఘురామ

‘దొంగే.. దొంగా దొంగా అన్నట్లు ఉంది వైకాపా నేతల తీరు. ఎవరూ ఎవరినీ ఏమీ అనకముందే వారిని కొట్టారంటూ దిల్లీలో విజయసాయిరెడ్డి పెడబొబ్బలు పెడుతున్నారు. గతంలో వారు చేసినట్లు ఎన్డీయే పాలనలోనూ దాడులకు పాల్పడతారన్న భయంతో ఇలాంటి ప్రకటనలు చేస్తున్నార’ని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.పూర్తి కథనం

10. శిల్పా శెట్టిపై మోసం కేసు!

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రాలు బోగస్‌ బంగారం పథకంతో తనను మోసగించారని ఓ వ్యాపారి చేసిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలని పోలీసులను ముంబయి అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి ఎన్‌.పి. మెహతా ఆదేశించారు. కుంద్రా దంపతులు, వారు స్థాపించిన సత్‌యుగ్‌ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, దాని ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి మోసానికి పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జి ధ్రువీకరించారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు