Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 15 Jun 2024 09:14 IST

1. వైకాపాను నమ్మి మోసపోయాం..!

వైకాపా ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న మమ్మల్ని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మోసం చేశారని, వారి ఒత్తిడితో రాజీనామా చేయాల్సి వచ్చిందని పలువురు వాలంటీర్లు కన్నీటి పర్యంతమయ్యారు. గత ఏప్రిల్‌లో రాజీనామా చేసిన పలువురు శుక్రవారం నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఆయన నివాసంలో కలిసి తమ దుస్థితిని వివరించారు. పూర్తి కథనం

2. డ్రోన్‌తో ట్రాఫిక్‌ పర్యవేక్షించి.. నియంత్రించి

ఫైనాన్షియల్‌ జిల్లా, ఐటీ క్షేత్రాలతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడంలోనూ ముందుంటోంది. కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ జాంపై డ్రోన్‌ నేత్రంతో దృశ్యాలను వీక్షించి సిబ్బంది వెంటనే చేరుకుని నియంత్రించడమే దీని ఉద్దేశం. సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్‌సీఎస్‌సీ) భాగస్వామ్యంతో సైబరాబాద్‌ పోలీసులు ‘థర్డ్‌ ఐ ట్రాఫిక్‌ మానిటరింగ్‌ డ్రోన్‌ కేపబిలిటీ’ పేరుతో ట్రాఫిక్‌ డ్రోన్‌ నిఘా నేత్రాన్ని శుక్రవారం ప్రవేశపెట్టారు. పూర్తి కథనం

3. భూహక్కు.. సమస్యల చిక్కు

భూసర్వే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం ముసుగులో రైతుల రికార్డులు తారుమారయ్యాయి. రీసర్వే సమయంలో అధికారులు చేపట్టిన తప్పిదాలు వారి మెడకు ఉరితాళ్లుగా మారాయి. ఉన్న విస్తీర్ణంలో తేడాలు, భూమి స్వభావంలో మార్పులు, చనిపోయిన వారి పేర్లతో రికార్డులు వెరసి రైతులు మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెట్టించే వరకు వ్యవహారం నడిచింది.పూర్తి కథనం

4. పేద పిల్లల ఫీజుల్ని మళ్లించేశారు

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి ఐదేళ్లు వైకాపాతో అంటకాగి.. పేదల పిల్లల ఫీజులను భారీగా దారి మళ్లించారు.  ఓట్ల లెక్కింపు రోజున వైకాపా ఓడిపోతుందని తెలుసుకుని వెంటనే కీలకమైన దస్త్రాలను మాయం చేశారు. కొన్నింటిని మెషీన్‌లో వేసి, ముక్కలుగా కట్‌ చేశారు. ఆ వెంటనే ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.పూర్తి కథనం

5. మహిళలు నిల్చోలేక.. పురుషులు కూర్చోలేక..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులన్నీ కళకళలాడుతున్నాయి. మహిళా ప్రయాణికులతో నిండుగా దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో సీట్ల కోసం వాగ్వాదాలు.. అప్పుడప్పుడు కొట్లాటలూ జరుగుతున్నాయి. డబ్బులు ఇచ్చి టికెట్ కొనుగోలు చేస్తున్న పురుషులు తమ గమ్యస్థానానికి చేరుకునే వరకు నిలబడి ఉండాల్సి వస్తోంది. రద్దీని భరించలేక ఆర్టీసీ డ్రైవర్లు కొన్ని స్టేజీల వద్ద బస్సులను ఆపడం లేదు.పూర్తి కథనం

6. క్యాబినెట్‌లో యువతకు ప్రాధాన్యాన్ని స్వాగతిస్తున్నాం

‘‘రాష్ట్ర మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గం కూర్పులో 50% కంటే ఎక్కువమంది యువతకు మంత్రి పదవులు ఇచ్చారు’’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. పూర్తి కథనం

7. పెరిగిన ఆర్‌ఆర్‌ఆర్‌ పొడవు

హైదరాబాద్‌ ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పొడవు పెరిగింది. ఉత్తర భాగంలో 2.95 కి.మీ. మేర పెంచాలని తాజాగా నిర్ణయించారు. రెండు భాగాలుగా ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఉత్తర భాగానికి ఇప్పటికే జాతీయ రహదారి హోదా లభించింది. దక్షిణ భాగం ఎలైన్‌మెంట్‌ ఖరారు అయినా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.పూర్తి కథనం

8. సంపన్న రాష్ట్రంగా చేద్దాం

‘మంత్రివర్గంలో మీతోపాటు సహచర మంత్రులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్డీయే నాయకత్వంలో సమాజంలోని అన్ని వర్గాల పురోగతి, శ్రేయస్సు, సమ్మిళిత అభివృద్ధిని సాధించడానికి సమష్టిగా కృషి చేద్దాం. శక్తిమంతమైన, సంపన్న ఆంధ్రప్రదేశ్‌ను సాకారం చేయడంలో మీతో కలిసి వెళ్లడానికి ఎదురుచూస్తున్నా..’ అని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తెలిపారు. శుక్రవారం మంత్రివర్గ జాబితాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేస్తూ ఉపముఖ్యమంత్రి పవన్‌కు అభినందనలు తెలిపారు. పూర్తి కథనం

9. శివునికి ఎవరి రక్షణా అవసరం లేదు

యమునా నది వరదకు గురయ్యే తీర భూమిలో గల ప్రాచీన శివాలయాన్ని కూల్చివేయాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు శుక్రవారం సమర్థించింది. ఆలయ కూల్చివేతపై పిటిషన్‌ దారులలో శివుడిని చేర్చడానికి మే 29న హైకోర్టు నిరాకరించింది. మహా శివునికి ఎవరి రక్షణా అవసరం లేదంది. యమునా నదీ తీరంలో, నదీ గర్భంలో అక్రమ ఆక్రమణలను తొలగిస్తే ఆయన ఎక్కువ సంతోషిస్తారని పేర్కొంది.పూర్తి కథనం

10. రిటైల్‌ మదుపర్లూ.. డబ్బులు పోతాయ్‌ జాగ్రత్త

చిన్న మదుపర్లు డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) సీఈఓ, ఎండీ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ హెచ్చరించారు. అందుకు బదులు మ్యూచువల్‌ ఫండ్‌ల ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం మేలని సూచించారు. నష్టభయాన్ని తట్టుకునే, మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉండే కొద్ది మంది మదుపర్లు మాత్రమే ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌ అండ్‌ ఓ) ట్రేడింగ్‌కు పరిమితం అయితే మంచిదని శుక్రవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని