Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Jun 2024 09:13 IST

1. పోలీసులు కాదు.. వైకాపా కార్యకర్తలే

వైకాపా అయిదేళ్ల అరాచకాలను కొందరు ఖాకీలు తమ విధ్వంస కాండతో పరాకాష్ఠకు తీసుకెళ్లారు. పార్టీ జెండా పట్టుకోని కార్యకర్తల్లా..కండువా కప్పుకోని వీరాభిమానుల్లా విధేయతను ప్రదర్శించారు. వృత్తి గౌరవాన్ని బుగ్గిపాలు చేశారు. ప్రతిపక్షాలు నోరు మెదిపితే బెదిరింపులతో గొంతు నొక్కారు. ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో బెంబేలెత్తించారు. పూర్తి కథనం

2. నాడు అరబిందో, అవంతిక కంపెనీలకు గనులమ్మితే ఎందుకు మాట్లాడలేదు కేటీఆర్‌?

గతంలో కేంద్రం నిర్వహించిన వేలం పాటల్లో బొగ్గు గనులను అరబిందో, అవంతిక కంపెనీలకు అమ్మేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదని మాజీ మంత్రి కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి శుక్రవారం ఎక్స్‌లో సీఎం పోస్టు పెట్టారు. మొదటి, రెండో విడత బొగ్గు గనుల వేలంలో ఈ రెండు కంపెనీలకు తెలంగాణలోని రెండు గనులను కేంద్రం కేటాయించినప్పుడు కేసీఆర్‌ సీఎంగా ఉన్నారని గుర్తుచేశారు.పూర్తి కథనం

3. మురళీకృష్ణ మామూలోడు కాదు.. 

జలవనరుల శాఖ బందరు సబ్‌ డివిజను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా నేటికీ కొనసాగుతున్న మురళీకృష్ణ ఏకకాలంలో మూడు పోస్టులను నిర్వహించారు. గత ఐదేళ్లలో ఆయన చేయని అక్రమం లేదు. ఎన్ని వెలుగు చూసినా.. విచారణ లేదు. చర్యల్లేవు. గత ప్రభుత్వ హయాంలో జిల్లా ఎస్‌ఈ వరకు ఆయన ఎంత చెబితే అంత. బినామీ పేర్లతో కాంట్రాక్టులు సైతం చేశారు. పనులు చేయకుండానే బిల్లులు పెట్టి తనవారికి అడ్డంగా దోచిపెట్టారు.పూర్తి కథనం

4. గ్రేటర్‌లో గులాబీదళంపై కాంగ్రెస్‌ కన్ను

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలాన్ని పెంచుకునేందుకు దూకుడు పెంచింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు నగరానికి చెందిన భారాస ఎమ్మెల్యేల్లో సింహభాగం కాంగ్రెస్‌లో చేర్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రణాళికను అమలుచేస్తోంది. కాంగ్రెస్‌ నాయకులు కొందరు  గ్రేటర్‌ పరిధిలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నారు.పూర్తి కథనం

5. గనుల దందాలో విశ్వఘనులు..!

గ్రానైట్‌ క్వారీల్లో జరిగిన దందా బండలకన్నా పెద్దగా ఉంది.. అధికార పార్టీ అనే ఒకే ఒక ట్యాగ్‌లైన్‌తో గ్రానైట్‌ రంగంలో చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించేశారు. అంతకుముందు గ్రానైట్‌ క్వారీలో చీకటి వ్యాపారానికి అలవాటుపడ్డ నేత కనుసన్నల్లో సిక్కోలు మొత్తంగా అక్రమ వ్యాపారం వేళ్లూనింది. దీనికితోడు ప్రభుత్వ విధానం కలసిరావడంతో మూడుపువ్వులు ఆరుకాయలుగా వ్యాపారం సాగిపోయింది.పూర్తి కథనం

6. మీరెవరని ఇంటి యజమానినే అడిగిన దొంగ

నేరేడుచర్ల పట్టణంలో శివాలయం రోడ్డు పక్కన తాళం వేసి ఉన్న ఇంట్లో శుక్రవారం పట్టపగలు ముగ్గురు దొంగలు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం.. దొంగలు ఇంట్లో ఉన్న సమయంలో యజమాని భూపాల్‌రెడ్డి, ఆయన భార్య నాగలక్ష్మి ఇంటికి వచ్చారు. వీరిని చూసిన ఇద్దరు దొంగలు ద్విచక్ర వాహనంపై పారిపోయారు.పూర్తి కథనం

7. నిర్మాణంలో ఉన్న వైకాపా కార్యాలయం కూల్చివేత

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైకాపా కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. నీటి పారుదల శాఖ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యార్డుగా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైకాపా కార్యాలయం కోసం అప్పటి జగన్ సర్కార్‌ కట్టబెట్టింది.పూర్తి కథనం

8. చంద్రబాబును చూసి ఇతర సీఎంలు నేర్చుకోవాలి: మోత్కుపల్లి

ముఖ్యమంత్రులు ఎవరైనా చంద్రబాబును చూసి నేర్చుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫొటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఫొటో ఉంచాలని ఆదేశించి తన గొప్ప మనసును చాటుకున్నారని అన్నారు.పూర్తి కథనం

9. ఊరంతా వల్లకాడు

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం చికిత్స పొందుతూ 52 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పూర్తి కథనం

10. బుగాటి.. రూ.34 కోట్ల హైబ్రిడ్‌ హైపర్‌ కార్‌

ఫ్రాన్స్‌కు చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ బుగాటీ ఆటోమొబైల్స్, తోబియాన్‌ హైపర్‌-జీటీ హైబ్రిడ్‌ కారును ఆవిష్కరించింది. గంటకు 445 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో, ప్రపంచంలోనే రోడ్లపై అత్యంత వేగంగా ప్రయాణించే వాహనంగా ఇది గుర్తింపు పొందనుంది. 40 మిలియన్‌ డాలర్ల (సుంకాలు కాకుండా సుమారు రూ.34 కోట్ల) ధర పలికే ఈ అత్యాధునిక కారుకు 8.3 లీటర్‌ వీ16 ఇంజిన్‌ అమర్చారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని