Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...  

Published : 18 Jun 2024 20:59 IST

1.నిజం గెలవాలి పర్యటనలో ప్రజల బాధలు చూశా.. ఇప్పుడు సంతోషం చూస్తున్నా: భువనేశ్వరి

నిజం గెలవాలి పర్యటనలో తాను ప్రజల బాధలు చూశానని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు తామే గెలిచామన్న సంతోషాన్ని చూశానని  నారా భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి అన్నీ మంచిరోజులే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కౌరవ సభ స్థానంలో కొలువుదీరనున్న గౌరవ సభ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చుతుందని స్పష్టం చేశారు. పూర్తి కథనం

2. మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు.. సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు

డిప్యూటీ సీఎం, మంత్రులకు ఛాంబర్‌లను కేటాయిస్తూ సాధారణ పరిపాలనశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్‌-2లో ఏడుగురు, బ్లాక్‌-3లో ఐదుగురు,  బ్లాక్‌ -4లో ఎనిమిది మంది, బ్లాక్‌-5లో ఐదుగురు మంత్రులకు ఛాంబర్లను కేటాయించింది.  పూర్తి కథనం

3. ఠారెత్తిస్తున్న టమాటా ధర.. రైతు బజార్ల ద్వారా విక్రయించాలని మార్కెటింగ్‌శాఖ నిర్ణయం

రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలపై మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రిటైల్‌ మార్కెట్‌లో కిలో టమాటా ధర రూ.55 నుంచి రూ.65 పలుకుతుండగా.. రైతు బజారులో కిలో రూ.54 ఉందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో టమాటా సాగు లేకపోవడం, చిత్తూరు జిల్లాలో మాత్రమే ఉత్పత్తి కారణంగా డిమాండ్‌ పెరిగినట్టు వెల్లడించారు.  పూర్తి కథనం

4. అభిమానితో పాక్‌ క్రికెటర్ మాటల యుద్ధం.. వీడియో వైరల్‌

టీ20 ప్రపంచకప్‌ 2024లో పాకిస్థాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. పేలవమైన ఆటతీరుతో లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లపై పాక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో కొంతమంది పాకిస్థాన్‌ ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లకుండా యూఎస్‌లోనే ఉన్నారు.  పూర్తి కథనం

5. నడిరోడ్డుపై దారుణం.. యువతిని ఇనుపరాడ్డుతో కొట్టి..ప్రాణాలు తీసి..

మహారాష్ట్ర రాజధాని ముంబయి (Mumbai)లో దారుణం చోటు చేసుకొంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇనుప రాడ్‌తో దారుణంగా హత్య చేశాడు. అక్కడున్న వారు ఈ ఘోరాన్ని చూస్తూ నిలబడ్డారే కానీ.. ఏ ఒక్కరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. పూర్తి కథనం

6. పని, కుటుంబ ఒత్తిళ్లు.. కొత్త నైపుణ్యాలకు దూరం!

 ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొలువు సాధించాలన్నా.. కొనసాగుతున్న వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ముఖ్యం. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్త నైపుణ్యాల్లో పట్టు సాధిస్తేనే ఉన్నత శిఖరాలను అధిరోగించగలం. అయితే, కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఉద్యోగులు దృష్టి సారించలేకపోతున్నారట. ఈ విషయం తాజా నివేదికలో వెల్లడైంది. పూర్తి కథనం

7.  మ్యాగీ వినియోగం మన దగ్గరే ఎక్కువ.. నెస్లేకు అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌

మ్యాగీ నూడుల్స్‌ పేరిట ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ను విక్రయిస్తున్న నెస్లే సంస్థకు (Nestle) అతిపెద్ద మార్కెట్లలో భారత్‌ ఒకటి. నూడుల్స్‌, చిన్న పిల్లల ఆహార ఉత్పత్తులతో పాటు వివిధ రకాల ప్రొడక్ట్‌లను దేశీయంగా విక్రయిస్తోంది. అయితే, మ్యాగీ నూడుల్స్‌ విషయంలో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే మన దేశమే అతిపెద్ద మార్కెట్‌ అని ఆ కంపెనీ వెల్లడించింది.  పూర్తి కథనం

8. విమానంలో ప్రయాణికురాలి వింత ప్రవర్తన.. సిబ్బంది చేయి కొరికి..

విమానంలో కొందరి ప్రవర్తన తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. అత్యవసర ద్వారాన్ని తెరవడం, బాంబు ఉందంటూ కొందరు బెదిరింపులకు పాల్పడడం తరచూ వింటూనే ఉన్నాం. తాజాగా ఓ ప్రయాణికురాలు సిబ్బందిని తీవ్రంగా గాయపరిచింది. పూర్తి కథనం

9. ఇంగ్లిష్‌ మీడియంపై మోజు.. ఆత్మహత్యవంటిది - ఎన్‌సీఈఆర్‌టీ చీఫ్

అనేకచోట్ల సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేనప్పటికీ.. ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలల వైపు తల్లిదండ్రులు ఆకర్షితులు అవుతున్నారని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిణామం కోరి కష్టాలను తెచ్చుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. పూర్తి కథనం

10. ‘పీఎం-కిసాన్‌’ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు

రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం-కిసాన్‌ సమ్మాన్‌నిధి’ 17వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విడుదల చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మంగళవారం నిర్వహించిన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌’ కార్యక్రమంలో విడుదల చేశారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని