Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 19 Jun 2024 21:01 IST

1.నేనే ప్రతిపక్ష నేతగా ఉంటా: మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌

ఒడిశా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తానే వ్యవహరించనున్నట్లు మాజీ సీఎం, బిజు జనతాదళ్‌ (బిజద) అధినేత నవీన్‌ పట్నాయక్‌ వెల్లడించారు. బుధవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి కథనం

2.అమరావతి ఐకాస క్యాండిల్‌ ర్యాలీ.. రామోజీరావుకు ఘన నివాళి

రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు రాజధాని అమరావతి ఐకాస ఘనంగా నివాళులర్పించింది. ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరులో రైతులు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. రాజధానికి అమరావతి అని పేరు పెట్టింది రామోజీరావు అని, రైతుల ఉద్యమానికి ఆయన అండగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పూర్తి కథనం

3.డిసెంబరులోపే హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ పనులు: మంత్రి కోమటిరెడ్డి

డిసెంబరులోపే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ -65) విస్తరణ పనులు పూర్తయ్యేలా చూస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రహదారులపై సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి కథనం

4.హిందీలో వెంకటేష్‌ ‘సైంధవ్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

వెంకటేష్‌ (Venkatesh) కథానాయకుడిగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సైంధవ్‌’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, యాక్షన్‌ ప్రియులకు మాత్రం మంచి వినోదాన్ని పంచింది. తెలుగులో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. పూర్తి కథనం

5.టాప్‌లోనే స్కై.. ఆల్‌రౌండర్‌ కేటగిరిలో దూసుకొచ్చిన స్టోయినిస్‌

టీ20 ప్రపంచకప్‌లో గొప్పగా రాణిస్తున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లాడు. అఫ్గాన్‌ ఆటగాడు నబీని వెనక్కి నెట్టి ఆల్‌రౌండర్‌ కేటగిరిలో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నాడు. పూర్తి కథనం

6.మళ్లీ మస్కే నంబర్‌1.. ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి స్థానం

 ప్రపంచ కుబేరుల జాబితా(World's Richest People)లో టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) మళ్లీ తొలి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ్‌ (Bloomberg) బిలియనీర్‌ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం.. 208 బిలియన్‌ డాలర్ల నికర విలువతో బెజోస్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నారు. పూర్తి కథనం

7.ఆ విగ్రహాలను యథాతథ స్థానాల్లోకి తీసుకురండి: కాంగ్రెస్ డిమాండ్

పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉన్న మహనీయుల విగ్రహాలను వేరే చోటుకు తరలించడం వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. వాటిని యథాతథ స్థానాల్లోకి తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీనిపై లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌కు హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) లేఖ రాశారు.  పూర్తి కథనం

8.కశ్మీర్‌లో మోదీ యోగా.. 7వేల మంది పాల్గొనేలా ఏర్పాట్లు!

జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జమ్మూకశ్మీర్‌లో (Jammu and Kashmir) నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. పూర్తి కథనం

9.నీట్‌ వివాదం..జూన్ 21న దేశవ్యాప్త నిరసనకు కాంగ్రెస్‌ పిలుపు

నీట్‌(NEET UG) పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా విద్యార్థిసంఘాలు, విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 21న యోగా డే రోజున నీట్‌లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్(Congress) దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. పూర్తి కథనం

10.మృతదేహాన్ని మాయం చేసేందుకు రూ.30 లక్షలు ఇచ్చా: దర్శన్‌

ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌ (Darshan) అభిమాని హత్య కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకొంది. అభిమాని హత్య అనంతరం మృతదేహాన్ని ఎవరి కంట పడకుండా మాయం చేసేందుకు దర్శన్‌ మరో నిందితుడికి రూ. 30 లక్షలు ముట్టజెప్పినట్లు తేలింది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని