Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 10 Jul 2024 13:11 IST

1. ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి కలకలం.. మంత్రి లోకేశ్‌ ఆగ్రహం

అమరావతి: ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ట్రిపుల్‌ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఆయన్ను కలిశారు. పూర్తి కథనం

2. ‘రైతుభరోసా’ ఇచ్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నాం: భట్టి విక్రమార్క

ఖమ్మం: వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందజేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.పూర్తి కథనం

3. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులు : సుప్రీం కీలక తీర్పు

దిల్లీ: ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో బుధవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. 125 సీఆర్‌పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.పూర్తి కథనం

4. జగన్‌ హయాంలో నీటి పారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి: మంత్రి నిమ్మల

ఉండవల్లి: వ్యవసాయం, రైతులను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఆయన ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు, తాగునీటిని విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్‌ వద్ద కృష్ణమ్మకు పూజలు చేశారు.పూర్తి కథనం

5. అతడుగా ఆమె.. రికార్డుల్లో పేరు, లింగం మార్చుకున్న ఐఆర్‌ఎస్‌ అధికారి

దిల్లీ: దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ ఐఆర్‌ఎస్‌ అధికారిణి ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన లింగం, పేరును మార్పు చేయించుకున్నారు. పుట్టుకతో స్త్రీగా పరిగణించిన తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను అభ్యర్థించారు. పూర్తి కథనం

6. రాజకీయ ప్రయోజనాల కోసం భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారు?: కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు నిధుల సమీకరణకు ఓ ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో ఆయన పోస్టు చేశారు. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూములను.. ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని సర్కారు భావిస్తోందని ఆరోపించారు.పూర్తి కథనం

7. ఆమె బైడెన్‌కు బీమా పాలసీ లాంటిది: ట్రంప్‌ ఎద్దేవా

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ట్రంప్‌ (Donald Trump)విమర్శలు పదునెక్కుతున్నాయి. తాజాగా ఆయన అధ్యక్షుడు జోబైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ( Kamala Harris)ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెను జోబైడెన్‌కు బీమా పాలసీగా అభివర్ణించారు. పూర్తి కథనం

8. నేరగాళ్లకు ప్లాస్టిక్‌ సర్జరీలు.. ఫిలిప్పీన్స్‌ రహస్య ఆసుపత్రుల్లో కొత్త దందా..!

చట్టం నుంచి తప్పించుకోవడానికి నేరగాళ్లు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకోవడం మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ, ఫిలిప్పీన్స్‌ (Philippines)లో ఇది వాస్తవ రూపం దాల్చింది. వారి రూపురేఖలు మార్చేందుకు ఏకంగా రహస్య ఆస్పత్రులనే నిర్వహిస్తున్నారు.పూర్తి కథనం

9. కేటీఆర్‌ అలా స్పందించడం రాజకీయం కాదు.. లొంగుబాటు: బీవీ రాఘవులు

హైదరాబాద్‌: దేశమంతా అభివృద్ధి జరిగితే ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భాజపాకు సీట్లు ఎందుకు తగ్గాయో ప్రధాని మోదీ చెప్పాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. రష్యా పర్యటనలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మరోవైపు పార్లమెంట్‌లో ఇష్యూ టు ఇష్యూను బట్టి వ్యవహరిస్తామని కేటీఆర్‌ చెబుతున్నారని రాఘవులు గుర్తుచేశారు. పూర్తి కథనం

10. వీడ్కోలు నిర్ణయం.. వారి వ్యక్తిగతం: కుల్‌దీప్‌ యాదవ్

టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) నెగ్గిన తర్వాత భారత స్టార్‌ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశారు. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. వారిద్దరితోపాటు రవీంద్ర జడేజా కూడా వీడ్కోలు పలికాడు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని