Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 16 Jun 2024 13:12 IST

1. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్‌

మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. డీఎస్సీ-2008, జీవో నెం.39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2,193 మందిని క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లోకేశ్‌ను కలిసి విన్నవించారు. పూర్తి కథనం

2. అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్‌

పోలింగ్‌ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVM) హ్యాకింగ్‌కు గురవ్వడంపై టెస్లా, స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్‌ మస్క్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించొచ్చని సూచించారు. అమెరికా నియంత్రణలోని ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి కథనం

3. ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ రాజీనామా

ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ రాజీనామా చేశారు. ఆయన్ను ఉద్యోగ విరమణ తర్వాత సర్వీసులో కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో మరో నెలన్నర పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేశారు. జగన్‌ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించారని వలవన్‌పై ఆరోపణలున్నాయి.పూర్తి కథనం

4. ముఖ్య విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: కెనడా ప్రధాని ట్రూడో

భారత్‌-కెనడా సంబంధాలు తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఇరు దేశాధినేతలు జీ7 సమావేశాల సందర్భంగా కలుసుకొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమైన అంశాలపై భారత్‌తో కలిసి పనిచేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) వెల్లడించారు. మన ప్రధాని మోదీ (PM Modi)తో భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి కథనం

5. తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు

శ్రీవారి దర్శనానికి తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులుదీరారు. వీరికి శ్రీవారి దర్శనం కోసం 36 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది.పూర్తి కథనం

6. నీతి ఆయోగ్‌ చెప్పిందదే.. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై పీవీ రమేష్‌ కీలక వ్యాఖ్యలు

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు విశ్రాంత ఐఏఎస్‌ పీవీ రమేష్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు పెట్టారు. గతంలో తన తండ్రి పట్టా భూమి మ్యుటేషన్‌కు అధికారులు నిరాకరించారని తెలిపారు. ఆర్డీవోకు పోస్టులో పంపిన పత్రాలను తిరిగి వెనక్కు పంపారని చెప్పారు.పూర్తి కథనం

7. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్‌ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్‌ కోచ్‌ ఏమన్నారంటే..

పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ సూపర్‌-8 దశకు చేరుకున్నాక.. ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఉన్న స్టార్‌ ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ (Shubman Gill), అవేష్‌ఖాన్‌ ( Avesh Khan)ను భారత్‌కు పంపాలని నిర్ణయించారు. హఠాత్తుగా టీమ్‌ ఇండియా ఈ నిర్ణయం ఎందుకు తీసుకొందో అర్థం కాక.. ఫ్యాన్స్‌ గందరగోళానికి గురయ్యారు. కొందరు మరో అడుగు ముందుకేసి.. గిల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారానికి తెరతీశారు.పూర్తి కథనం

8. నిర్దిష్ట కాల పరిమితితో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ

నిర్దిష్ట కాలపరిమితితో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ (Narayana) తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో ఆదివారం బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వం రాజధానిని విధ్వంసం చేసిందని నారాయణ మండిపడ్డారు.పూర్తి కథనం

9. ఆరోగ్యశ్రీలో గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు: మంత్రి సత్యకుమార్‌

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. వైద్యారోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి కథనం

10. పవన్‌ కల్యాణ్‌కు సాయిధరమ్‌ తేజ్‌ గిఫ్ట్‌.. అదేంటంటే?

సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఘన విజయం అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, జనసేన వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీశాఖలను కేటాయించడంతో ఆ సంతోషం రెట్టింపైంది. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని