Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 22 Jun 2024 12:58 IST

1. ఏపీ శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్‌ 16వ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సభాపతి స్థానంలో కూర్చుండబెట్టారు. పూర్తి కథనం

2. కనీసం నలుగురు పిల్లలుంటే.. జీవితాంతం ట్యాక్స్‌ కట్టక్కర్లేదు: ఎక్కడో తెలుసా?

ఓవైపు ప్రపంచ జనాభా (Population) నానాటికీ పెరుగుతుంటే.. కొన్ని దేశాలను మాత్రం జననాల క్షీణత సమస్య వేధిస్తోంది. ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లతో అక్కడి యువత పెళ్లిళ్లపై అనాసక్తి చూపడంతో భవిష్యత్‌ తరం తగ్గిపోతోంది. దీంతో వలసలపై ఆధారపడాల్సి వస్తోంది. ఐరోపా దేశం హంగేరీ (Hungary) ప్రస్తుతం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది.పూర్తి కథనం

3. అయ్యన్న ఇప్పటికీ ఫైర్‌ బ్రాండే: చంద్రబాబు

అసెంబ్లీలో అత్యంత సీనియర్‌ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. స్పీకర్‌గా అయ్యన్న ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడారు. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషమన్నారు. ఎన్టీఆర్‌ పిలుపుతో 25 ఏళ్ల వయసులో అయ్యన్నపాత్రుడు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.పూర్తి కథనం

4. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల ఆందోళన

కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నీట్‌ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో పలు సంఘాల నేతలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.పూర్తి కథనం

5. వెళ్లొస్తా మరి.. విమానం నుంచి కిమ్‌కు పుతిన్‌ బైబై..!

పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin).. ఉత్తర కొరియాలో పర్యటించడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ పర్యటనలో కిమ్, పుతిన్‌ల మధ్య ఉన్న స్నేహం మీడియా దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది.పూర్తి కథనం

6. ఆదివాసీ మహిళపై దాడి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి జూపల్లి

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా మొలచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆయన పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.పూర్తి కథనం

7. బడ్జెట్‌ 2024.. రాష్ట్రాల ఆర్థికమంత్రులతో నిర్మలమ్మ భేటీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ పూర్తిస్థాయి బడ్జెట్‌ (Budget 2024)ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందులోభాగంగానే పలు రంగాల ప్రతినిధులతో ఆ శాఖ ముందస్తు బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు (Pre-Budget Meeting) నిర్వహిస్తోంది. తాజాగా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం భేటీ అయ్యారు.పూర్తి కథనం

8. యూఎస్‌ఏ కథ ముగిసె.. విండీస్ ఆశలు మిగిలె

సహ ఆతిథ్య దేశాల మధ్య పోటీ ఏకపక్షంగా ముగిసింది. టీ20 ప్రపంచకప్‌ (ICC Mens T20 World Cup) సూపర్‌-8 పోరులో యూఎస్‌ఏ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. బార్బడోస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏను వెస్టిండీస్‌ 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన యూఎస్‌ఏ 128 పరుగులకు ఆలౌట్ కాగా.. విండీస్ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 10.5 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది.పూర్తి కథనం

9. ఆ క్రికెటర్‌తోపాటు యూట్యూబర్లపై బాబర్‌ అజామ్‌ లీగల్‌ యాక్షన్‌!

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ ఘోర పరాభవానికి తానే కారణమంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై కెప్టెన్ బాబర్ అజామ్‌ (Pakistan Captain Babar Azam) చట్టపరమైన చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. బాబర్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. వెటరన్ క్రికెటర్ అహ్మద్ షహజాద్‌తోపాటు యూట్యూబుల్లో పలువురు మాజీలు చేసిన వ్యాఖ్యల వీడియోలను పీసీబీ (Pakistan Cricket Board) లీగల్ సెక్షన్ పరిశీలిస్తోంది.పూర్తి కథనం

10. చైనాను ముంచెత్తిన వరదలు

చైనాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడ్డ కారణంగా 47 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక చెట్లు నేలకూలాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి, రహదారులు కొట్టుకుపోయాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని