Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Jun 2024 13:02 IST

1. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌

మంత్రిగా నారా లోకేశ్‌ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు. మెగా డీఎస్సీ సంబంధిత దస్త్రంపైనే లోకేశ్‌ తొలి సంతకం చేశారు. పూర్తి కథనం

2. థ్యాంక్యూ మినిస్టర్‌.. నాకు గ్రేస్‌ మార్కులేం కలపలేదుగా: కాంగ్రెస్‌ నేత సెటైర్‌

18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju), సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్‌ (Jairam Ramesh) మధ్య సోషల్ మీడియా వార్ జరిగింది. ఈ క్రమంలో నీట్‌, యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించిన ఎన్టీయే(national testing agency) ప్రస్తావన వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..పూర్తి కథనం

3. అప్పట్లో కాంగ్రెస్‌ తలవంచక తప్పలేదు.. చరిత్ర పునరావృతం అవుతుంది: కేటీఆర్‌

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న తరుణంలో ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్పందించారు. 2004-06 మధ్య కూడా తమ పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయని గుర్తుచేశారు.పూర్తి కథనం

4. రోజుకు గ్యాలన్‌ నీరు తాగి.. 10 రోజులు ప్రాణాలు కాపాడుకొని..!

సరదాగా మూడు గంటలపాటు హైకింగ్‌కు(కొండల్లో నడవటం) వెళదామనుకొని బయల్దేరాడు ఆ వ్యక్తి. కానీ, అతడి టైం బాగోలేదు.. మార్గం తప్పాడు. తిరిగి అతడు ఆ పర్వతాల నుంచి బయటపడటానికి 10 రోజులు పట్టింది. రోజుకు  కొంత నీరు, అక్కడక్కడా దొరికే వైల్డ్‌ బెర్రీలతో మాత్రమే ప్రాణాలు నిలుపుకొన్నాడు.పూర్తి కథనం

5. నెరవేరిన ఆకాంక్షలు.. తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు తిరుమలకు కృతజ్ఞత పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తిరుమలకు మహిళలు, రైతులు పాదయాత్ర చేపట్టారు.పూర్తి కథనం

6. తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలిని  నియమించింది. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.పూర్తి కథనం

7. కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ.. మెగా డీఎస్సీకి ఆమోదం

సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.పూర్తి కథనం

8. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. అత్యవసర సేవలు మినహా ఓపీ, వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేసినట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. పలు డిమాండ్లతో ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన జూడాలు గాంధీ ఆసుపత్రిలో సమ్మెకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి బయట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.పూర్తి కథనం

9. భారత్‌లోకి ‘మెటా ఏఐ’.. వాట్సప్‌, ఎఫ్‌బీ, ఇన్‌స్టాలో ఏఐ అసిస్టెంట్‌

బిలియనీర్‌ మార్క్‌ జుకర్‌బర్గ్‌ నేతృత్వంలోని టెక్‌ సంస్థ మెటా రూపొందించిన ఏఐ అసిస్టెంట్‌ ‘మెటా ఏఐ’ (Meta AI) భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా మెటా.ఏఐ పోర్టల్‌లో దీన్ని ఉపయోగించుకోవచ్చని సోమవారం వెల్లడించింది.పూర్తి కథనం

10. విరాట్‌ ఒకసారి పరుగుల రుచి మరిగితే.. ఏదైనా చేయగలడు: ఊతప్ప

పొట్టి ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో తడబడినట్లు అనిపించిన కోహ్లీ.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుదురుకొన్నట్లు కనిపించాడు. నెమ్మదిగా మొదలుపెట్టినా.. జోరైన ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో నేడు ఆసీస్‌పై జరగనున్న సూపర్‌ 8 మ్యాచ్‌లో అతడు కచ్చితంగా భారీ ఇన్నింగ్స్‌ ఆడే అవకాశం ఉందని వెటరన్‌ ఆటగాళ్లు అంచనా వేస్తున్నారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని