Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 25 Jun 2024 13:01 IST

1. వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీపై కేసు నమోదు

వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్‌ గద్దె బ్రహ్మాజీపైనా విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయగ్రీవ కన్‌స్ట్రక్షన్‌ అధినేత జగదీశ్వరుడు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి కథనం

2. డ్రగ్స్‌ వినియోగం.. విష ప్రయోగం లాంటిది: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ విషయంపై ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో జలవిహార్‌ వద్ద డ్రగ్స్‌ నిర్మూలన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. పూర్తి కథనం

3. చరిత్రలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక..

18వ లోక్‌సభ స్పీకర్‌ (Lok Sabha Speaker) ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చరిత్రలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనుంది. పూర్తి కథనం

4. టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌కు అఫ్గాన్‌.. ఇంటిముఖం పట్టిన బంగ్లాదేశ్‌, ఆసీస్

ఒక్క దెబ్బతో రెండు పిట్టలు ఔట్.. అందులోనూ టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) ఫేవరేట్‌ టీముల్లో ఒకటైన ఆస్ట్రేలియాతోపాటు బంగ్లా నిష్క్రమించాయి. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న అఫ్గానిస్థాన్‌ టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌కు దూసుకుపోయింది. దీంతో ఆసీస్, బంగ్లాదేశ్‌ ఇంటిముఖం పట్టాయి. సూపర్‌-8 గ్రూప్‌ 1 (Super 8) నుంచి భారత్‌తో పాటు అఫ్గాన్‌ సగర్వంగా నాకౌట్‌ స్టేజ్‌కు వెళ్లింది. పూర్తి కథనం

5. క్షీణించిన దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోగ్యం..

నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన దిల్లీ మంత్రి ఆతిశీ (Atishi hunger strike) ఆరోగ్యం క్షీణించటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆమె రక్తంలో చక్కెరస్థాయిలు పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె లోక్‌నాయక్‌ హాస్పిటల్‌లో ఐసీయూ వార్డులో ఉన్నట్లు ఎక్స్‌ వేదికగా తెలిపాయి. పూర్తి కథనం

6. వైకాపా నేతలు, కార్యకర్తల నుంచే జగన్‌కు వ్యతిరేకత

ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ఎన్నడూ ప్రజలను కలవని జగన్.. ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గ ప్రజలు, నేతలకు ఆ అవకాశం ఇచ్చారు. ఓటమి బాధలో ఉన్న తనను ఓదార్చి అండగా ఉంటారని ఆశించిన ఆయనకు తీవ్ర భంగపాటు ఎదురైంది. వచ్చిన వారు ఓదార్చడం మాట అటుంచితే.. తాము చేసిన పనుల పెండింగ్  బిల్లుల సంగతేంటని నిలదీయడంతో ఆయన అవాక్కయ్యారు. పూర్తి కథనం

7. నేరాంగీకారానికి అసాంజే సిద్ధం.. అమెరికాతో ఒప్పందం!

గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటున్న వికీలీక్స్‌ (WikiLeaks) వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే (Julian Assange) నేరాంగీకరణకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం కోర్టులో సమర్పించిన పత్రాలు వెల్లడించాయి. దీంతో కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వీలుగా ఆయన్ను యూకే జైలు నుంచి మంగళవారం ఉదయం విడుదల చేశారు. పూర్తి కథనం

8. పాలస్తీనా చిన్నారిని చంపేందుకు యత్నం.. తీవ్రంగా ఖండించిన బైడెన్

గాజా పోరులో ఇజ్రాయెల్‌ (Israel)కు మద్దతుగా జో బైడెన్‌ (Joe Bidn) ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అమెరికా(USA)లో పాలస్తీనా అనుకూలురు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు గళమెత్తారు. ఈనేపథ్యంలో టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ వ్యవహరించిన తీరు తీవ్ర ఆందోళన కలిగించింది. పాలస్తీనియన్-అమెరికన్ సంతతికి చెందిన బిడ్డను ఒక కొలనులో ముంచి చంపేందుకు యత్నించిందని వార్తలు వెలువడ్డాయి. పూర్తి కథనం

9. నాడు ఎమర్జెన్సీ విధించి.. నేడు రాజ్యాంగంపై ‘ప్రేమ’ నాటకాలా?: మోదీ

దేశంలో అత్యయిక స్థితి (Emergency Days) ఏర్పడి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. ఈసందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఎక్స్‌ వేదికగా సుదీర్ఘ పోస్ట్‌లు పెట్టారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు భాజపా (BJP) ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్‌ చేస్తోన్న ఆరోపణలకు ప్రధాని గట్టిగా బదులిచ్చారు. రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి దేశాన్ని జైల్లో పెట్టింది వారేనంటూ హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పూర్తి కథనం

 

10. అమెరికాలో బద్దలైన డ్యామ్‌.. భారీగా వరద..!

అమెరికాలో వరదలు తీవ్రమయ్యాయి. ఆ ప్రవాహ తీవ్రతకు ఓ డ్యామ్‌ బద్దలై జనావాసాల్లోకి నీరు చేరింది. అక్కడి ఐయోవా, సౌత్‌ డకోటా, మిన్నెసోటా, నెబ్రోస్కా రాష్ట్రాల్లో దాదాపు 30 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిన్నెసోటాలో బ్లూఎర్త్‌ కౌంటీలో ది ర్యాపిడాన్‌ డ్యామ్‌ వరద తీవ్రతకు బద్దలైంది. దీంతో అక్కడి సమీప ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని