Forts: ఈ కోటలు.. భారత చారిత్రక సంపదకు చిహ్నాలు!

భారతదేశం ఒకప్పుడు అనేక సామ్రాజ్యాల సమూహం. ఎంత మంది రాజులు, చక్రవర్తులు దేశంలోని అనేక ప్రాంతాలను తమ రాజధానులుగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ క్రమంలో శత్రుదుర్భేద్యమైన కోటలను నిర్మించుకున్నారు. వాటిలో కొన్ని శత్రువుల దాడుల్లో ధ్వంసం కాగా.. ఇప్పటికీ దే

Published : 17 Jan 2022 01:33 IST

భారతదేశం ఒకప్పుడు అనేక సామ్రాజ్యాల సమూహం. ఎంతో మంది రాజులు, చక్రవర్తులు దేశంలోని అనేక ప్రాంతాలను తమ రాజధానులుగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ క్రమంలో శత్రుదుర్భేద్యమైన కోటలను నిర్మించుకున్నారు. వాటిలో కొన్ని శత్రువుల దాడుల్లో ధ్వంసం కాగా.. ఇప్పటికీ దేశవ్యాప్తంగా కొన్ని ఖిల్లాలు చెక్కుచెదరకుండా చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వాటిల్లో చెప్పుకోదగ్గ కొన్ని కోటల విశేషాలు తెలుసుకుందామా..

ఎర్రకోట

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటకు ఎంతో ఘన చరిత్ర ఉంది. దీన్ని 17వ శతాబ్దంలో మొగుల్‌ చక్రవర్తి షాజహాన్‌ నిర్మించారు. మొఘల్‌ సామ్రాజ్య రాజధానిని ఆగ్రా నుంచి దిల్లీకి మార్చాలని భావించిన షాజహాన్‌.. ఈ మేరకు దిల్లీలో ఓ కోటను నిర్మించాలనుకున్నారు. దీంతో 1639 మే 12న కోట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాజ్‌మ‌హ‌ల్‌ను డిజైన్‌ చేసిన అహ్మద్‌ లాహోరినే ఎర్రకోట డిజైన్‌ను రూపొందించారు. ఇస్లామిక్, మొఘ‌ల్‌, పార్సీ, హిందూ సంస్కృతుల సమ్మేళనం ఈ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కోట లోపల దివాన్‌-ఇ-ఆమ్‌ దర్బారు, మోతీ మసీదు, పాలరాతితో నిర్మించిన దివాన్‌-ఇ- ఖాస్‌ మండపం, ముంతాజ్‌ మహల్‌ పేరుతో ఒక మ్యూజియం ఇలా అనేక కట్టడాలు ఉన్నాయి. భారత్‌లోని సందర్శక ప్రాంతాల్లో ఎర్రకోట ముందు వరుసలో ఉంటుంది. ఎర్రకోట సమీపంలో చాందినీ చౌక్‌ మార్కెట్‌ను షాజహాన్‌ చక్రవర్తి కుమార్తె జహనారా నిర్మించారు. ఏటా స్వాతంత్ర్యదినోత్సవం నాడు దేశ ప్రధాని ఎర్రకోటపై జాతీయ పతాకావిష్కరణ చేస్తారు.


గోల్కొండ కోట

ఈ నవాబుల ఖిల్లా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ శివారులో ఉంది. గోల్కొండ ప్రాంతాన్ని మొదట్లో కాకతీయులు పరిపాలించేవారు. ఆ సమయంలో ఒక మట్టి కోట ఉండేదట. కాలక్రమంలో ఈ ప్రాంతం బహమనీ సుల్తాను మహ్మద్ షా స్వాధీనమైంది. బహమనీ చక్రవర్తులతోపాటు.. 1512–1687 మధ్య కాలంలో కుతుబ్ షాహీలకూ ఈ గోల్కొండ ప్రాంతమే రాజధానిగా మారింది. రాజధానిలో రాజులకు కోట అవసరమై కుతుబ్ షాహీ వంశస్తులు 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై ఈ గోల్కొండ కోటను నిర్మించారు. ఈ కోట.. బురుజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులోనే తానీషా ప్రభువు.. రామదాసును బందించిన చెరసాల ఉంది. కోట ప్రవేశమార్గంలో చప్పట్లు కొడితే.. కొండపైన కిలోమీటరు మేర స్పష్టంగా ఆ శబ్దం వినిపించే అద్భుత నిర్మాణం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 


గ్వాలియర్‌ కోట

భారతదేశంలో అత్యంత పురాతన కోటల్లో గ్వాలియర్‌ కోట ఒకటి. దీన్ని పదో శతాబ్దంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నిర్మించారు. అంతకుముందే ఈ కోట నిర్మాణం జరిగిందని పలువురు చరిత్రకారులు అంటున్నారు. దీంతో దీన్ని ఎవరు.. ఎప్పుడు నిర్మించారన్న దానిపై స్పష్టత లేకపోయినా.. తోమర్‌, మోఘల్‌, మరాఠా, సింధియా చక్రవర్తులు ఈ గ్వాలియర్‌ కోట నుంచే పరిపాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. బ్రిటిష్‌ కాలంలో ఈ కోటను జైలుగానూ ఉపయోగించారు. కోట చుట్టూ సుమారు 15 మీటర్ల ఎత్తు గోడలు ఉన్నాయి. కోట లోపల ఆలయాలు, పలు రాజా ప్రాసాదాలు, మండపాలు కనిపిస్తాయి. రాత్రివేళ ఈ కోట అందాలు పర్యటకులకు కనువిందు చేస్తాయి.


మెహరన్‌గఢ్‌ కోట

రాజస్థాన్‌లో అనేక రాజమహళ్లు.. కోటలు దర్శనమిస్తాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. జోధ్‌పూర్‌లోని మెహరన్‌గఢ్‌ కోట గురించే. దేశంలోనే అత్యంత విశాలమైన కోటగా ఇది పేరొందింది. దాదాపు 1,200 ఎకరాల విస్తీర్ణంలో.. 122 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. రాఠోడ్‌  వంశీకుడు రావ్ జోధా చక్రవర్తి అయ్యాక.. పూర్వీకులు నిర్మించిన మన్‌డోర్ కోటని వీడి.. అప్పటి బార్‌చీరియా ప్రాంతంలో మెహరన్‌గఢ్‌ కోటకు రూపకల్పన చేశారట. ఈ కోటలో చాముండి మాత ఆలయం, రావ్‌ జోధా డెసర్ట్‌ రాక్‌ పార్క్‌ ఉన్నాయి. అలాగే, మోఘల్‌ చక్రవర్తులకు సంబంధించిన పెయింటింగ్స్‌, ఆయుధాలను సందర్శకుల కోసం ప్రదర్శనకు పెడుతున్నారు. అంతేకాదు, ఈ కోటలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ సినిమా షూటింగ్స్‌ కూడా జరుగుతుంటాయి.


జునాగఢ్‌ కోట

రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉన్న జునాగఢ్‌ కోట అందాలు చూసేందుకు పర్యటకులు క్యూ కడుతుంటారు. 1571 నుంచి 1612 వరకూ బికనీర్ రాజ్యాన్ని పాలించిన రాజా రాయ్ సింగ్ ఈ కోటను నిర్మించారు. మొఘల్ చక్రవర్తులు ఇచ్చిన నిధులతోపాటు, జోధ్‌పూర్ నుంచి వచ్చిన డబ్బులతో ఈ కోటను రాయ్ సింగ్ నిర్మించారట.. అందుకే, జునాగఢ్‌ కోట నిర్మాణంలో మొఘల్ చిత్రకళ శైలి కనిపిస్తుంది. కొండపై కాకుండా నేలపై నిర్మించిన కోటల్లో ఇదీ ఒకటి. ఈ కోట చుట్టూరా ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో నగరంగా జునాగఢ్‌ మారిపోయింది. థార్‌ ఏడారికి 5-6గంటల ప్రయాణ దూరంలోనే ఈ కోట ఉండటంతో పర్యటకంగానూ ఈ కోటకు గుర్తింపు లభించింది.


కాంగ్డా కోట

హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలకు 20కి.మీ దూరంలో కొండప్రాంతమైన కాంగ్డాలో ఈ కోట ఉంది. కాంగ్రా ప్రాంతం.. ఒక రాజ్యంగా విరాజిల్లుతున్న సమయంలో రాజ్‌పుత్‌ వంశీయులు దీన్ని నిర్మించారు. అయితే, 1615లో అక్బర్‌ చక్రవర్తి దీన్ని కైవసం చేసుకునేందుకు విఫలయత్నం చేశారట. శత్రుదుర్భేద్యమైన కోట ప్రహారీలు అక్బర్‌ సైన్యం దాడి నుంచి రాజ్‌పుత్‌లను కాపాడినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. రాజ్‌పుత్‌ వంశీయులతోపాటు అనేక మంది రాజులు, ఆంగ్లేయులు ఈ కోటలో ఉండి రాజ్యాన్ని పాలించారు. అయితే, 1905లో వచ్చిన భుకంపంలో ఈ కోట పాక్షికంగా ధ్వంసమైంది. అయినప్పటికీ ఈ కోట పర్యటకులను ఆకట్టుకుంటోంది.


ఆగ్రా కోట

ఆగ్రా అనగానే తాజ్‌మహల్‌ గుర్తొస్తుంది. కానీ, అక్కడే మరో అద్భుతమైన సందర్శక ప్రాంతముంది. అదే ఆగ్రా కోట. మొఘల్‌ వంశంలో నాలుగు తరాల చక్రవర్తులు ఆగ్రా రాజధానిగా పరిపాలించిన కాలంలో ఈ కోటలోనే ఉన్నారట. అయితే, దీన్ని అంతకుముందే లోడీ చక్రవర్తులు నిర్మించారని, మొఘలులు ఆధునికీకరించారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితా(1983)లో చేరిన తొలి భారతీయ కట్టడం ఈ కోటే కావడం విశేషం.


ఝాన్సీ కోట

వీరనారి.. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు పాఠ్యపుస్తకంలో చదువుకునే ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతాన్ని ఆమె ఝాన్సీ కోట నుంచే పాలించింది. ఈ కోటను 1613లో బుందేల రాజ్‌పుత్‌ వంశీయుడు వీర్‌సింగ్‌ దేవ్‌ నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. బుందేల్‌, మరాఠీల శైలిలో ఈ కోట నిర్మాణం ఉంటుంది. కోట ప్రవేశమార్గంలో శివాలయం, గణపతి దేవాలయం ఉన్నాయి. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలలో ఝాన్సీ మహోత్సవం జరుగుతుంటుంది. ఆ సమయంలో కోట మరింత అందంగా ముస్తాబై పర్యటకులను అమితంగా ఆకట్టుకుంటుంది.


జైఘడ్‌ కోట

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఉన్న అమేర్‌ కోటకు రక్షణ కల్పించడం కోసం 1726లో రాజా జై సింగ్‌ II ఈ కోటను నిర్మించారు. దీంతో అతడి పేరుమీదే దీనికి జైఘడ్‌ కోటగా పేరొచ్చింది. దిల్లీకి సమీపంలో ఈ కోట ఉండటంతో.. మోఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ దీన్ని ఆయుధ బాండాగారంగా మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ కోటలో ఉన్న మ్యూజియంలో జైపూర్‌ రాజుల చిత్రపటాలు, కోట నిర్మాణం వివరాలు, వస్తువులను సందర్శించొచ్చు. ఈ కోట నుంచి చూస్తే అమేర్‌ కోట, అరావళి పర్వాతాల అందాలు పర్యటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి.


నీమ్రానా కోట

దిల్లీ జైపూర్‌ జాతీయ రహదారిపై రిసార్టుగా మారిన నీమ్రానా కోటను 1464లో రాజ్‌పుత్‌ మహారాజు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ III నిర్మించారట. ఎత్తయిన కొండపై 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కోట యువ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. రాత్రి వేళల్లో దీపాల వెలుగుల్లో సుందరంగా  కోట మెరిసిపోతూ ఉంటుంది. మనదేశంలో ఉన్న పురాతన వారసత్వ రిసార్టులలో ఇదొకటి. ఈ కోటలో రెండు స్విమ్మింగ్‌పూల్స్‌, వేలాడే తోటలు ఉన్నాయి. వారాంతంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు పర్యాటకులను అలరిస్తాయి. అడ్వెంచర్‌ కోరుకునే వారి కోసం ‘జిప్‌ టూర్‌’ అందుబాటులో ఉంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని