Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Mar 2023 13:19 IST

1. ‘నాటు నాటు’లో డ్యాన్స్‌ కంటే.. అదే కష్టంగా అనిపించింది: ఎన్టీఆర్‌

మరికొన్ని గంటల్లో జరగనున్న ఆస్కార్‌ వేడుక కోసం యావత్‌ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదరుచూస్తోంది. అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటాలని కొన్ని కోట్లమంది కోరుకుంటున్నారు. ఇక ఈ వేడుక కోసం అమెరికా వెళ్లిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీం వరుస ఇంటర్వ్యూలతో సందడి చేస్తోంది. తాజాగా ఎన్టీఆర్‌ (NTR) ఓ హాలీవుడ్‌ ఛానల్‌తో మాట్లాడారు. ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట రిహార్సల్స్‌ గురించి మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వైకాపా నేతలతో ఎన్నికల అధికారులు కుమ్మక్కు: సీఈసీకి చంద్రబాబు లేఖ

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నిక(MLC Elections)ల్లో బోగస్‌ ఓట్లు, అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission) తెదేపా అధినేత చంద్రబాబు(Chandrababu) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఈసీకి ఆయన లేఖ రాశారు. వైకాపా నేతలతో పలుచోట్ల ఎన్నికల అధికారులు కుమ్మక్కవడంతో పెద్ద ఎత్తున బోగస్‌ ఓట్లు నమోదయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో వెలుగుచూసిన బోగస్‌ ఓట్ల వివరాలను లేఖకు ఆయన జత చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎస్‌వీబీ పతనంతో టెక్‌ రంగంలో పెద్ద సంక్షోభం: ఇజ్రాయెల్‌ ప్రధాని

బ్యాంకింగ్‌ షేర్ల పతనానికి కారణమవుతున్న సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ (SVB crisis) విషయంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతం మొత్తం సాంకేతిక రంగంలోనే తీవ్ర సంక్షోభాన్ని సృష్టించిందని వ్యాఖ్యానించారు. 2008 వాషింగ్టన్‌ మ్యూచువల్‌ తర్వాత అమెరికన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇదే అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా (SVB crisis) చెబుతున్న విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆసీస్‌తో నాలుగో టెస్టు.. శ్రేయస్‌ అయ్యర్‌కు ఏమైంది?

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar trophy) భాగంగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల (IND vs AUS) మధ్య చివరి టెస్టు జరుగుతోంది. ప్రస్తుతం నాలుగో రోజు ఆట కొనసాగుతోంది. టీమ్‌ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌ను ఆడుతోంది. అయితే, భారత మిడిలార్డర్‌ బ్యాటర్ శ్రేయస్‌ అయ్యర్ పరిస్థితేంటో అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. సాధారణంగా నాలుగో డౌన్‌లో శ్రేయస్‌ అయ్యర్ బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ, ఛెతేశ్వర్ పుజారా పెవిలియన్‌కు చేరిన తర్వాత కూడా అయ్యర్ బ్యాటింగ్‌కు రాలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మేం దేనికైనా సిద్ధంగా ఉన్నాం: ఎంపీ అవినాష్‌ తండ్రి భాస్కర్‌ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka Murder Case)పై సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇస్తే విచారణకు హాజరవుతానని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి(YS Bhaskar Reddy) తెలిపారు. 12న విచారణకు రావాలంటూ ఆయనకు సీబీఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కడప కేంద్ర కారాగారం అతిథిగృహం వద్దకు ఆదివారం వచ్చారు. అక్కడ సీబీఐ అధికారులు లేకపోవడంతో భాస్కర్‌రెడ్డి తిరిగి వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 116 ఏళ్ల భారత బ్యాంకుపై ఎస్‌వీబీ సంక్షోభ ప్రభావం!

సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ పతనం (SVB Crisis) ఇప్పుడు టెక్‌ ప్రపంచంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇప్పటికే అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా పడిపోయాయి. అయితే, ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న 116 ఏళ్ల కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ సైతం ఎస్‌వీబీ పతనం ప్రభావాన్ని చవిచూస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బాలానగర్‌లో వీధి కుక్క స్వైర విహారం.. 16 మందిపై దాడి

హైదరాబాద్‌లోని బాలానగర్‌ పరిధి వినాయక్‌నగర్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై కుక్క ఎగబడుతూ కరిచింది. గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి జోన్‌ డాగ్‌ స్వ్కాడ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దాదాపు 2 గంటలపాటు శ్రమించి కుక్కను పట్టుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. కపిల్‌ శర్మ సంచలన వ్యాఖ్యలు

ఐదేళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు బాలీవుడ్‌ నటుడు, వ్యాఖ్యాత, ‘ది కపిల్‌శర్మ షో’ ఫేమ్‌ కపిల్‌శర్మ (Kapil Sharma) తెలిపాడు. ఆ సమయంలో తాను మానసిక సంఘర్షణకు లోనయ్యానని దానిని ఎలా జయించాలో అర్థం కాక.. చచ్చిపోవాలనుకున్నానని వెల్లడించాడు. కావాల్సినంత డబ్బు, ఫేమ్‌, చుట్టూ ఎంతోమంది స్నేహితులు ఉన్నప్పటికీ తాను ఒంటరితనాన్ని అనుభవించానంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మూడున్నరేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ టెస్టుల్లో సెంచరీ

ఎప్పుడో 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. నాలుగో టెస్టులో ఆసీస్‌పై 241 బంతుల్లో 100 పరుగుల మార్క్‌ను తాకాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో  విరాట్‌కిది 28వది కాగా.. అన్ని ఫార్మాట్లు కలిపి 75వ శతకం. ప్రస్తుతం భారత్‌ స్కోరు 139 ఓవర్లలో 400/5. క్రీజ్‌లో విరాట్‌తోపాటు అక్షర్ పటేల్ (5*) ఉన్నాడు. ఆసీస్‌ కంటే ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగుల వెనుకంజలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘మా వాళ్ల అమ్మాయిని ప్రేమిస్తావా.. రూ. 5లక్షలు చెల్లించు..’

‘మా వాళ్ల అమ్మాయిని ప్రేమిస్తావా.. రూ.5 లక్షలు చెల్లించు’ అని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు పవన్‌ను డిమాండ్‌ చేశాడు. అయితే, సంబంధిత సొమ్మును చెల్లించకపోవడంతోనే అతడిని సదరు యువతి బాబాయి, అతడి స్నేహితుడు కలిసి దారుణంగా హతమార్చారు. బుధవారం రాత్రి జరిగిన ఈ హత్య కేసును బాలాపూర్‌ పోలీసులు ఛేదించారు. శనివారం పహాడీషరీఫ్‌ ఠాణాలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని