Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 27 Jan 2023 13:11 IST

1. నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం

ప్రజల గుండెచప్పుడు విని వారికి భరోసా ఇచ్చేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సరిగ్గా 11.03 గంటలకు ఆలయం వద్ద నుంచి తొలి అడుగు వేసి పాదయాత్ర ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!

అలనాటి నటి జమున ఇక లేరు. హైదరాబాద్‌లో ఆమె కన్నుమూశారు. ఆమె పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. అంతలా ఆమెకు పేరు సంపాదించి పెట్టిందీ సినిమా. ఈ సినిమా పేరు వినగానే వినసొంపైన మాటలు, పాటలు, పాత్రల చిత్రీకరణ, హావభావాలు గుర్తుకొస్తాయి. రామారావు, నాగేశ్వరరావు పాత్రల తీరు.. సావిత్రి సౌమ్యతనం, జమున కొంటెతనం, గుండక్క గయ్యాళితనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శ్రీవారి భక్తుల కోసం ఇకపై ‘టీటీ దేవస్థానమ్స్‌’ యాప్‌..

శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మొబైల్‌ యాప్‌ను అప్‌డేట్‌ చేసింది. ఇది వరకు ఉన్న ‘గోవింద’ యాప్‌నే టీటీ దేవస్థానమ్స్‌ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఈ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ యాప్‌ ద్వారా ఎస్‌వీబీసీ భక్తి ఛానల్లో వచ్చే కార్యక్రమాల ప్రత్యక్షంగా వీక్షించవచ్చని తెలిపింది. దర్శనం, గదులు, ఆర్జిత సేవా టికెట్లను భక్తులు నేరుగా బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మరిన్ని రంగాలకు పీఎల్‌ఐ.. బడ్జెట్‌లో ‘తయారీ’కి దన్ను

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2025 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవడం అందులో ఒకటి. ఈ గమ్యాన్ని చేరుకోవడానికి ఉన్న అనేక మార్గాలను అప్పట్లో ప్రభుత్వం శోధించింది. తయారీకి పెద్దపీట వేయాలని నిర్ణయించింది. ‘ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల పథకం (PLI)’ ద్వారా తయారీ రంగానికి ఊతమిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సింధు జలాల ఒప్పందాన్ని మార్చుకుందాం.. పాక్‌కు భారత్ నోటీసు

సింధు నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) విషయంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య గత కొన్నాళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది పాక్‌ (Pakistan)కు భారత్‌ (India) నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. సింధు జలాల ఒప్పంద కమిషనర్ల ద్వారా జనవరి 25న ఈ నోటీసు పంపినట్లు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విద్యార్థులతో ప్రధాని మోదీ ‘పరీక్షాపే చర్చ’

ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం పరీక్షా పే చర్చ(ParikshaPeCharcha2023) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యకమ్రంలో ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో ముచ్చటిస్తున్నారు. ఇందుకు దిల్లీలోని తాల్కటోరా ఇండోర్‌ స్టేడియం వేదికైంది. ఈ సందర్భంగా విద్యార్థులతో సమయపాలన గురించి మాట్లాడారు. రోజూ ఇంట్లో అమ్మను చూస్తే.. సమయపాలన ఎలా నిర్వహించుకోవాలో మనకు తెలుస్తుందన్నారు. ఇక ఈ కార్యక్రమంపై ఇంతకుముందు ప్రధాని ట్విటర్‌లో స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కేంద్ర బడ్జెట్‌.. ఈ ఆసక్తికర అంశాలు తెలుసా?

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ 2023-24 (Budget 2023)ను  ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఐదోసారి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం విశేషం. ఈ తరుణంలో మొదటి బడ్జెట్‌.. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వమే ప్రవేశ పెట్టారు. తొలిసారి 1860, ఏప్రిల్‌ 7వ తేదీన ప్రవేశపెట్టారు. ఈస్ట్‌ఇండియా స్కాటిష్‌ ఆర్థికవేత్త జేమ్స్‌ విల్సన్‌ బడ్జెట్‌ను బ్రిటిష్‌ రాణికి సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అదానీ షేర్ల పతనం.. 800 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు సమయం గడుస్తున్న కొద్దీ కొత్త కనిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. మధ్యాహ్నం 12:38 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1089 పాయింట్లు నష్టపోయి 59115 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 350 పాయింట్లు క్షీణించి 17541 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30సూచీలో టాటా మోటార్స్‌, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాలేజ్‌కు వెళ్లేది చదువుకోవడానికి కాదట..!

కాలేజ్‌కు వెళ్లేది చదువుకోవడానికి కాదట..! ఈ మాట అన్నది టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌(Elon Musk). ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్విటర్‌లో పంచుకున్నారు. ‘మీరు కొత్త విషయాలు తెలుసుకునేందుకు కాలేజ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిందేదైనా ఉచితంగానే నేర్చుకోవచ్చు’ అని మస్క్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కెరీర్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

భారత టెన్నిస్‌ (Tennis) స్టార్ సానియా మీర్జా (Sania Mirza) తన గ్రాండ్‌స్లామ్‌ ప్రయాణాన్ని ఓటమితో ముగించింది. గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌లో చివరిదైన ఆస్ట్రేలియా ఓపెన్‌ (Australia Open) మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఫైనల్‌ వరకూ వెళ్లి పరాజయం పాలైంది. దీంతో తీవ్ర భావోద్వేగానికి గురైన సానియా.. మ్యాచ్‌ అనంతరం తన జర్నీ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని