Updated : 07 Jun 2021 13:43 IST

Top Ten News @ 1 PM

1. Wuhan: వుహాన్‌పై ‘డ్రాస్టిక్‌’ చెప్పిన విషయాలు..!

వుహాన్‌ ల్యాబ్‌ లీకు విషయంలో ఒక ఓపెన్‌ ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ చైనాకు కొరకరాని కొయ్యగా మారింది. కొవిడ్‌-19 పుట్టుకపై అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, ఉత్సాహవంతులు కలిసి దీనిని ఏర్పాటు చేశారు. ఈ గ్రూపు.. వుహాన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, పత్రాలను బహిర్గతం చేస్తోంది. దీనిలో కొందరు భారతీయులు కూడా ఉన్నారు.  వుహాన్‌ ల్యాబ్‌ వైరస్‌ డేటా బేస్‌ను కొవిడ్‌ వెలుగులోకి రావడానికి మూడు నెలల ముందు ఆన్‌లైన్‌ నుంచి తొలగించడాన్ని ఈ గ్రూప్‌ ప్రశ్నిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: లక్షకు దిగొచ్చిన కొత్త కేసులు

2. Train accident: పాక్‌లో ఘోర రైలు ప్రమాదం

పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న రెండు రైళ్లు ఢీకొనడంతో.. దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య భారీగా ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. దక్షిణ పాక్‌కు చెందిన ఘోత్కిలోని రెతి-దహర్కి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం సంభవించింది. లాహోర్‌ వైపు వెళ్తోన్న సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్.. కరాచీ నుంచి సర్గోధా వెళ్తున్న మిల్లత్‌ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Krishnapatnam: ప్రభుత్వం నుంచి సహకారం లేదు: ఆనందయ్య

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఔషధం పంపిణీ కొనసాగుతోందని ఆనందయ్య తెలిపారు. ఇవాళ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే అందిస్తామని.. స్థానికేతరులు ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆయన సూచించారు. కొన్ని ఆటంకాల వల్ల ఔషధ పంపిణీ సవ్యంగా సాగట్లేదన్నారు. పంపిణీకి వనరులు సమకూరడం లేదని.. విద్యుత్‌ సౌకర్యం, ఔషధ తయారీ యంత్ర సామగ్రి లేదని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: చంద్రగిరి ప్రజలకు ఆనందయ్య ఔషధం

4. Petrol Price: బాదుడే.. బాదుడు!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను విక్రయ సంస్థలు ఈరోజు మరోసారి పెంచాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 దాటింది. ఈ నెలలో ధరల పెరగడం ఇది నాలుగోసారి. సోమవారం లీటరు పెట్రోల్‌పై  28 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంచారు. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోలు రూ.95.37, డీజిల్ రూ. 86.28కి చేరింది. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్‌ రూ.101.52, డీజిల్ రూ. 93.58గా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Ivermectin: కొవిడ్‌ చికిత్స నుంచి తొలగింపు

సాధారణ లక్షణాలు, లేదా లక్షణాలు లేని కొవిడ్‌ బాధితులకు ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్‌ వంటి ఔషధాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌(డీజీహెచ్‌ఎస్‌) చికిత్స మార్గదర్శకాలను సవరించింది. అంతేగాక, అత్యవసరమైతే తప్ప సీటీ స్కాన్లు చేయొద్దని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: ఔషధం పంపిణీలో ప్రభుత్వ పెద్దల జోక్యమేంటి?: యనమల

6. Mehul Choksi: భారత్‌ పంపిస్తారనే కిడ్నాప్‌ డ్రామా!

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసు ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఛోక్సీని కిడ్నాప్‌ చేసి డొమినికా తీసుకెళ్లారని ఆయన న్యాయవాదులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్‌కు పంపిస్తారనే భయంతోనే ఛోక్సీ ఈ కిడ్నాప్‌ నాటకానికి తెరలేపి ఉంటాడని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో అపహరణ ఆరోపణలపై నిజానిజాలు బయటపెట్టేందుకు దర్యాప్తు చేపట్టాలని ఆంటిగ్వా ప్రధానమంత్రి గాస్టన్‌ బ్రౌనీ ఆ దేశ పోలీసులను ఆదేశించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Nikhil: ఆస్పత్రి బిల్లులపై నిఖిల్‌ ఆగ్రహం

వైద్యం పేరుతో కొన్ని ఆస్పత్రులు సామాన్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయని నటుడు నిఖిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సర్జరీ ఏదైనా సరే.. లక్షల్లోనే బిల్లులు కట్టించుకుంటున్నారని అన్నారు. ఈ మేరకు ఆస్పత్రి బిల్లులను ఉద్దేశిస్తూ తాజాగా నిఖిల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘నేను ఎంతోమంది ఆస్పత్రి బిల్లులు పరిశీలించాను. అందులో చాలామంది బిల్లులు రూ.10 లక్షలకు మించి ఉన్నాయి.సాధారణ సర్జరీకి కూడా మన స్థానిక ఆస్పత్రులు ఎందుకు ఇంత ఎక్కువ మొత్తాన్ని రాబట్టుకుంటున్నాయి? వీటిని నియంత్రించేది ఎవరు?’ అని నిఖిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: వైద్యం కోసం ఆస్తుల‌మ్ముకునే దుస్థితి: ఉత్తమ్

8. Cricket News: జాతివిద్వేష ట్వీట్‌తో క్రికెటర్‌ సస్పెండ్‌

ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఒలీ రాబిన్‌సన్‌కు షాక్‌! అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి అతడిని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. 2012-13లో చేసిన జాతి వివక్ష, విద్వేష, లైంగిక వ్యాఖ్యలపై విచారణ చేపట్టనుంది. వెంటనే అతడు జాతీయ శిబిరాన్ని వదిలి ససెక్స్‌కు వెళ్తాడని ప్రకటించింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగే రెండో టెస్టులో అతడు ఆడడని స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. US: కమలాహారిస్‌కు తప్పిన ప్రమాదం

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన సిబ్బంది అత్యవసరంగా విమానాన్ని దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గ్వాటెమాలా వెళ్లేందుకు కమలా హారిస్‌ ఆదివారం సాయంత్రం వాషింగ్టన్‌ నుంచి ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో బయల్దేరారు. అయితే టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతికలోపం తలెత్తింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Mango: ఒక్కో మామిడి పండు రూ.1,000

పండ్లలో రారాజుగా పిలిచే మామిడి.. ధర పలికితే రైతునూ రాజును చేయగలదు. బంగినపల్లి, నీలం, తోతాపురి ఇలా అనేక రకాల్లో లభించే ఈ పండుకు సీజన్‌లో ఉండే క్రేజే వేరు. అయితే, వీటన్నింటిలో కెల్లా మధ్యప్రదేశ్‌లోని అలీరాజాపూర్‌ జిల్లాలో లభించే ‘నూర్జహాన్’ వెరైటీకి ఉన్న  ప్రత్యేకత అంతాఇంతా కాదు. పూత దశలో ఉండగానే.. అనేక మంది వీటిని బుక్‌ చేసుకుంటుంటారు. అంతటి క్రేజ్‌ దీని సొంతం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని