Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Jul 2021 13:19 IST

1. Viveka murder case: రంగన్నతో నాకు పరిచయం లేదు: ఎర్రగంగిరెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఆయన ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి.. హత్య జరిగిన సమయంలో వివేకా ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్న రంగయ్య చేసిన ఆరోపణలపై స్పందించారు. రంగయ్యతో తనకు పరిచయమే లేదని వివరించారు. నేనెవరినీ బెదిరించలేదు అని చెప్పారు. నేను బెదిరించినట్లు కడప, పులివెందులలో ఎక్కడా కేసులు లేవని తెలిపారు. వివేకాకు తాను ద్రోహం చేసే వ్యక్తిని కాదని.. వివేకా హత్య కేసులో తనకు ప్రమేయం లేదని ఎర్రగంగిరెడ్డి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Tokyo Olympics: త్రివర్ణ పతాకం రెపరెపలు.. మీరాభాయికి రజతం

వారెవ్వా..! ఆమె సాధించింది. మీరాభాయి చాను సాధించింది.. ముందుగా చెప్పినట్టే టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ముద్దాడింది. భూమ్మీద జరిగే అత్యున్నత క్రీడల్లో.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లో ఆమె రజతం ఎత్తేసింది. ఈ మణిపుర్‌ మణిపూస భారత త్రివర్ణ పతకాన్ని అతర్జాతీయ వేదికగా రెపరెపలాడించింది.కరణం మల్లీశ్వరి తర్వాత బరువులు ఎత్తడంలో భారత్‌కు పతకం అందించింది మీరాభాయి చాను. దాదాపుగా 24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Rajkundra: రాజ్‌కుంద్రా వ్యాపారంలో శిల్పాకి వాటా ఉందా?

పోర్న్‌ రాకెట్‌ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా రాజ్‌కుంద్రా భార్య, నటి శిల్పాశెట్టిని ఆరు గంటలపాటు విచారించారు. శుక్రవారం సాయంత్రం ముంబయిలోని శిల్పా ఇంటికి చేరుకున్న ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు.. రాజ్‌కుంద్రా వ్యాపారాల గురించి ప్రశ్నించారు. కుంద్రా చేస్తున్న అశ్లీల చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో ఆమెకు ఏమైన వాటా ఉందా? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Salary: భారత్‌లో వచ్చే ఏడాది వేతనాల్లో గణనీయ పెంపు!

కరోనా లాక్‌డౌన్‌ నుంచి వ్యాపార సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం కోలుకోనున్నాయని ఓ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే వృత్తి నిపుణుల కొరత కూడా వేతనాల పెంపునకు దోహదం చేయనుందని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్‌లో ఉద్యోగుల వేతనాలు సగటున 8 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థలైన ఎయాన్‌ పీఎల్‌సీ, మైకేల్‌ పేజ్‌ రూపొందించిన నివేదిక పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Cheddi Gang: మధ్యాహ్నం మహిళల రెక్కీ.. రాత్రి మగ దొంగల బీభత్సం

ఆరు నెలలకోసారి చెడ్డీ గ్యాంగ్‌ నగర శివారు పరిధిలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా తప్పించుకుంటూ సవాల్‌ విసురుతున్నారు. ఈ గ్యాంగ్‌ ఇళ్ల తాళాలు పగలకొట్టి చాకచక్యంగా దొంగతనం చేయడంలో దిట్ట. ఒక ప్రాంతంలో అడుగుపెట్టారంటే కనీసం 3 దొంగతనాలు చేసి ఉడాయిస్తారు. పోలీసులు బృందాలుగా వీడిపోయి గస్తీ నిర్వహిస్తున్నా ఉహించని రీతిలో దొంగతనాలు చేసి మాయమవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Vaccine Booster: కొత్త వేరియంట్లకు బూస్టర్‌ డోస్ అవసరమే.. ఎయిమ్స్‌ చీఫ్‌ వ్యాఖ్యలు

కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశమున్న నేపథ్యంలో వాటి కట్టడికి బూస్టర్‌ డోసులు అవసరం పడే అవకాశముందని ఎయిమ్స్‌ చీఫ్‌ డా. రణదీప్‌ గులేరియా అభిప్రాయం వ్యక్తం చేశారు. కొవిడ్‌ కారణంగా చాలా మందిలో రోగనిరోధక శక్తి క్షీణిస్తున్న సమయంలో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం చాలా మందిలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తూ వస్తోంది. అందువల్ల కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా మనకు బూస్టర్‌ డోసుల అవసరం ఉంది’’ అని గులేరియా వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

India Corona: మరోసారి రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ

7. Karnataka politics: నేనే రాజు.. నాదే రాజ్యం.. అవకాశం ఎవరికంటే?

నేనెవరినీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిఫార్సు చేయబోనని ముఖ్యమంత్రి యడియూరప్ప తెగేసి చెప్పాక.. ఆ పదవి కోసం ఎవరికివారు పోటీకి తెరలేపారు. అధిష్ఠానం కోరినా ఎలాంటి సలహా ఇచ్చేది లేదనీ ఆయన సెలవిచ్చాక ఆశావహుల చూపు హస్తినవైపే! ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారనుకున్న రోజు రానే వస్తోంది. తర్వాతి ముఖ్యమంత్రి ఎవరో మాత్రం తేలలేదు. కర్ణాటకలో కమలదళాన్ని ముందుండి నడిపించిన రాజకీయ దిగ్గజం యడియూరప్ప తర్వాత ఆస్థానాన్ని భర్తీ చేసే నేత ఎవరో ఉత్కంఠ రేపుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Bhageerathi Amma: ‘శతాధిక విద్యార్థి’ భాగీరథీ అమ్మ కన్నుమూత

వందేళ్ల వయసులోనూ నాలుగో తరగతి పూర్తి చేసి అందరి దృష్టి ఆకర్షించిన కేరళకు చెందిన వృద్ధురాలు భాగీరథీ అమ్మ(107) శనివారం కన్నుమూశారు. వయో సంబంధిత వ్యాధుల కారణంగా గురువారం రాత్రి కొల్లాం జిల్లా ప్రక్కూలంలోని తన నివాసంలో భాగీరథీ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 105 ఏళ్ల వయసులో నాలుగో తరగతి పరీక్షలు రాసిన భాగీరథీ ఉత్తీర్ణత సాధించారు. వయసుతో సంబంధం లేకుండా చదువుపై శ్రద్ధ చూపిన ఆ వృద్ధురాలికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం అభినందనలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. TS News: తెలంగాణ ప్రభుత్వమూ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది: కోదండరామ్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని తెలంగాణ జనసమితి(తెజస) అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. ప్రజల కోసం పని చేసే మానవ హక్కుల నేతలు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్ట్‌లపై పెగాసస్‌ను వాడుతూ గోప్యతా హక్కును హరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* AP News: అవగాహనలేమితోనే సంగం డెయిరీపై విమర్శలు : ధూళిపాళ్ల

10 Rakesh Tikait: ఉద్యమం బలహీనపడలేదు.. అన్నదాతలు ఏకతాటిపై ఉన్నారు 

నూతన సాగుచట్టాలను కేంద్ర సర్కారు రద్దు చేసేంతవరకు తాము వెనక్కితగ్గేది లేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేశ్‌ టికాయిత్‌ పునరుద్ఘాటించారు. అన్నదాతలంతా ఏకతాటిపై ఉన్నారని, తమ ఉద్యమం ఏమాత్రం బలహీనపడలేదని స్పష్టంచేశారు. త్వరలో దేశవ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. 8 నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో నిరసన కొనసాగిస్తున్న రైతుసంఘాలు తాజాగా దిల్లీ నడిబొడ్డుకు చేరి, జంతర్‌ మంతర్‌ వద్ద ‘కిసాన్‌ సంసద్‌’ను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. టికాయిత్‌ను ‘ఈటీవీ భారత్‌’ పలకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని