Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లో పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Updated : 22 Oct 2021 13:17 IST

1.చంద్రబాబు దీక్ష.. తరలివస్తున్న కార్యకర్తలు

తెదేపా కార్యాలయాలపై అల్లరిమూకల దాడికి నిరసనగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష కొనసాగుతోంది. ఈరోజు రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుండటంతో చంద్రబాబుకు మద్దతుగా తెదేపా కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు. మరోవైపు కాసేపట్లో చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు.

2.‘100కోట్ల మైలురాయి’..నవ భారత్‌కు ప్రతీక

‘‘టీకా పంపిణీలో 100 కోట్ల డోసులు అనేది కేవలం సంఖ్య కాదు. దేశ సంకల్ప బలం. దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం. నవ భారతానికి ప్రతీక’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. కరోనా మహమ్మారి కోరలు వంచే వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించిన సందర్భంగా ప్రధాని నేడు దేశ ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు.

3.మాకూ బీపీ వస్తోంది.. ఏం చేస్తామో త్వరలో చూపిస్తాం: పరిటాల సునీత

అమరావతి: వైకాపా అరాచకాలపై ఇన్నాళ్లూ ఓపికతో ఉన్నామని.. ఇకపై సహించబోమని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కన్నెర్ర చేస్తే ఎవరూ మిగిలేవారు కాదని వైకాపా నేతలను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టిన దీక్షా స్థలి వద్ద సునీత మాట్లాడారు. ఈ సందర్భంగా వైకాపా నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజమహేంద్రవరం జైలుకు పట్టాభి తరలింపు

4. పాక్‌ పెద్దన్న కూడా గ్రేలిస్ట్‌లోకి..!

పాకిస్థాన్‌కు ప్రతి విషయంలో వంతపాడి పెద్దన్నగా వ్యవహరించినందుకు టర్కీ ఫలితం అనుభవిస్తోంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరు తెచ్చుకొన్న టర్కీ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సరికొత్త ఒట్టమాన్‌ సామ్రాజ్యం స్థాపించాలనుకున్న ఎర్డగాన్‌ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో భవిష్యత్తులో నిధుల కోసం కటకటలాడనుంది. ఇక ఎఫ్‌ఏటీఎఫ్‌ (ఆర్థిక కార్యదళం) నుంచి బయటపడదామన్న పాక్‌ ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు.

5.బయోకాన్‌ లాభం రూ.138 కోట్లు

బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్‌ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.138 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.169 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం తక్కువ. ఏకీకృత ఆదాయం రూ.1,750 కోట్ల నుంచి రూ.1,840 కోట్లకు పెరిగింది. కరోనా నుంచి కార్యకలాపాలు పుంజుకోవడం, సరఫరా గొలుసులోని ఇబ్బందులు తొలగిపోతున్న నేపథ్యంలో ఈ ఏడాది ద్వితీయార్ధంలో సంస్థ మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా పేర్కొన్నారు.

ఆగని పెట్రో ధరల మోత!

6. డ్రగ్స్‌ గురించి.. ఆర్యన్‌తో జోక్ చేశానన్న అనన్య పాండే..!

బాలీవుడ్‌ ఇండస్ట్రీని కుదిపేస్తున్న క్రూయిజ్‌ నౌకపై డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో తాజాగా ప్రముఖ నటుడు చుంకీ పాండే కుమార్తె, బాలీవుడ్‌ నటి అనన్య పాండే పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. నిన్న ఆమెను ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో ఆర్యన్‌ ఖాన్‌తో డ్రగ్స్‌ చాట్‌ గురించి అధికారులు ఆమెను ప్రశ్నించగా.. తాను జోక్‌ చేశానని అనన్య చెప్పినట్లు సమాచారం. 

7. రెండు దస్త్రాలపై సంతకం చేస్తే.. రూ.300 కోట్ల లంచం ఇస్తామన్నారు!

తన జీవితంలో ఎన్నడూ అవినీతితో రాజీ పడలేదని మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తెలిపారు. కొత్తగా నియమితులైన అధికారులతో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పలు విషయాలను వెల్లడించారు. ‘‘జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో రెండు దస్త్రాలపై సంతకాలు పెడితే రూ.300 కోట్లు వస్తాయని నా కార్యదర్శులు చెప్పారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆరెస్సెస్‌తో అనుబంధం ఉన్న వ్యక్తికి చెందిన సంస్థల దస్త్రాలవి. ఒత్తిళ్లకు భయపడదలచుకోలేదు. వాటిని తిరస్కరించాను.’’ అని తెలిపారు.

8. టీమ్‌ఇండియాతో పాకిస్థాన్‌ ఓడితే అంతే: బ్రాడ్‌హాగ్

టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం దాయాది జట్లు టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ మధ్య మరో రసవత్తర పోరు జరగనున్న నేపథ్యంలో క్రికెట్‌ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు రాణించడంతో పాటు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ భారత్‌ విజయం సాధించడంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మరోవైపు ప్రపంచకప్‌ టోర్నీల్లో పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియాదే పూర్తి ఆధిపత్యం కలిగిన పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లోనూ కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

టీమ్‌ఇండియా అంతా మ్యాచ్‌ విన్నర్లే..

9.ఈ డైరెక్టర్లు గ్యాప్‌ ఇచ్చినా.. హిట్‌ కొట్టారు!

సినిమాల్లో జయాపజయాలు సహజం. తమ సినిమా హిట్‌ అయినా.. ఫ్లాప్‌ అయినా మరో మంచి సినిమా తీసేందుకు దర్శకులు తహతహలాడుతారు. అయితే, కొందరు దర్శకులకు మాత్రం గత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా.. మరో సినిమా చేయడానికి చాలా కాలమే పట్టింది. కాగా.. వారంతా ఈ ఏడాదిలోనే సినిమాలు విడుదల చేసి హిట్‌ కొట్టడం విశేషం.

10.మరోసారి తగ్గిన కొత్త కేసులు.. ఎన్నంటే ?

దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. అవే హెచ్చుతగ్గులతో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ముందురోజు 18 వేలకు పెరిగిన కేసులు తాజాగా 14 శాతం మేర తగ్గాయి. మరణాలు మాత్రం మరోసారి 200 పైనే నమోదయ్యాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను వెలువరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని