Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి

Published : 29 Oct 2021 12:56 IST

1.పాలమూరు-రంగారెడ్డిపై ఎన్జీటీ స్టే

తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్టే విధించింది. ప్రాజెక్టు పనులు వెంటనే ఆపాలని.. అటవీ, పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టొద్దని ఎన్జీటీ చెన్నై బెంచ్‌ ఆదేశించింది. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం పలు అభ్యంతరాలను లేవనెత్తింది. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో ఎన్జీటీ సంతృప్తి చెందలేదు.

2.కోలుకున్నవారి కంటే కొత్త కేసులే ఎక్కువ..!

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అంతకు ముందురోజు 16 వేలకు చేరిన కేసులు.. తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే కొత్త కేసుల్లో హెచ్చుతగ్గులు.. క్రియాశీల కేసులు, రికవరీల మీద ప్రభావం చూపుతున్నాయి. తాజాగా రోజువారీ కేసుల కంటే రికవరీలే తక్కువగా ఉన్నాయి. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.

3.రోమ్‌లో మోదీ.. 12 ఏళ్ల తర్వాత అక్కడికి వెళ్లిన తొలి ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ పర్యటనకు వెళ్లారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు నిన్న రాత్రి దిల్లీ నుంచి బయల్దేరిన మోదీ.. ఈ ఉదయం రోమ్‌ చేరుకున్నారు. నేటి నుంచి అక్టోబరు 31 వరకు రోమ్‌, వాటికన్‌ సిటీ నగరాల్లో ప్రధాని పర్యటించనున్నారు. కాగా.. దాదాపు 12 ఏళ్ల తర్వాత రోమ్‌లో పర్యటిస్తున్న భారత తొలి ప్రధాని ఈయనే అని ఇటలీలోని భారత రాయబారి నీనా మల్హోత్రా వెల్లడించారు.

4.ఆర్‌బీఐ గవర్నర్‌గా మరో మూడేళ్లు శక్తికాంత దాస్‌

భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరో మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 10తో ఆయన తొలి మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయడంతో 2018లో దాస్‌ గవర్నర్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

5.టీకా వేసుకున్నవారి నుంచి కూడా డెల్టా వ్యాప్తి..!

కరోనా మహమ్మారి రక్కసిని అడ్డుకునేందుకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్‌ డోసులను కూడా అందిస్తున్నాయి. అయినా సరే యూకే, రష్యా లాంటి దేశాల్లో మళ్లీ కొవిడ్ విజృంభణ మొదలైంది. ఆయా దేశాల్లో డెల్టా రకం వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. మరి.. టీకాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా ఉద్ధృతికి కారణమేంటి?

6.ప్రపంచానికి చైనా సమర్పించు..‘భూ’చి చట్టాలు ..!

చుట్టుపక్కల దేశాలను వేధించడం మానుకొనే ఆలోచనే అసలు చైనాకు లేదు. ఈ ఏడాది ఆ దేశం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద చట్టాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ‘కోస్టు గార్డు చట్టం’, ‘మారిటైమ్‌ లా’ పేరిట దక్షిణ చైనా సముద్రాన్ని మింగేసేందుకు రంగం సిద్ధం చేసింది. తాజాగా ‘ల్యాండ్‌ బోర్డర్‌ చట్టం’ పేరుతో మరో చట్టాన్ని చేసింది. దీంతో సరిహద్దు దేశాలతో జగడాలను హింసాత్మకంగా మార్చాలని చూస్తోంది.

7.కేటీఆర్‌ సర్‌.. ఇదెక్కడి న్యాయం చెప్పండి: అనసూయ

చిన్నారుల భద్రత విషయంలో కొన్ని పాఠశాలలు అనుసరిస్తోన్న తీరుపై నటి, ప్రముఖ వ్యాఖ్యాత అనసూయ అసహనం వ్యక్తం చేశారు. పిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని  పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయని ఆమె అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్‌ ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ శుక్రవారం ఉదయం ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు.

8.భారత్‌పై కివీస్‌దే ఆధిపత్యం.. కోహ్లీసేన 18 ఏళ్ల రికార్డు తిరగరాయాలి..!

భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు మరో రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2021 (T20 world cup 2021)లో ఆదివారం కీలక మ్యాచ్‌లో తలపడనున్నాయి. రెండు జట్లూ  పాకిస్థాన్‌తో ఓటమిపాలైన నేపథ్యంలో సెమీస్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అయితే, ఐసీసీ టోర్నీల్లో రెండు దశాబ్దాలుగా టీమ్‌ఇండియాకు షాకిస్తున్న న్యూజిలాండ్‌ ఈసారి కూడా తన విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది.

కోహ్లీ బ్యాటింగ్‌ చూసి వారిద్దరికీ మాటలు రాలేదు..

9.ప్రభుత్వ నిర్ణయంతో పడిలేచిన ఐఆర్‌సీటీసీ షేరు

ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఐఆర్‌సీటీసీ షేర్లు శుక్రవారం భారీ స్థాయిలో పతనమయ్యాయి. దీంతో వ్యాపార వర్గాలు, మార్కెట్‌ నిపుణులు సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత్యంతరం లేక వెనక్కి తగ్గిన సర్కార్‌.. ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుంది. దీంతో షేర్లు మళ్లీ  పుంజుకున్నాయి.

10.నవంబర్‌లో వచ్చే నయా స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..!

మొబైల్‌ ప్రియులను అలరించేందుకు మరిన్ని స్మార్ట్‌ఫోన్లు (Smartphones) రాబోతున్నాయి. గత పది నెలల్లో అదిరిపోయే ఫోన్లు రిలీజ్‌ అయ్యాయి. బేసిక్‌, బడ్జెట్‌, మిడ్‌ రేంజ్‌, ఫ్లాగ్‌షిప్‌ ఇలా వివిధ విభాగాల్లో వచ్చిన స్మార్ట్‌ ఫోన్లు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఒక రేంజ్‌ అనుకుంటే.. వాటిని మించి మరిన్ని ప్రత్యేకతలతో నవంబర్‌ నెలలో కొత్త మొబైల్స్‌ (November Smartphones) మార్కెట్‌లోకి సందడి చేయనున్నాయి.

అసలు వాట్సాప్‌ చాట్స్‌ ఎలా లీక్‌ అవుతున్నాయి?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని