Top 10 News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 28 Nov 2021 13:09 IST

1.వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలి : చంద్రబాబు

వరదల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎస్‌ సమీర్‌శర్మకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ.6,054 కోట్ల నష్టం వాటిల్లిందని తేలితే.. కేవలం రూ.35 కోట్లు విడుదల చేయడం సరికాదన్నారు.. ప్రకృతి వైపరీత్యాల  నిధులనూ దారి మళ్లించినట్లు కాగ్‌ తప్పుబట్టినట్లు పేర్కొన్నారు.

2.రెండో ఇన్నింగ్స్‌లో తడబడిన టీమ్‌ఇండియా

టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో పూర్తిగా తేలిపోయింది. 14/1తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత జట్టు భోజన విరామ సమయానికి 84/5తో నిలిచింది. టాప్‌ ఆర్డర్‌ మొత్తం కుప్పకూలింది. కైల్‌ జేమీసన్‌ 2/21, టిమ్‌సౌథీ 2/27, అజాజ్‌ పటేల్‌ 1/29 రాణించడంతో భారత్‌ కష్టాల్లోపడింది.

3.కొత్త వేరియంట్‌పై భారత టాప్‌ వైరాలజిస్ట్‌ ఏమన్నారంటే..

ప్రపంచాన్ని భయపెడుతున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రముఖ శాస్త్రవేత్త గగన్‌దీప్‌ కాంగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వేరియంట్‌ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే రోగనిరోధక శక్తిని కూడా ఇది తట్టుకునే వీలుందని పేర్కొన్నారు. భారత్‌లో టాప్ మైక్రో బయాలజిస్ట్‌, వైరాలజిస్ట్‌ల్లో ఒకరైన గగన్‌ దీప్‌ ప్రస్తుతం వెల్లూర్‌ క్రిస్టియన్‌ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

4.భేష్‌.. దక్షిణాఫ్రికా! ప్రపంచానికి ఆదర్శంగా నిలిచావ్‌: అమెరికా

దక్షిణాఫ్రికాపై అగ్రరాజ్యం అమెరికా ప్రశంసలు కురిపించింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వెలుగుచూసిన విషయం తెలిసిందే. కాగా, ఆ దేశం కొత్త వేరియంట్‌ను గుర్తించి.. వెంటనే ప్రపంచ దేశాలకు సమాచారం ఇవ్వడం గొప్ప విషయమని సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్‌ అన్నారు. శనివారం ఆయన దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలెడి పాండొర్‌తో సమావేశమయ్యారు.

5.543 రోజుల కనిష్ఠానికి క్రియాశీల కేసులు

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 10,91,236 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 8,774 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 9,481 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా.. వారిలో 3.39 కోట్ల మంది వైరస్‌ను జయించారని కేంద్రం వెల్లడించింది.

6.ఒమిక్రాన్‌.. ఓ హెచ్చరిక సంకేతం : సౌమ్య స్వామినాథన్‌

భారత్‌లో తగిన కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడానికి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. ఓ హెచ్చరిక సంకేతం లాంటిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. ఆమె ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ కొత్త వేరియంట్‌ కట్టడికి పలు సూచనలు చేశారు. కట్టుదిట్టమైన కొవిడ్‌ నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు.

7. మోదీకి ‘రాగం’తో పేరు పెట్టిన విజ్లింగ్‌ విలేజ్‌!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. కాంగ్‌థాంగ్‌(విజ్లింగ్‌ విలేజ్‌) ప్రజలు వారి సంప్రదాయం ప్రకారం.. మోదీకి ప్రత్యేక రాగంతో పేరు పెట్టారు. గ్రామం పర్యటకంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీ గౌరవర్థంగా ఈ పేరు పెడుతున్నట్లు మేఘాలయ సీఎం కె. సంగ్మా ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌కు స్పందించిన మోదీ.. తనకు పేరు పెట్టినందుకు ఆ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

8.‘అఖండ’ హైలైట్స్‌‌ అదుర్స్‌.. బాలయ్య చేతికి గాయం.. కారణమదే

మాస్‌ పల్స్‌ తెలిసిన నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అఖండ’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. డిసెంబర్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘అఖండ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఎంతో వేడుకగా నిర్వహించారు.

9.ద్రవిడ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్న కేఎస్‌ భరత్: లక్ష్మణ్‌

టీమ్‌ఇండియా యువ కీపర్‌, బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌ హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని దిగ్గజ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శనివారం భరత్‌.. వృద్ధిమాన్‌ సాహాకు బదులుగా వికెట్‌ కీపింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతడు మూడు కీలక వికెట్లు తీయడంలో భాగస్వామి అయ్యాడు.

10.సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి

గచ్చిబౌలి ఫరిదిలోని కొండాపూర్‌ గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని శివదుర్గ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు మొత్తం నలుగురు కూలీలు వచ్చారు. మొదటగా ఇద్దరు కూలీలు లోపలికి దిగి ఊపిరాడటం లేదని వెంటనే బయటకు వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని