Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 29 Feb 2024 15:26 IST

1.ఉత్తరాంధ్రకు తుపాను హెచ్చరికలు.. సీఎం జగన్‌ సమీక్ష

ఉత్తరాంధ్రకు తుపాను హెచ్చరికల దృష్ట్యా ఆయా జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తచర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అవసరమైన అన్ని చోట్లా సహాయ శిబిరాలు తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని.. లోతట్టు, ముంపు ప్రాంతాలుంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

2.ఆంక్షలు దాటుకుంటూ ‘మహాపాదయాత్ర’ ముందుకు..

అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 32వ రోజు కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మర్రిపల్లె నుంచి ప్రారంభమైన ఇవాళ్టి యాత్ర 14కి.మీ మేర సాగి తురిమెర్ల వద్ద ముగియనుంది. తుమ్మలతలుపూరు వద్ద రైతులు మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో చేపట్టిన యాత్రలో తెదేపా, భాజపా నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు.

3.వరద బాధితులకు అల్లు అర్జున్‌ చేయూత

ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులను ఆదుకునేందుకు నటుడు అల్లు అర్జున్‌ ముందుకొచ్చారు. తన వంతు ఆర్థికసాయాన్ని ప్రకటించి ఉదారత చాటుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు గురువారం ఉదయం ఆయన ప్రకటించారు. వరద బాధిత జిల్లాలు త్వరితగతిన సాధారణ పరిస్థితికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

4.కొవిషీల్డ్‌ను బూస్టర్‌ డోసుగా గుర్తించాలి: డీసీజీఐకి ‘సీరం’ వినతి 

కొవిషీల్డ్‌ను బూస్టర్‌ డోసుగా ఇచ్చేందుకు అనుమతించాలని తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కోరింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసింది. దీని మాతృక టీకా అయిన ఆస్ట్రాజెనెకాకు బ్రిటన్‌ ప్రభుత్వం బూస్టర్‌ డోసుగా గుర్తించిందని సీఐఐలో ప్రభుత్వం తరఫున డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రకాశ్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు.

5.9వేలకు పైగా కరోనా కేసులు.. తగ్గిన రికవరీలు..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే, రోజువారీ కేసుల్లో మాత్రం హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. తాజాగా 11,08,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,765 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కేరళలో 5వేలమందికి పైగా కరోనా బారినపడ్డారు. ముందురోజుతో పోల్చితే 9 శాతం అధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 8,548 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

6.ఒమిక్రాన్‌.. యువతకే ఎక్కువ సోకుతోంది: దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’పై భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్‌ క్రమంగా ప్రపంచదేశాలకు విస్తరిస్తుండటమే ఇందుకు ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే ఒమిక్రాన్‌ 20 దేశాలకు పాకినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఈ వేరియంట్‌పై వైద్యశాస్త్రవేత్తలు పరిశోధనలను ముమ్మరం చేసినా ఫలితం కనిపించట్లేదు.

7.తుది జట్టులో ఎవరు ఉంటారు.. ఎవరికి దక్కేనో అవకాశం!

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ ఫలితం ఎలా ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం అసలైన క్రికెట్‌ రుచిని ఆస్వాదించేలా చేసింది. తాత్కాలిక సారథి అజింక్య రహానె బ్యాటింగ్‌లో (35, 4) విఫలమైనా జట్టును నడిపించడంలో మాత్రం విజయం సాధించాడనే చెప్పాలి. యువ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్ (105, 65) అరంగేట్రంలోనే చెలరేగిపోయాడు. బౌలర్లూ తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే, రెండో టెస్టుకు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ జట్టుతోపాటు చేరనున్నాడు. 

రహానె కన్నా పుజారాపైనే ఒత్తిడెక్కువ: జహీర్

8.చేపల వేటకు వెళ్లిన 15 పడవలు గల్లంతు

గుజరాత్ గిర్ సోమనాథ్ లోని నవ్ బందర్ ప్రాంతంలో సుమారు 15 పడవలు గల్లంతయ్యాయి. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి వస్తుండగా.. ఉనా ప్రాంతంలో పడవలు మునిగిపోయాయి. అందులో ఉన్న పలువురు మత్స్యకారులు కనిపించకుండా పోయారు. సుమారు 10 నుంచి 15 మంది మత్స్యకారులు గల్లంతై ఉండొచ్చని.. స్థానికులు తెలిపారు.

9.కొవిడ్‌ మాత్ర వినియోగానికి.. అమెరికా ఎఫ్‌డీఏ సానుకూలం

అంతర్జాతీయ ఫార్మా సంస్థ మెర్క్‌ రూపొందించిన కొవిడ్‌ ఔషధం మోల్నూపిరవిర్‌ వినియోగంపై అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌కు(ఎఫ్‌డీఏ) చెందిన ఆరోగ్య సలహాదారుల కమిటీ సానుకూలంగా స్పందించింది. దీంతో ఈ ఔషధం త్వరలోనే అమెరికా పౌరులు వినియోగించేందుకు మార్గం సుగమం అయింది.

10.డల్లాస్‌లో ‘అఖండ’ హడావుడి

నటసింహాం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ బాక్సాఫీస్‌ రోరింగ్ ప్రారంభమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో థియేటర్ల వద్ద వాతావరణం కోలాహలంగా మారింది. ‘జై బాలయ్య’ అంటూ నందమూరి అభిమానులు నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు