Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 14 Jan 2022 13:21 IST

1.రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహమా?:రఘురామకృష్ణరాజు

తాను రాజ్యాంగం, చట్టాలు, కోర్టులను నమ్మే వ్యక్తినని.. ఏపీ సీఐడీ పోలీసుల విచారణకు హాజరవుతానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ నేతృత్వంలోని ఓ బృందం వచ్చి తనకు నోటీసులు అందించిందని.. ఈనెల 17న విచారణకు రావాలని వారు కోరినట్లు చెప్పారు. హిందువులకు సంక్రాంతి చాలా ముఖ్యమైన పండగని.. ఇన్నాళ్లూ ఆగి పండగ రోజుల్లోనే నోటీసులు ఇవ్వడమేంటని రఘురామ ప్రశ్నించారు.

2.కొనసాగుతోన్న ఉగ్రరూపం.. 2 లక్షలకు చేరువైన కొత్త కేసులు..!

దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా లక్షపైనే నమోదవుతోన్న కొత్త కేసులు తాజాగా రెండు లక్షలకు చేరువయ్యాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 5వేలకు సమీపించాయి. నిన్న 400కు పైగా కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.

3.కరోనాతో కలిసి బతికే దశకు అమెరికా..!

అమెరికాలో కరోనావైరస్‌ (coronavirus), ఒమిక్రాన్‌ (Omicron) వేరియంట్‌ కారణంగా కేసుల ఉప్పెన కొనసాగుతోంది. ఈ వ్యాధిని తట్టుకొని మనిషి మనుగడ సాగించే స్థితికి అమెరికా వెళ్తోందని ఆ దేశ టాప్‌ అంటువ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన అమెరికాలోని ప్రఖ్యాత సెంటర్‌ ఫర్ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ (సీఎస్‌ఐఎస్‌)లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

4.లేటుగా వచ్చినా..లేటెస్టుగా.. అదే రిలయన్స్‌ వ్యూహం!

వస్త్ర వ్యాపారంతో ప్రారంభమైన రిలయన్స్‌ ప్రస్థానం ఇప్పుడు అనేక రంగాలకు విస్తరించింది. ఒకప్పుడు అన్నీ తానే ప్రారంభించి అభివృద్ధి చేయాలని తహతహలాడిన కంపెనీ ఇప్పుడు కాస్త వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది! టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పుల దృష్ట్యా ఆయా రంగాల్లోని ఇతర కంపెనీలతో కలిసి నడవాల్సిన అవసరమూ ఉందని గుర్తించినట్లు అర్థమవుతోంది.

5.అమెరికాకు యథేచ్ఛగా బర్మా టేకు

మయన్మార్‌లో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికార పగ్గాలు చేపట్టిన సైన్యాన్ని ఆంక్షల పిడికిలిలో బిగించడంలో అమెరికా విఫలమవుతోంది. ఆ దేశంతో వ్యాపార లావాదేవీలు జరపకుండా తమ సంస్థలను నిలువరించలేకపోతోంది. ప్రధానంగా మయన్మార్‌ నుంచి అగ్రరాజ్యానికి టేకు దిగుమతులు యథేచ్ఛగా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ ఎగుమతుల ద్వారా భారీగా సొమ్ము దక్కుతుండటంతో సైనిక ప్రభుత్వం ధీమాగా ఉంటోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

6. ‘‘అంకుశం’లో రామిరెడ్డిని నిజంగానే కొట్టా.. ‘గరుడ వేగ-2’ తీస్తున్నాం!

మూడున్నర దశబ్దాలుగా ఎన్నో విభిన్న పాత్రలతో తెలుగు తెరపై యాంగ్రీ స్టార్‌గా వెలుగొందుతున్న నటుడు రాజశేఖర్‌. ఆయన భార్య జీవిత.. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, నిత్యం భర్తకు వెన్నంటే తోడుగా ఉంటూ ముందుకెళ్తున్నారు. వారి ఇద్దరు కుమార్తెలూ హీరోయిన్లుగా తెరంగేట్రం చేసి విజయాలు అందుకున్నారు. సినిమా తమకు పంచప్రాణాలైతే.. కుటుంబం ఆరో ప్రాణంగా బతికే రాజశేఖర్‌ దంపతులు.. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

7.50 లక్షల మందితో మోదీ 3డీ సభ!

ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ వర్చువల్‌ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభకు అధునాతన సాంకేతికతతో కమలనాథులు హంగులు అద్దుతున్నారు. వందలాది చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసి.. మోదీ ప్రసంగాన్ని త్రీడీ ప్రొజక్షన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. సంక్రాంతి తర్వాత జరిగే ఈ ర్యాలీ కోసం భాజపా ఏర్పాట్లు చేస్తోంది. భౌతిక ర్యాలీలపై ఈ నెల 15 వరకు నిషేధం ఉన్న నేపథ్యంలో వీలైనంతమందికి చేరువయ్యేలా ఆన్‌లైన్‌ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది.

8.డియర్‌ సైనా.. క్షమించు.. నువ్వెప్పటికీ మా ఛాంపియన్‌వే: సిద్ధార్థ్‌

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో నటుడు సిద్ధార్థ్‌ నేడు క్షమాపణలు తెలిపారు. తాను కేవలం జోక్‌ చేయాలనే ఉద్దేశంతోనే ఆ ట్వీట్‌ చేశానని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలు చాలా మందిని బాధించేలా ఉన్నందున తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

9.కోహ్లీ అహాన్ని వదిలేసి ఆడాడు : గౌతమ్‌ గంభీర్‌

దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అహం వదిలేసి ఆడాడని మాజీ క్రికెటర్‌ గౌతమ్ గంభీర్ అన్నాడు. క్రమశిక్షణతో ఆడుతూ ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. అతడి షాట్‌ సెలెక్షన్‌ మెరుగ్గా ఉందని ప్రశంసించాడు.

10.‘రాధేశ్యామ్‌’పై నమ్మకమది..ప్రభాస్‌ మీ హృదయాల్లో డ్యాన్స్‌ చేస్తాడు: రాధాకృష్ణ

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. పూజాహెగ్డే కథానాయిక. యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రేక్షకుల ముందుకురావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని